TV Serial Actor: తెలుగు టీవీ సీరియల్ నటుడు అరెస్ట్.. నటిపై లైంగిక వేధింపులు.. ఆ ఫొటోలు బయటపెడతానంటూ..
TV Serial Actor arrest: తెలుగుతోపాటు కన్నడ టీవీ సీరియల్స్ లో నటించే చరిత్ బాలప్పను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ టీవీ సీరియల్ నటిని లైంగికంగా వేధించాడన్న ఆరోపణల నేపథ్యంలో అతన్ని శుక్రవారం (డిసెంబర్ 27) బెంగళూరులో అరెస్ట్ చేయడం గమనార్హం.
TV Serial Actor arrest: నటిపై లైంగిక వేధింపుల ఆరోపణలతో మరో తెలుగు, కన్నడ టీవీ సీరియల్ నటుడు అరెస్ట్ అయ్యాడు. అతని పేరు చరిత్ బాలప్ప. తనను లైంగిక వేధించడంతోపాటు దాడి చేశాడని, భయపెట్టాడని సదరు టీవీ సీరియల్ నటి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ వేధింపులకు గురైన నటి కూడా పలు తెలుగు, కన్నడ సీరియల్స్ లో నటించిన వ్యక్తే కావడం గమనార్హం.
చరిత్ బాలప్ప అరెస్ట్
కన్నడ సీరియల్ ముద్దులక్ష్మిలాంటి వాటితో పాపులర్ అయిన నటుడు చరిత్ బాలప్ప. అతడు నవంబర్ 1 నుంచి డిసెంబర్ 13 మధ్య తనను లైంగికంగా వేధించినట్లు 29 ఏళ్ల ఆ నటి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017 నుంచి అతడు తనకు తెలుసని కూడా ఫిర్యాదులో ఆమె వెల్లడించింది.
తన మంచితనాన్ని ఆసరాగా తీసుకొని ప్రేమించాలంటూ ఒత్తిడి తెచ్చాడని, శారీరక సంబంధం పెట్టుకోవాలనీ బెదిరించినట్లు ఆమె తెలిపింది. ఒకవేళ కాదంటే తన పరువు తీస్తానని కూడా హెచ్చరించినట్లు చెప్పింది. తాను ఒంటరిగా ఉంటానని తెలిసిన అతడు.. ఓసారి మరో వ్యక్తితో కలిసి తన ఇంట్లోకి బలవంతంగా దూసుకొచ్చాడని, పెద్ద గొడవ చేశాడని కూడా ఆ నటి తన ఫిర్యాదులో రాసింది.
ఆ ఫొటోలు బయటపెడతానంటూ..
పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ప్రకారం.. చరిత్ బాలప్ప ఆ నటిని మానసికంగా వేధించాడు. తాము ఇద్దరం కలిసి ఉన్న ప్రైవేట్ ఫొటోలను సోషల్ మీడియాలో, ఇతర నటీనటులున్న వాట్సాప్ గ్రూపులోనూ షేర్ చేస్తానని కూడా ఆమెను బెదిరించాడు.
అంతేకాదు తనకున్న పలుకుబడి, రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలతో ఆమెపై తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపిస్తానని కూడా బెదిరించినట్లు ఆ ఎఫ్ఐఆర్ పేర్కొంది. చంపుతాననీ బెదిరించాడని ఆ నటి చెప్పింది. ఇప్పటికే చరిత్ బాలప్పకు పెళ్లయింది. అయితే భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా ఉంటున్నాడు. బెంగళూరులోని రాజేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రస్తుతం అతన్ని అరెస్ట్ చేసి కేసును దర్యాప్తు చేస్తున్నారు.