Telugu Indian Idol S3 OTT: ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సింగింగ్ రియాల్టీ షో ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో సూపర్ సక్సెస్ అయింది. ఇప్పటి వరకు వచ్చిన రెండు సీజన్లు భారీ వ్యూస్ దక్కించుకున్నాయి. దీంతో మూడో సీజన్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ షో కోసం ఆడిషన్స్ ముగిశాయి. ఈ తరుణంలో తెలుగు ఇండియన్ ఐడల్ మూడో సీజన్ ప్రారంభ తేదీని ఆహా ఓటీటీ వెల్లడించింది.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 జూన్ 7వ తేదీన మొదలుకానుంది. ఆరోజున తొలి ఎపిసోడ్ స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ తేదీని ప్రకటించేందుకు నేడు (మే 22) ఓ ఈవెంట్ నిర్వహించింది ఆహా ఓటీటీ.
తెలుగు ఇండియన్ ఐడల్ మూడో సీజన్‍లో జడ్జిలుగా ఉన్న స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్, స్టార్ సింగర్లు కార్తీక్, గీతామాధురి ఈ ఈవెంట్‍కు హాజరయ్యారు. గత రెండు సీజన్లకు కూడా థమన్, కార్తీక్ జడ్జిలుగా ఉండగా.. గత సీజన్‍లో గీతామాధురి కలిశారు. మూడో సీజన్‍కు కూడా వీరు కొనసాగుతున్నారు. ఇక, తొలి సీజన్‍లో ఈ షోకు యాంకరింగ్ చేసిన సింగర్ శ్రీరామచంద్ర మళ్లీ తిరిగి వచ్చేశారు. రెండో సీజన్‍లో యాంకింగ్ చేసిన హేమచంద్ర స్థానంలో శ్రీరామచంద్ర మళ్లీ అడుగుపెట్టారు.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కోసం భారీగా ఆడిషన్లు జరిగాయి. హైదరాబాద్‍లో నిర్వహించిన మెగా ఆడిషన్లలో చాలా మంది పాల్గొన్నారు. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా ఆడిషన్లు జరిగాయి. ఆన్‍లైన్ ద్వారా కూడా ఆడిషన్లను నిర్వహించారు జడ్జిలు.
తెలుగు ఇండియన్ ఐడల్ తొలి సీజన్‍లో 12 మంది కంటెస్టెంట్‍లు పోటీ పడగా.. థమన్, కార్తీక్‍తో పాటు స్టార్ హీరోయిన్ నిత్యామీనన్ జడ్జిగా వ్యవరించారు. రెండో సీజన్‍లో 13 మంది కంటెస్టెంట్లు ఉండగా.. నిత్య స్థానంలో జడ్జిగా గీతామాధురి ఎంట్రీ ఇచ్చారు. ఇక, ఈ ఏడాది జూన్ 7న మొదలుకానున్న మూడో సీజన్‍లో 12 మంది కంటెస్టెంట్లు పాల్గొననున్నారు.
తెలుగు ఇండియన్ ఐడల్ తొలి సీజన్‍లో వాగ్దేవి విజేతగా నిలిచారు. ఫైనల్‍కు అతిథిగా హాజరైన మెగాస్టార్ చిరంజీవి.. విజేతకు ట్రోఫీ అందచేశారు. ఈ సీజన్‍లో శ్రీనివాస్ , వైష్ణవి రెండు, మూడుస్థానాల్లో నిలిచారు. రెండో సీజన్‍లో సౌజన్య భాగవతుల టైటిల్ గెలుచుకున్నారు. విన్నర్ సౌజన్యకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ అందించారు. ఈ సీజన్‍లో జయరాం, లాస్య ప్రియ రెండు, మూడు ప్లేస్‍ల్లో నిలిచారు.
సుహాస్ హీరోగా నటించిన ప్రసన్న వదనం సినిమా ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో మే 24వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. గోల్డ్ సబ్‍స్క్రిప్షన్ ఉన్న వారికి 24 గంటల ముందుగానే ఈ చిత్రం అందుబాటులోకి వస్తుంది. ఫేస్ బ్లైండ్‍నెస్ కాన్సెప్ట్‌తో థ్రిల్లర్‌గా ప్రసన్న వదనం చిత్రాన్ని తెరకెక్కించారు దర్శకుడు అర్జున్ వైకే. మే 3వ తేదీన ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. సుమారు రూ.5కోట్ల వరకు గ్రాస్ వసూళ్లను సాధించింది. మే 24 నుంచి ప్రసన్న వదనం మూవీని ఆహాలో చూసేయవచ్చు.