Katha Kamamishu Review: కథా కమామీషు రివ్యూ - డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజైన తెలుగు రొమాంటిక్ కామెడీ మూవీ ఎలా ఉందంటే?
Katha Kamamishu Review: రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన తెలుగు మూవీ కథా కమామీషు డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజైంది. ఈ మూవీలో ఇంద్రజ, కరుణకుమార్, వెంకటేష్ కాకుమాను కీలక పాత్రలు పోషించారు.
Katha Kamamishu Review: ఇంద్రజ, వెంకటేష్ కాకుమాను, కరుణ కుమార్ హర్షిణి ప్రధాన పాత్రల్లో నటించిన కథా కమామీషు మూవీ థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఆహా ఓటీటీలో రిలీజైంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి గౌతమ్- కార్తీక్ దర్శకత్వం వహించారు. ఈ ఓటీటీ మూవీ ఎలా ఉందంటే?
నాలుగు జంటల కథ…
సత్య (వెంకటేష్ కాకుమాను) బ్యాంకులో జాబ్ చేస్తుంటాడు. తల్లి చిన్నతనంలోనే చనిపోతుంది.అన్నయ్యలతో పాటు తండ్రి ఏ పని పాట లేకుండా సత్య సంపాదనపై ఆధారపడి బతుకుతుంటారు. బ్యూటీ పార్లర్‌లో పనిచేసే ఉషను (హర్షిణి) ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు సత్య. పెళ్లైన కొద్ది రోజుల్లోనే ఉషతో సత్య మాట్లాడటం ఎందుకు మానేశాడు? పెళ్లికి ముందు ఉన్న ఆనందం అతడికి ఎందుకు దూరమైంది అన్నది ఓ కథ...
దివ్య (కృతికరాయ్) ఆన్‌లైన్ రమ్మీ ఆటలో మూడు లక్షలు పొగొట్టుకుంది. బాలుతో(కృష్ణ ప్రసాద్) పెళ్లి జరుగుతుంది. భర్తకు తెలిసేలోపు బ్యాంకు లోన్ తీసుకొని రమ్మీ ఆటలో పొగొట్టుకున్న అప్పును తీర్చేయాలని అనుకుంటుంది. లోన్ వచ్చిందా? దివ్య అప్పు విషయం బాలుకు తెలిసిందా? లేదా? అన్నదే జంట కథ
పోలీస్ ఆఫీసర్‌తో పెళ్లి...
కల్పన (ఇంద్రజ) పోలీస్ ఆఫీసర్. భర్త చనిపోతాడు. ఓ బాబు ఉంటాడు. కల్పనను రెండో పెళ్లి చేసుకుంటాడు శ్రీధర్ (కరుణ కుమార్). అతడికి అప్పటికే పెళ్లవుతుంది. భార్య అతడిని వదిలిపెట్టి వెళ్లిపోతుంది.
రెండో పెళ్లి నిర్ణయం తప్పని కల్పన ఫీలవ్వడానికి కారణం ఏమిటి? భార్యను శ్రీధర్ ఎందుకు అర్థం చేసుకోలేకపోయాడు అన్నది మరో జంట జీవితం ద్వారా చూపించారు డైరెక్టర్లు...
ఓ యువ జంటది మరో కథ. కిరణ్ (మెయిన్) చేసిన టిక్‌టాక్ వీడియోలు చూసి స్రవంతి (శృతిరాయ్) అతడిని ప్రేమిస్తుంది. పెద్దలను ఎదురించి ఆర్యసమాజ్‌లో పెళ్లిచేసుకుంటారు. పెళ్లి తర్వాత కుటుంబసభ్యులకు దూరమయ్యాననే ఫీలింగ్‌తో భర్తను సరిగ్గా పట్టించుకోదు. దాంతో వీరిద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి. ఆ తర్వాత ఏమైంది అన్నది శృతిరాయ్, మెయిన్ కథలో ఆవిష్కరించారు.
కొత్త జంట జీవితాల్లో...
భిన్న నేపథ్యాలు కలిగిన నాలుగు జంటల కథతో కథా కమామీషు మూవీని తెరకెక్కించారు దర్శకద్వయం గౌతమ్ కార్తీక్ . పెళ్లి తర్వాత కొత్త జంట జీవితాల్లో ఉండే అలకలు, అపార్థాలు, అపోహలు ఎలా ఉంటాయి? చిన్న చిన్న విషయాలే కొన్ని సార్లు ఏ విధంగా పెద్ద సమస్యలుగా మారిపోతాయన్నది ఓవర్ సెంటిమెంట్, మెలోడ్రామా లేకుండా సింపుల్ ఎమోషన్స్‌తో ఈ సినిమాలో చూపించారు. ఆన్‌లైన్ రమ్మీ, టిక్‌టాక్ బారిన పడి యువత ఎలా తమ జీవితాల్ని నాశనం చేసుకుంటున్నారనే మెసేజ్‌ను ఈ సినిమాలో చూపించారు.
యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ వరకు...
మెదడుకు పదును పెట్టే ట్విస్ట్‌లేవి కథా కమామీషులో ఉండవు. క్యారెక్టర్స్ డిజైన్,డైలాగ్స్ చాలా నాచురల్‌గా ఉన్నాయి. యూత్ నుంచి ఫ్యామిలీ ఆడియెన్స్ వరకు ప్రతి ఒక్కరూ ఎక్కడో ఓ చోట రిలేట్ అయ్యేలా సీన్స్ ఉంటాయి. నాలుగు జంటల మధ్య పరిచయం ఉన్నట్లుగా చూపించడం బాగుంది.
శుభం కార్డుతోనే ఈ సినిమాను మొదలుపెట్టారు డైరెక్టర్లు. నాలుగు జంటలను పరిచయం చేసి ఆ తర్వాత వారి ఇబ్బందులు, అపోహలతో కథను ముందుకు నడిపించారు. ఫస్ట్‌నైట్‌తో ఈ కథలన్నీ ముడిపెట్టి బోర్ కొట్టకుండా చివరి వరకు కథలో లీనమయ్యేలా చేశారు.
పాటలు ప్లస్ పాయింట్...
మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచింది. ప్రతి పాట ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా దివంగత గాయకుడు ఎస్‌పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పెళ్లి పాట వీనులవిందుగా అనిపిస్తుంది. ప్రతి పాట మెలోడీ ప్రధానంగా సాగుతూ బాగున్నాయి.
డెప్త్‌గా రాసుకుంటే...
జంట మధ్య వచ్చే సమస్యలు, వాటి పరిష్కారాలను సింపుల్‌గా చూపించారు. వారి మధ్య అపోహలు నెలకొనడానికి కారణమయ్యే సన్నివేశాలను కొంత డెప్త్‌గా రాసుకుంటే బాగుండేది.
రొమాంటిక్‌గా...
పోలీస్ ఆఫీసర్‌గా ఇంద్రజ, అమాయకుడైన భర్తగా డైరెక్టర్ కరుణ కుమార్ యాక్టింగ్ బాగుంది. నాలుగు కథల్లో ఎమోషనల్‌గా ఎక్కువగా వీరిద్దరి స్టోరీ వర్కవుట్ అయ్యింది. వెంకటేష్ కాకుమాను, హర్షిని, మోయిన్, శృతిరాయ్ ట్రాక్‌లు ఓకే. వీటిలో ఫన్ పార్ట్ హైలైట్ అయ్యింది. కృతికరాయ్, కృష్ణప్రసాద్ ట్రాక్‌ను రొమాంటిక్‌గా చూపించారు.
రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ...
కథా కమామీషు సింపుల్ మెసేజ్‌తో కూడిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ. నిడివి రెండు గంటల లోపే. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.