OTT Telugu Movies: ఈనెల ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్న ముఖ్యమైన తెలుగు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ ఇవే-telugu movies web series to release in june on ott platforms gangs of godavari to bhaje vaayu veham netflix prime video ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Telugu Movies: ఈనెల ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్న ముఖ్యమైన తెలుగు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ ఇవే

OTT Telugu Movies: ఈనెల ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్న ముఖ్యమైన తెలుగు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ ఇవే

Chatakonda Krishna Prakash HT Telugu
Published Jun 09, 2024 06:54 PM IST

OTT Telugu movies, series This month: ఓటీటీల్లోకి ఈనెల కొన్ని తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‍కు వచ్చేయనున్నాయి. ఓ సోషియో ఫ్యాంటసీ వెబ్ సిరీస్ కూడా ఓటీటీలో అడుగుపెట్టనుంది.

OTT Telugu movies This month: ఈనెల ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్న ముఖ్యమైన తెలుగు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ ఇవే
OTT Telugu movies This month: ఈనెల ఓటీటీల్లోకి అడుగుపెట్టనున్న ముఖ్యమైన తెలుగు సినిమాలు, ఓ వెబ్ సిరీస్ ఇవే

OTT Telugu movies: ఓటీటీ ప్లాట్‍ఫామ్‍ల్లో ఈనెల (జూన్) కూడా కొన్ని తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనున్నాయి. విశ్వక్‍సేన్ హీరోగా నటించిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సహా మరికొన్ని చిత్రాలు ఇదే నెలలో స్ట్రీమింగ్‍కు రానున్నాయి. మే నెలలో థియేటర్లలో విడుదలైన సినిమాలు ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. అలాగే, ఓ తెలుగు సోషియో ఫ్యాంటసీ వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తోంది. ఈనెలలో ఓటీటీల్లోకి వచ్చే తెలుగు సినిమాలు, ఓ సిరీస్ ఏదో.. ఏ ప్లాట్‍ఫామ్‍ల్లో వస్తాయో ఇక్కడ తెలుసుకోండి.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి

మాస్ కా దాస్ విశ్వక్‍సేన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ సినిమా మే 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించారు. ఈ మూవీ మంచి కలెక్షన్లనే దక్కించుకుంది. అయితే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. జూన్ 14వ తేదీన 'నెట్‍ఫ్లిక్స్' ఓటీటీలో ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు రానుంది. థియేటర్లలో రిలీజైన రెండు వారాలకే ఓటీటీలోకి అందుబాటులోకి వస్తోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడలో ఈ మూవీ నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో జూన్ 14 నుంచి స్ట్రీమ్ అవనుంది.

లవ్‍మీ

హారర్ రొమాంటిక్ చిత్రం లవ్‍మీ మే 25వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఆశిష్, వైష్ణవి చైతన్య హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. దెయ్యాన్ని ప్రేమించడం అనే డిఫరెంట్ స్టోరీతో ఈ మూవీ తెరకెక్కింది. లవ్‍మీ సినిమా ఈనెల జూన్‍లోనే ‘ఆహా’ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. త్వరలోనే స్ట్రీమింగ్‍ డేట్‍ను ఆహా ప్రకటించే అవకాశం ఉంది. లవ్‍మీ చిత్రానికి ఆస్కార్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం ఇచ్చారు.

భజే వాయివేగం

కార్తికేయ హీరోగా నటించిన భజే వాయివేగం సినిమా మే 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. ఈ ఎమోషనల్ థ్రిల్లర్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద అంచనాలను అందుకుంది. ఈ సినిమాకు ప్రశాంత్ రెడ్డి దర్శకత్వం వహించారు. భజే వాయివేగం సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ దక్కించుకుంది. ఈ చిత్రం ఈ జూన్ ఆఖరి వారంలో స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది.

గంగం గణేశా

బేబి సినిమాతో సూపర్ హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ హీరోగా గంగం గణేశా మూవీ వచ్చింది. ఈ కామెడీ థ్రిల్లర్ చిత్రం మే 31వ తేదీన థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. గంగం గణేశా చిత్రానికి ఉదయ్ బొమ్మిశెట్టి దర్శకత్వం వహించారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. జూన్‍లోనే త్వరలో ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. త్వరలోనే స్ట్రీమింగ్ డేట్ ఖరారయ్యే ఛాన్స్ ఉంది.

యక్షిణి వెబ్ సిరీస్

సోషియో ఫ్యాంటసీ తెలుగు వెబ్ సిరీస్ ‘యక్షిణి’ జూన్ 14వ తేదీన డిస్నీ+ హాట్‍స్టార్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. రాహుల్ విజయ్, వేదిక, మంచు లక్ష్మి, అజయ్, శ్రీనివాస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్‍కు తేజ మర్ని దర్శకత్వం వహించారు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్‍గా ఉండటంతో ఈ సిరీస్‍పై మంచి ఆసక్తి ఉంది. జూన్ 14 నుంచి యక్షిణి సిరీస్‍‍ను హాట్‍స్టార్ ఓటీటీలో చూడొచ్చు.

Whats_app_banner