ఏప్రిల్‌లో టాలీవుడ్‌కు నిరాశ ఎదురైంది. ఆశలు పెట్టుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ఓదెల 2, జాక్ డిజాస్టర్ అయ్యాయి. మిగిలిన చిత్రాలు సరిగా పర్ఫార్మ్ చేయలేదు. దీంతో ఒక్క హిట్ లేకుండానే ఏప్రిల్ ముగిసింది. అయితే, వేసవి సెలవుల్లో కీలకమైన మే నెలపై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. నాని ‘హిట్ 3’, విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’పై హైప్ ఎక్కువగా ఉంది. హరి హర వీరమల్లు వస్తే ఇదే బిగ్గెస్ట్ రిలీజ్ అవుతుంది. సమంత నిర్మించిన శుభం చిత్రం కూడా రానుంది. మేలో థియేటర్లలో విడుదల కానున్న టాప్ తెలుగు చిత్రాలు చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘హిట్ 3’ సినిమా మే 1వ తేదీన విడుదల కానుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ తెలుగు వైలెంట్ యాక్షన్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. నాని ఫుల్ వైలెంట్ మోడ్‌లో కనిపించనున్నారు. ఈ మూవీకి ప్రమోషన్లను జోరుగా చేస్తున్నారు. మే 1న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలోనూ హిట్ 3 విడుదల కానుంది. ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ అవుతుందని టాలీవుడ్ ఆశలు పెట్టుకుంది.
తమిళ స్టార్ సూర్య, పూజా హెగ్డే హీరోయిన్లుగా నటించిన ‘రెట్రో’ మే 1వ తేదీన విడుదల కానుంది. ఈ తమిళ చిత్రం తెలుగు డబ్బింగ్లోనూ రిలీజ్ అవుతుంది. హిట్ 3కి కాస్త పోటీని ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. రెట్రో మూవీని రొమాంటిక్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కించారు డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్. సూర్యకు తెలుగులోనూ అభిమానులు బాగానే ఉన్నారు. సుబ్బరాజ్ డైరెక్టర్ కావడంతో మరింత హైప్ ఉంది. దీంతో రెట్రోపై తెలుగులోనూ ఆసక్తి బాగా ఉంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరి హర వీరమల్లు చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఏపీ డిప్యూటీ సీఎంగా ఆయన పదవి చేపట్టిన తర్వాత వస్తున్న తొలి మూవీ కావడంతో హైప్ మరింత అధికంగా ఉంది. మే 9న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. అయితే, ఇంకా కాస్త షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు మిగిలే ఉన్నాయి. దీంతో మే 9 నుంచి ఈ హిస్టారికల్ యాక్షన్ మూవీ వాయిదా పడనుంది. అయితే, మే నెలలో వేరే డేట్‌కు ఈ చిత్రం వస్తుందా.. మరింత వాయిదా పడుతుందా అనే సస్పెన్స్ కొనసాగుతోంది. హరి హర వీరమల్లు నుంచి డైరెక్టర్ క్రిష్ తప్పుకోగా.. ప్రస్తుతం జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.
సింగిల్ చిత్రం మే 9వ తేదీన విడుదల కానుంది. యంగ్ స్టార్ శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ కామెడీ ఎంటర్టైనింగ్ మూవీపై క్యూరియాసిటీ బాగా ఉంది. ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. గీతా ఆర్ట్స్ నిర్మించిన ఈ మూవీకి అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. వేసవికి సూటయ్యేలా వినోదాలు పంచేలా సింగిల్ మూవీ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి.
స్టార్ హీరోయిన్ సమంత ప్రొడక్షన్ హౌస్ త్రాలాలా మూవింగ్ పిక్చర్స్ నిర్మించిన ‘శుభం’ సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాతగా సమంతకు ఇదే ఫస్ట్ మూవీ. హారర్ కామెడీగా తెరకెక్కిన శుభం చిత్రంలో హర్షిత్ రెడ్డి, శ్రీయా కొంతం, గవిరెడ్డి శ్రీనివాస్ ప్రధాన పాత్రలు చేశారు. ఈ సినిమాకు ప్రవీణ్ కండ్రేగుల దర్శకత్వం వహించారు. శుభం చిత్రంపై కూడా ఆసక్తి బాగానే ఉంది.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన కింగ్డమ్ సినిమాపై హైప్ ఓ రేంజ్లో ఉంది. వరుసగా ప్లాఫ్లను ఎదుర్కొంటున్న విజయ్ ఈ యాక్షన్ మూవీలో సక్సెస్ బాట పడతాడనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా మే 30వ తేదీన విడుదల కానుంది. గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రాన్నికి దర్శకత్వం వహించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ చిత్రం విడుదల కానుంది. మరి కింగ్డమ్ సినిమా అంచనాలను అందుకుంటుందేమో చూడాలి.
సంబంధిత కథనం