Thalaivar 171: అఫీషియల్.. రజనీ ఫ్యాన్స్‌కు పండగే.. విక్రమ్ డైరెక్టర్‌తో మూవీ అనౌన్స్‌మెంట్
Thalaivar 171: అఫీషియల్.. రజనీ ఫ్యాన్స్‌కు మరో పండగ రానుంది. విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో సన్ పిక్చర్స్ మూవీ అనౌన్స్ చేసింది. తలైవా 171 పోస్టర్ సోమవారం (సెప్టెంబర్ 11) రిలీజ్ చేశారు.
Thalaivar 171: సూపర్ స్టార్ రజనీకాంత్ ఫ్యాన్స్ జైలర్ సక్సెస్ నే ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు. ఇప్పుడు మరో పండగలాంటి వార్త వచ్చింది. గతేడాది విక్రమ్ లాంటి సూపర్ డూపర్ హిట్ అందించిన డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో రజనీ మూవీ అనౌన్స్ అయింది. సన్ పిక్చర్స్ సోమవారం (సెప్టెంబర్ 11) ఈ సినిమాను అధికారికంగా ప్రకటించింది.
ట్రెండింగ్ వార్తలు
తలైవా 171 సినిమాకు కూడా అనిరుధ్ రవిచందరే మ్యూజిక్ అందించనున్నాడు. లోకేష్ తో సూపర్ స్టార్ సినిమా చేయబోతున్నాడని ఎన్నో నెలలుగా వార్తలు వస్తున్నా.. ఇప్పుడు సన్ పిక్చర్స్ ఆ సస్పెన్స్ కు తెరదించుతూ మూవీని అనౌన్స్ చేసింది. ఈ సినిమాను పక్కన పెట్టేస్తున్నారని ఈ మధ్యే వార్తలు వచ్చిన నేపథ్యంలో సన్ పిక్చర్స్ సోమవారం అధికారిక ప్రకటన చేసినట్లు భావిస్తున్నారు.
ఈ ఏడాది జైలర్ మూవీతో కెరీర్లోనే రెండో అతిపెద్ద హిట్ అందుకున్న రజనీకాంత్.. వచ్చే ఏడాదికి మరో మోస్ట్ అవేటెడ్ మూవీని అందించబోతున్నాడు. తలైవా 171 తమిళ ఇండస్ట్రీలోని అన్ని రికార్డులను బ్రేక్ చేయడం ఖాయం. 2022లో సీనియర్ నటుడు కమల్ హాసన్ తో కలిసి మ్యాజిక్ చేశాడు లోకేష్ కనగరాజ్. ఇప్పుడు రజనీతో ఎలాంటి మూవీ తీయబోతున్నాడో అన్న ఆసక్తి నెలకొంది.
తలైవా 171 షూటింగ్ మాత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది దీపావళికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. జైలర్ మూవీతో రజనీలో కొత్త ఉత్సాహం వచ్చింది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.600 కోట్లకుపైగా వసూలు చేసింది. రజనీ 2.0 మూవీ (రూ.650 కోట్లు) తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన రెండో తమిళ సినిమాగా జైలర్ నిలిచింది.
తలైవా 170 ఎప్పుడు?
లోకేష్ కనగరాజ్ తో తలైవా 171 కంటే ముందు రజనీకాంత్ తన 170వ మూవీలో నటించనున్నాడు. ఈ సినిమాను అతడు జై భీమ్ డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ తో చేస్తున్నాడు. తలైవా 170ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.
ఈ సినిమా గురించి సమాచారం పెద్దగా బయటకు రావడం లేదు. మరోవైపు లోకేష్ కూడా లియో మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు నడుస్తున్నాయి. ఇందులో విజయ్ దళపతి నటిస్తున్న విషయం తెలిసిందే. లియో మూవీ అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది.