Thaggedele Movie Review: త‌గ్గేదేలే మూవీ రివ్యూ - దండుపాళ్యం డైరెక్ట‌ర్ సినిమా ఎలా ఉందంటే-thaggedele movie review naveen chandra starrer routine crime thriller ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Thaggedele Movie Review Naveen Chandra Starrer Routine Crime Thriller

Thaggedele Movie Review: త‌గ్గేదేలే మూవీ రివ్యూ - దండుపాళ్యం డైరెక్ట‌ర్ సినిమా ఎలా ఉందంటే

Nelki Naresh Kumar HT Telugu
Nov 04, 2022 06:16 AM IST

Thaggedele Movie Review: న‌వీన్‌చంద్ర‌, ర‌విశంక‌ర్‌, దివ్య‌పిళ్లై ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సినిమా త‌గ్గేదేలే. దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాస‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందంటే...

త‌గ్గేదేలే మూవీ
త‌గ్గేదేలే మూవీ

Thaggedele Movie Review: రియ‌లిస్టిక్ క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన దండుపాళ్యం సినిమా క‌న్న‌డంతో పాటు తెలుగులో క‌మ‌ర్షియ‌ల్ హిట్‌గా నిలిచింది. దండుపాళ్యం ఫేమ్ శ్రీనివాస‌రాజు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన తాజా చిత్రం త‌గ్గేదేలే. న‌వీన్‌చంద్ర‌, దివ్య‌పిళ్లై, అన‌న్య‌రాజ్, ర‌విశంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా శుక్ర‌వారం విడుద‌లైంది. టీజ‌ర్ ట్రైల‌ర్స్‌లో దండుపాళ్యం బ్యాచ్ క‌నిపించ‌డంతో పాటు డిఫ‌రెంట్ టైటిల్‌తో ఈ సినిమా తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించింది. దండుపాళ్యం సినిమాతో త‌గ్గేదేలేకు ఉన్న లింక్ ఏమిటి? ఆ సూప‌ర్ హిట్ మ్యాజిక్‌ను శ్రీనివాస‌రాజు మ‌రోసారి రిపీట్ చేశాడా లేదా అన్న‌దే తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే...

ట్రెండింగ్ వార్తలు

Thaggedele Plot- మూడు ఉప‌క‌థ‌ల‌తో

ఈశ్వ‌ర్ (న‌వీన్‌చంద్ర‌) ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. అత‌డి ఇంట్లో లిజి (అన‌న్య‌రాజ్‌) అనే అమ్మాయి హ‌త్య‌కు గుర‌వుతుంది. డ్ర‌గ్స్ ముఠాతో ఆ యువ‌తికి సంబంధాలు ఉంటాయి. ఈశ్వ‌ర్ కూడా ఆ ముఠాకు చెందిన వాడే అనే అనుమానంతో పోలీస్ ఆఫీస‌ర్స్ చ‌ల‌ప‌తి (ర‌విశంక‌ర్‌) రాజా (రాజా ర‌వీంద్ర‌)లు ఈశ్వ‌ర్‌ను ఇంట‌రాగేష‌న్ కోసం ఓ దాబాకు తీసుకెళ్తారు. మ‌రోవైపు చ‌ల‌ప‌తి కార‌ణంగా ప‌దేళ్ల శిక్ష‌ను అనుభ‌వించిన దండుపాళ్యం గ్యాంగ్‌ అత‌డిపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని జైలు నుంచి త‌ప్పించుకుంటారు. అత‌డిని చంప‌డానికి దాబాకు బ‌య‌లుదేరుతారు.

మైఖేల్ (అయ్య‌ప్ప పి శ‌ర్మ‌) అనే రౌడీకి చెందిన వంద‌ల కోట్ల విలువైన డ్ర‌గ్స్ కూడా అనుకోకుండా చ‌ల‌ప‌తి ఉండే దాబాకు చేరుతాయి. ఈశ్వ‌ర్ గురించి ఇంటారాగేష‌న్‌లో చ‌ల‌ప‌తి తెలుసుకున్న నిజాలేమిటి? అత‌డి ఇంట్లో చ‌నిపోయిన లిజి ఎవ‌రు? ఈ హ‌త్య‌తో ఈశ్వ‌ర్ భార్య దేవికి (దివ్య పిళ్లై) సంబంధం ఉందా? ఈ హ‌త్య కేసు నుంచి ఈశ్వ‌ర్‌తో పాటు అత‌డి భార్య నిర్ధోషులుగా బ‌య‌ట‌ప‌డ్డారా? చ‌ల‌ప‌తిని చంపాల‌ని అనుకున్న డీ గ్యాంగ్ ప్ర‌య‌త్నం ఫ‌లించిందా? లేదా? ఆ దాబాలో ఏం జ‌రిగింది అన్న‌దే ఈ సినిమా మిగ‌తా క‌థ

Thaggedele Story Analysis -రిపీట్ స్టోరీ

ఓ సినిమా తాలూకు విజ‌యం ప్ర‌భావం నుంచి కొన్ని సార్లు ద‌ర్శ‌కులు సుల‌భంగా బ‌య‌ట‌కు రాలేరు. ఇమేజ్ ఛ‌ట్రంలో ఇరుక్కుపోయి ఒకే త‌ర‌హా సినిమాలు తీస్తుంటారు. ఒకసారి వ‌ర్క‌వుట్ అయిన మ్యాజిక్ మ‌రోసారి రిపీట్‌ అవ‌డం క‌ష్టమ‌నే వాస్త‌వాన్ని గ్ర‌హించ‌లేక‌పోవ‌డ‌మో లేదంటే ప్రేక్ష‌కులు త‌మ నుంచి అలాంటి క‌థ‌ల‌నే కోరుకుంటున్నార‌నే అపోహతోనే తెలిసిన‌ క‌థ‌ల‌నే మ‌ళ్లీ మ‌ళ్లీ చెప్పేందుకు ప్ర‌య‌త్నిస్తుంటారు.

దండుపాళ్యం సినిమాతో ద‌ర్శ‌కుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు శ్రీనివాస‌రాజు. ఈ సినిమా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ కావ‌డంతో కొన‌సాగింపుగా మ‌రో రెండు భాగాలు తెర‌కెక్కించాడు. తాజాగా దండుపాళ్యం సినిమాలోని మెయిన్ క్యారెక్ట‌ర్స్‌ను తీసుకొని వాటికి ఓ ఫ్యామిలీ డ్రామా, మ‌ర్డ‌ర్ మిస్ట‌రీని జోడించి త‌గ్గేదేలే సినిమాను తెర‌కెక్కించాడు.

దండుపాళ్యం -4

ఒక‌ర‌కంగా త‌గ్గేదేలే సినిమాను దండుపాళ్యం -4 అనే చెప్ప‌వ‌చ్చు. ఎన్నో హ‌త్య‌లు చేసిన దండుపాళ్యం బ్యాచ్‌ చివ‌ర‌కు ఎలా హ‌త‌మైందో ఈ సినిమాలో చూపించారు. ఆ పాయింట్‌ను సింపుల్‌గా తేల్చేయ‌కుండా స్క్రీన్‌ప్లే మ్యాజిక్‌తో ప్రేక్ష‌కుల్ని ఎంగేజ్ చేయాల‌ని ద‌ర్శ‌కుడు శ్రీనివాస‌రాజు భావించారు.

త‌గ్గేదేలే సినిమా మ‌ర్డ‌ర్ సీన్‌తో ఇంట్రెస్టింగ్‌గా మొద‌ల‌వుతుంది. ఈశ్వ‌ర్ ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌తో పాటు దండుపాళ్యం గ్యాంగ్ జైలు నుంచి త‌ప్పించుకోండం, డ్ర‌గ్ మాఫియా మూడు క‌థ‌ల‌ను లింక్ చేస్తూ చివ‌రి వ‌ర‌కు సినిమాను న‌డిపించారు డైరెక్ట‌ర్‌. క్లైమాక్స్‌లో అంద‌రూ ఒక చోట చేరుకున్న‌ట్లుగా చూపించి ఎండ్ చేశారు.

అడ‌ల్ట్ కామెడీ...

సినిమా క‌థ మొత్తం న‌వీన్‌చంద్ర క్యారెక్ట‌ర్ చుట్టూ తిరుగుతుంది. క ఈ మెయిన్ స్టోరీ మొత్తం టైమ్ పాస్ వ్య‌వ‌హారంలా రాసుకున్నాడు డైరెక్ట‌ర్‌. అత‌డి ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ లో ఫ‌స్ట్ హాప్ మొత్తం అడ‌ల్ట్‌ కామెడీతో నింపేశాడు డైరెక్ట‌ర్‌. డ‌బుల్ మీనింగ్ డైలాగ్స్‌తో కూడిన ఆ సీన్స్ చికాకును తెప్పిస్తాయి. న‌వీన్ చంద్ర ఫ్లాష్ బ్యాక్‌లోని ట్విస్ట్‌ను చివ‌రి వ‌ర‌కు హోల్డ్ చేస్తూ థ్రిల్ పంచాల‌నే ప్ర‌య‌త్నంలో సినిమాను సాగ‌దీశాడు ద‌ర్శ‌కుడు. ఆ ట్విస్ట్ కూడా గొప్ప‌గా ఉండ‌దు.

ఖైదీ సినిమా గుర్తొస్తుంది...

దండుపాళ్యం బ్యాచ్ స్టోరీ కూడా క‌థ‌కు స‌రిగ్గా అత‌క‌లేదు. కేవ‌లం వారి క్యారెక్ట‌ర్స్‌ను ఎండ్ చేయ‌డానికే సినిమాలో ఇరికించిన‌ట్లుగా అనిపిస్తుంది. డ్ర‌గ్ మాఫియా స్టోరీ మొత్తం కార్తి ఖైదీ సినిమాను గుర్తుకుతెస్తుంది. క్రైమ్‌, కామెడీ, ల‌వ్‌, యాక్ష‌న్ అన్ని జోన‌ర్‌ల‌ను మిక్స్ చేసి త‌గ్గేదేలే సినిమాను డైరెక్ట‌ర్ కిచిడి చేసేశాడు. క్లైమాక్స్ ఫైట్‌లో వ‌చ్చే హింస‌, శాడిజాన్ని త‌ట్టుకుంటూ థియేట‌ర్‌లో కూర్చోవ‌డం క‌ష్ట‌మే.

Actors Performance -ఎమోష‌న‌ల్ రోల్‌...

భార్య‌కు ప్రియురాలికి మ‌ధ్య న‌లిగిపోయే సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా ఎమోష‌న‌ల్ క్యారెక్ట‌ర్‌లో న‌వీన్‌చంద్ర ఆక‌ట్టుకున్నాడు. ఇదివ‌ర‌కు ఇలాంటి క్యారెక్ట‌ర్ చాలా చేసి ఉండ‌టంతో ఈజీగా న‌టించాడు. అన‌న్య రాజ్ గ్లామ‌ర్‌తో మెప్పించింది. దివ్య‌పిళ్లై యాక్టింగ్ ప‌రంగా ఒకే అనిపించింది. చ‌ల‌ప‌తి అనే పోలీస్ ఆఫీస‌ర్‌గా ర‌విశంక‌ర్‌కు మంచి క్యారెక్ట‌ర్ ద‌క్కింది. దండుపాళ్యం గ్యాంగ్ క్యారెక్ట‌ర్స్ రొటీన్‌గా సాగాయి. చిన్నా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ సినిమాకు బాగా హెల్ప‌యింది.

దండుపాళ్యం ఫ్యాన్స్‌కు మాత్ర‌మే- Thaggedele Movie Review:

దండుపాళ్యం ఫ్యాన్స్‌ను త‌ప్ప రెగ్యుల‌ర్ ఆడియెన్స్‌ను త‌గ్గేదేలే మెప్పించ‌డం క‌ష్ట‌మే. టైటిల్‌తో పాటు దండుపాళ్యం క్రేజ్‌ను క్యాష్ చేసుకోవ‌డానికి చేసిన ఓ వృథా ప్ర‌య‌త్న‌మిది.

రేటింగ్: 2/5

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.