Telugu Indian Idol Season 3 Promo: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రోమో వచ్చేసింది.. నవ్వులు, ఎమోషన్స్‌తో..
Telugu Indian Idol Season 3 Promo: తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 లాంచ్ ప్రోమో వచ్చేసింది. ఈసారి తమన్, గీతామాధురి, శ్రీరామచంద్రల కామెడీతోపాటు కంటెస్టెంట్ల ఎమోషన్లతో కొత్త సీజన్ ఉండబోతున్నట్లు ప్రోమోతో స్పష్టమవుతోంది.
Telugu Indian Idol Season 3 Promo: ఇండియాలో సూపర్ హిట్ సింగింగ్ షో ఇండియన్ ఐడల్ తెలుగులోనూ రెండు సీజన్లు పూర్తి చేసుకొని మూడో సీజన్ కు సిద్దమవుతోంది. జూన్ 14 నుంచి ప్రారంభం కానున్న కొత్త సీజన్ కు సంబంధించి గురువారం (జూన్ 6) ఆహా ఓటీటీ ప్రోమో రిలీజ్ చేసింది. ఈ కొత్త సీజన్ అదిరిపోయే సింగింగ్ తోపాటు నవ్వులు, ఎమోషన్లతో సాగిపోనుంది.
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రోమో
తెలుగు ఇండియన్ ఐడల్ కూడా ఓ సూపర్ హిట్ షోగా నిలుస్తోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారిలోని సింగింగ్ టాలెంట్ ను వెలికి తీస్తూ ఈ రియాల్టీ షో దూసుకెళ్తోంది. ఇంతకుముందు వచ్చిన రెండు సీజన్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ఈ షోని స్ట్రీమింగ్ చేసే ఆహా ఓటీటీ మూడో సీజన్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.
జూన్ 14 నుంచి ప్రతి శుక్ర, శనివారాల్లో రాత్రి 7 గంటలకు ఈ షో స్ట్రీమింగ్ అవుతుంది. దీంతో వారం ముందే ఈ కొత్త సీజన్ ప్రోమోను రిలీజ్ చేసింది. గురువారం (జూన్ 6) తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రోమోను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. ఈ సీజన్ ఆడిషన్స్, అందులోని నవ్వులు, భావోద్వేగాలను ఈ ప్రోమో కళ్లకు కట్టింది.
ప్రోమో ఎలా ఉందంటే?
సుమారు ఐదు నిమిషాల నిడివితో ఈ తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ప్రోమోను ఆహా ఓటీటీ తీసుకురావడం విశేషం. ఈ సీజన్ జడ్జీలుగా ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, సింగర్లు గీతా మాధురి, కార్తీక్, శ్రీరామచంద్ర ఉన్నారు. ఈ ప్రోమోలో వీళ్లందరినీ పరిచయం చేశారు. అంతేకాదు ఆడిషన్స్ లో భాగంగా వీళ్ల మధ్య చోటు చేసుకున్న నవ్వులనూ చూపించారు.
ఇక ఇండియన్ ఐడల్ ప్రధాన రౌండ్లోకి ఎంటరయ్యేందుకు నిర్వహించిన ఆడిషన్స్ లో వివిధ సింగర్లు తమ టాలెంట్ తో జడ్జీలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో మంది ఈ ప్రతిష్టాత్మక వేదికపై తమ గాత్రాన్ని వినిపించడానికి పోటీ పడ్డారు. సింగర్ శ్రీరామచంద్రతోపాటు కంటెస్టెంట్లపై తమన్ వేసిన పంచ్ లతో ఈ ప్రోమో సరదాగా సాగిపోయింది.
"అల్టిమేట్ మ్యూజిక్ జర్నీకి ముహూర్తం సెట్ అయింది. కొత్త స్వరాల మధ్య కాంపిటీసన్, జడ్జెస్ ఇచ్చే ఎంటర్టైన్మెంట్ తో ఇండియన్ ఐడల్ రీసౌండ్ ఇండియా అంతా వినపడుతుంది. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 లాంచ్ ప్రోమో వచ్చేసింది. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ జూన్ 14 నుంచి ప్రతి శుక్ర, శనివారాల్లో రాత్రి 7 గంటల నుంచి" అనే క్యాప్షన్ తో ఈ ప్రోమో రిలీజ్ విషయాన్ని ఆహా ఓటీటీ వెల్లడించింది.
తొలి రెండు సీజన్లతో ఆహా ఓటీటీల్లో టాప్ ట్రెండింగ్ షోలలో ఒకటిగా నిలిచిన ఈ తెలుగు ఇండియన్ ఐడల్.. ఇప్పుడు మూడో సీజన్ తో ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ సరికొత్త మ్యూజికల్ జర్నీకి మీరూ సిద్ధమైపోండి.