ఓటీటీలోకి ప్రతి నెలలాగే వచ్చే జూన్ నెలలోనూ కొన్ని ఇంట్రెస్టింగ్ తెలుగు సినిమాలు, వెబ్ సిరీస్ వస్తున్నాయి. వీటిలో హిట్ 3, సింగిల్, శుభంలాంటి హిట్ సినిమాలు ఉండటం విశేషం. నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, జీ5లాంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లోకి ఇవి రానున్నాయి. వీటితోపాటు మరో రెండు వెబ్ సిరీస్ కూడా స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉన్నాయి.
నాని కెరీర్లో అతిపెద్ద హిట్ గా నిలిచిన మూవీ హిట్ 3. ఈ నెల 1న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఇప్పటికే రూ.100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో దుమ్మురేపుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. జూన్ 5 నుంచి ఆ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది. శైలేష్ కొలను డైరెక్షన్ లో వచ్చిన హిట్ యూనివర్స్ నుంచి వచ్చిన మూడో సినిమా ఇది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో కాస్త వయోలెన్స్ ఎక్కువన్న విమర్శలు వచ్చినా.. బాక్సాఫీస్ సక్సెస్ సాధించింది.
టాలీవుడ్ నటుడు శ్రీవిష్ణు కెరీర్లోనే అతిపెద్ద హిట్ ఈ సింగిల్ మూవీ. ట్రైలర్ తోనే వివాదాలతో వార్తల్లో నిలిచిన ఈ సినిమా.. తర్వాత ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి సమ్మర్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. జూన్ రెండో వారంలో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది.
సమంత ప్రొడ్యూస్ చేసిన తొలి సినిమా శుభం. మే 9న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను జీ 5 సొంతం చేసుకుంది. ఈ మూవీ కూడా జూన్ రెండో వారంలోనే స్ట్రీమింగ్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓటీటీ డీల్ విషయంలో మేకర్స్ తో కాస్త విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో శుభం డిజిటల్ ప్రీమియర్ సంగతేంటో రానున్న రోజుల్లో తేలనుంది.
ఆహా వీడియో ఓటీటీలో వచ్చిన సూపర్ హిట్ వెబ్ సిరీస్ 3 రోజెస్. ఇప్పుడీ సిరీస్ రెండో సీజన్ రాబోతోంది. కొన్ని రోజులుగా దీనికి సంబంధించి యాక్టర్స్ గురించి ఆ ఓటీటీ టీజ్ చేస్తూ వస్తోంది. ఇంత వరకూ స్ట్రీమింగ్ తేదీని అనౌన్స్ చేయలేదు. అయితే జూన్ చివరి వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.
జియోహాట్‌స్టార్ తీసుకొస్తున్న మరో తెలుగు వెబ్ సిరీస్ దేవిక అండ్ డానీ. ఈ మధ్యే టీజర్ కూడా రిలీజ్ చేశారు. రీతూ వర్మ నటిస్తున్న ఈ సిరీస్ స్ట్రీమింగ్ తేదీని ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే అని మాత్రం చెప్పింది. అయితే జూన్ రెండో వారంలో స్ట్రీమింగ్ కు రావచ్చని భావిస్తున్నారు.
సంబంధిత కథనం
టాపిక్