OTT Horror Comedy: ఓటీటీలోకి వెన్నెల కిశోర్ హారర్ కామెడీ సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
OMG OTT Release Date: తెలుగు హారర్ కామెడీ సినిమా ఓఎంజీ ఓటీటీలోకి వస్తోంది. వెన్నెల కిశోర్ మెయిన్ రోల్ చేసిన ఈ చిత్రం ఈవారంలోనే స్ట్రీమింగ్‍కు రానుంది. స్ట్రీమింగ్ డేట్‍ను ఆహా ఓటీటీ నేడు వెల్లడించింది.
కొంతకాలంగా తెలుగులో హారర్ కామెడీ సినిమాలు వరుసపెట్టి వస్తూనే ఉన్నాయి. ఈ జానర్‌లోనే ఈ ఏడాది జూన్ 21వ తేదీన ఓఎంజీ (ఓ మంచి ఘోస్ట్) చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, ఈ మూవీపై పెద్దగా బజ్ రాలేదు. పాపులర్ కమెడియన్ వెన్నెల కిషోర్, షకలక శంకర్, నందిత శ్వేత ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించారు. ఓఎంజీ సినిమాకు మిక్స్డ్ టాక్ రావటంతో థియేటర్లలో పెద్దగా ఆడలేదు. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది.
ఓఎంజీ ఓటీటీ రిలీజ్ డేట్
ఓఎంజీ (ఓ మంచి ఘోస్ట్) సినిమా ఆగస్టు 15వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (ఆగస్టు 13) అఫీషియల్‍గా వెల్లడించింది. “దెయ్యాలందు ఈ దెయ్యం వేరయా.. సినిమా మామా, ఓఎంజీ చుద్దామా” అంటూ క్యాప్షన్‍తో సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఆగస్టు 15న స్ట్రీమింగ్‍కు రానుందంటూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది ఆహా ఓటీటీ.
థియేటర్లలో రిలీజైన సుమారు 8 వారాలకు ఆహా ఓటీటీలో ఓఎంజీ చిత్రం వస్తోంది. థియేటర్లలో పాజిటివ్ టాక్ తెచ్చుకోకపోవటంతో ఈ మూవీకి ఓటీటీ డీల్ ఆలస్యమైంది. ఈ తరుణంలో ఆహా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను తీసుకుంది. ఇండిపెండెన్స్ డే రోజున స్ట్రీమింగ్‍కు తీసుకొస్తోంది.
ఓఎంజీ సినిమాకు శంకర్ కే మార్తాండ్ దర్శకత్వం వహించారు. ఓ అమ్మాయిని కిడ్నాప్ చేయడం, ఆమెను దాచిపెట్టిన బంగ్లాతో దెయ్యం ఉండడం చుట్టూ ఈ మూవీ స్టోరీ ఉంటుంది. కిడ్నాప్ చేసిన వారే చిక్కుల్లో పడడం ఉంటుంది. వెన్నెల కిశోర్, షకలక శంకర్, నందితతో పాటు నవమి గాయక్, నవీన్ నేని, రజత్ రాఘవ, రఘుబాబు కూడా ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించారు.
ఓఎంజీ స్టోరీ ఇదే
ఓ బంగ్లాలో ఉండే దెయ్యం, అక్కడికి అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎత్తుకొచ్చిన గ్యాంగ్ చుట్టూ ఓఎంజీ కథ తిరుగుతుంది. చైతన్య (రజత్ రాఘవ), రజియా (నవమి గాయక్), పావురం (షకలక శంకర్) స్నేహితులుగా ఉంటారు. వీరికి డబ్బు చాలా అవసరం అవుతుంది. దీంతో డబ్బు కోసం చైతన్య ఓ ప్లాన్ చేస్తాడు. ఎమ్మెల్యే కూతురు, తన మరదలు అయిన కీర్తి (నందిత శ్వేత)ని కిడ్నాప్ చేసేందుకు సిద్ధమవుతాడు. అందుకు తగ్గట్టే ఆ ముగ్గురు కలిసి కీర్తిని కిడ్నాప్ చేసి ఓ బంగ్లాకు తీసుకెళతారు. ఆ బంగ్లాలో ఉండే దెయ్యానికి కిడ్నాపర్లు అంటే అసలు గిట్టదు. దీంతో ఆ ముగ్గురిని భయపెడుతూ ఉంటుంది. కీర్తికి కూడా ఓ సమస్య ఉంటుంది. ఆ దెయ్యానికి కిడ్నాపర్లు అంటే ఎందుకు ఎంత కోపం? అక్కడి నుంచి ఆ నలుగురు బయటపడ్డారా? ఏ సమస్యలు ఎదుర్కొన్నారు? వెన్నెల కిశోర్ పాత్ర ఏంటి? అనే అంశాలు ఓఎంజీ సినిమాలో ఉంటాయి.
ఆహా ఓటీటీలో ఆగస్టు 15వ తేదీనే ఎవోల్ అనే బోల్డ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం కూడా స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ చిత్రంలో సూర్యశ్రీనివాస్, శివబొడ్డు రాజు, జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ లీడ్ రోల్స్ చేశారు.
టాపిక్