రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ జానర్లో తెలుగులో మరో వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ పేరు దేవిక అండ్ డానీ. ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ రీతూ వర్మ లీడ్ రోల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ ఇది. మంగళవారం (మే 20) మేకర్స్ ట్రైలర్ తోపాటు స్ట్రీమింగ్ తేదీని కూడా రివీల్ చేశారు. రొమాన్స్ తోపాటు క్రైమ్ కూడా మిక్స్ అయి థ్రిల్లింగా సాగిపోయిందీ ట్రైలర్.
దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ జియోహాట్‌స్టార్ లోకి రాబోతోంది. జూన్ 6 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే గతంలోనే టీజర్ రిలీజ్ చేయగా.. ఇప్పుడు ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. మొదట్లోనే దేవిక (రీతూ వర్మ) పెళ్లి కుదిరిందని, ఈ సమయంలో దుష్ట శక్తుల నుంచి దూరంగా ఉండటానికి ఇంట్లో మహా సుదర్శన యాగం ఏర్పాటు చేస్తారు.
అంతేకాదు ఆమెకు మరో వ్యక్తి (సుబ్బరాజు)తో ఎంగేజ్‌మెంట్ కూడా అవుతుంది. అయితే అతనితో పెళ్లికి సిద్ధమైనా మూడు నెలల పాటు మాత్రం మరో వ్యక్తితో ఆమె సన్నిహితంగా ఉంటుందని తన జాతకంలో ఉంటుంది. మొదట్లోనే లారీ ఢీకొట్టడంతో చనిపోయిన వ్యక్తి ఆత్మగా వస్తాడు. అతనికే దేవిక దగ్గరవుతుంది. ఎవరు అడ్డు వచ్చినా, ఎంత ప్రమాదం ఎదురైనా వెనకడుగు వేసేదే లేదని ఆమె తీర్మానించుకుంటుంది.
ఈ ట్రైలర్ ద్వారా దేవిక అండ్ డానీ వెబ్ సిరీస్ స్టోరీ పెద్దగా రివీల్ కాలేదు. అయితే ఈ ట్రైలర్ చూస్తుంటే సిరీస్ చాలా ఆసక్తికరంగా సాగేలా కనిపిస్తోంది. “ఒకరు ఆమె చేయి పట్టుకుంటే.. మరొకరు ఆమె మనసును దోచుకున్నారు.. దేవిక అండ్ డానీ జూన్ 6 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది” అనే క్యాప్షన్ తో ఆ ఓటీటీ ట్రైలర్ రిలీజ్ చేసింది.
దేవిక అండ్ డానీ వెబ్‌సిరీస్‌లో రీతూవర్మతో పాటు శివ కందుకూరి, సూర్యకిరణ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌కు బి కిషోర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ వెబ్‌సిరీస్‌లో రీతూవర్మ పాత్ర డిఫరెంట్‌గా ఉండబోతున్నట్లు సమాచారం. దేవిక అండ్ డానీ సిరీస్‌కు జయ్ క్రిష్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఈ వెబ్‌సిరీస్ కంటే ముందు తెలుగులో శ్రీకారం అనే సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు కిషోర్. వ్యవసాయం గొప్పతనాన్ని వివరిస్తూ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీలో ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించింది. శ్రీకారం తర్వాత సినిమాలకు లాంగ్ గ్యాప్ తీసుకున్న బి కిషోర్ వెబ్‌సిరీస్‌తో రీఎంట్రీ ఇస్తోన్నాడు.
సంబంధిత కథనం