Kollywood Doors Closed: మనోళ్లకు కుదరట్లేదా? లేక వాళ్లు రానీయట్లేదా? తమిళంలో ఫ్లాప్ అవుతున్న తెలుగు స్టార్లు..!-telugu heroes flop in tamil no entry in kollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kollywood Doors Closed: మనోళ్లకు కుదరట్లేదా? లేక వాళ్లు రానీయట్లేదా? తమిళంలో ఫ్లాప్ అవుతున్న తెలుగు స్టార్లు..!

Kollywood Doors Closed: మనోళ్లకు కుదరట్లేదా? లేక వాళ్లు రానీయట్లేదా? తమిళంలో ఫ్లాప్ అవుతున్న తెలుగు స్టార్లు..!

Maragani Govardhan HT Telugu
May 14, 2023 08:34 AM IST

Kollywood Doors Closed: టాలీవుడ్ హీరోలకు కోలీవుడ్‌లో మాత్రం సరైన సక్సెస్ అందట్లేదు. ఇక్కడ విజయం సాధించిన చిత్రాలు సైతం అక్కడకొచ్చే సరికి ఆదరణే కరవై డిజాస్టర్లుగా మిగులుతున్నాయి. ఇదే సమయంలో కోలీవుడ్ స్టార్లకు.. ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఏర్పడటం గమనార్హం.

తమిళంలో తెలుగు హీరోలు ఫ్లాప్
తమిళంలో తెలుగు హీరోలు ఫ్లాప్

Kollywood Doors Closed: తమిళ హీరోలకు తెలుగులో ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రజినీకాంత్ నుంచి కార్తి వరకు ఎంతో మంది కోలీవుడ్ స్టార్లు ఇక్కడ తమ మార్కును చూపించారు. సీన్ కట్ చేస్తే మన స్టార్లకు మాత్రం అక్కడ ఆదరణే కరవైంది. పాన్ ఇండియా సంగతి అటుంచితే పక్క రాష్ట్రలోనే ప్రభావం చూపలేకపోతున్నారు. హీరోలే కాదు.. డైరెక్టర్లు, సాంకేతిక సిబ్బంది ఇలా చాలా వరకు తమిళం నుంచి వచ్చి తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమా టాక్ బాగోలేకపోతే సరే.. ఇక్కడ సూపర్ హిట్టయిన చిత్రాలు కూడా అక్కడకొచ్చేసరికి డిజాస్టర్లుగా మిగులుతున్నాయి. ఇటీవల విడుదలైన కస్టడీ, దసరా, విరూపాక్ష లాంటి సినిమాలకు అక్కడ అసలు ఆదరణే లభించలేదు. దాదాపు తెలుగులో ఉన్న చాలా వరకు హీరోలు కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటే వారికి రిక్త హస్తాలే మిగిలాయి.

నాగచైతన్యకు ఫలించని అదృష్టం..

కోలీవుడ్ దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కించిన కస్టడీ సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో కాస్త ఫర్వాలేదనిపించినా.. తమిళంలో మాత్రం ఈ సినిమాకు ఆదరణే కరువైంది. ఈ మూవీ ద్వారా కోలీవుడ్ ఎంట్రీ ఇద్దామనుకున్న చైతూకు రిక్త హస్తాలే మిగిలాయి. అక్కడ పాపులరైన డైరెక్టర్ వెంకట్ ప్రభు సహా సంగీత దర్శకులు ఇళయరాజా, యువన్ శంకర్ రాజా మ్యాజిక్ వర్కౌట్ కాలేదు. తమిళనాడులో దాదాపు 100 థియేటర్లలో రిలీజైన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.

సాయి ధరమ్ తేజ్ ఇక్కడ హిట్, అక్కడ ఫట్..

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఇటీవల నటించిన విరూపాక్ష సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే తమిళంలో ఈ సినిమా ఫ్లాప్ అయిందంటే మీరు నమ్మగలరా? అవును విరూపాక్ష కోలీవుడ్‌లో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. వసూళ్లు ఘోరంగా పడిపోయాయి. మొదటి 3 -4 రోజుల కలెక్షన్లు గమనిస్తే రోజుకు రూ.14 నుంచి రూ.7 లక్షలు మాత్రమే వచ్చాయి. ఓవరాల్‌గా ఈ సినిమాకు అన్నీ భాషల్లో కలిపి రూ.91 కోట్ల వరకు గ్రాస్ వస్తే.. తమిళంలో మాత్రం అనుకున్న స్థాయిలో వసూళ్లు రాలేదు.

దసరా ఇంపాక్ట్ చూపించలేదు..

నాని నటించిన దసరా చిత్రంలో తెలుగులో వంద కోట్లకుపైగా వసూలు చేసి అతడి కెరీర్‌లో అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. పాన్ ఇండియా ప్రాజెక్టుగా విడుదలైన ఈ మూవీ తెలుగులో మాత్రం మంచి విజయాన్ని అందుకోగా.. మిగిలిన భాషల్లో పెద్దగా ప్రభావం చూపలేదు. ముఖ్యంగా తమిళంలో అనుకున్న స్థాయిలో ఆకట్టుకోలేదు. కోలీవుడ్‌లో నాని విస్తృతంగా ప్రమోషన్లు నిర్వహించిన ఫలితం లేకపోయింది. అక్కడ యూట్యూబర్లు, యాంకర్లతో కలిసి వినూత్నంగా ప్రచారం చేసినా ఫలితం పెద్దగా దక్కలేదు. కీర్తి సురేష్ లాంటి నటి హీరోయిన్‌గా చేసినప్పటికీ దసరా మూవీ తమిళనాడులో ఇంపాక్ట్ కలిగించలేకపోయింది.

గతమంతా ఘనమేమి కాదు..

ఈ ముగ్గురే కాదు.. గతేడాది వారియర్ చిత్రంతో కోలీవుడ్‌లో అదృష్టాన్ని పరీక్షించుకున్న రామ్ పోతినేనికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. కోలీవుడ్‌లో స్టార్ డైరెక్టరైన లింగుసామి తెరకెక్కించిన వారియర్.. తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్లాప్ అయింది. కొన్నేళ్ల క్రితం సూపర్ స్టార్ మహేష్ బాబు.. అక్కడ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్‌తో తీసిన స్పైడర్ కూడా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఇంక పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అయితే కెరీర్ ఆరంభంలో ఎస్‌జే సూర్య దర్శకత్వంలో వచ్చిన ఖుషీ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కొట్టారు. అదే నమ్మకంతో ఆ తర్వాత తమిళ దర్శకులను నమ్మి వరుసగా పరాజయాన్ని చవిచూశారు. ఎస్‌జే సూర్య దర్శకత్వంలో వచ్చిన కొమరం పులి, పంజా లాంటి సినిమాలకు ఆదరణ దక్కలేదు.

అయితే కొన్ని సినిమాలు మాత్రం సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. వాటిలో గీతాంజలి, ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, వసంతం కలిసుందాం రా, గణేష్ లాంటి చిత్రాలు మంచి విజయాలను అందుకున్నాయి. అయితే ఇటీవల కాలంలో మాత్రం వరుసగా విఫలం కావడం గమనార్హం. మరి రామ్ చరణ్-శంకర్ కాంబోలో వస్తున్న గేమ్ ఛేంజర్.. ఈ ఫలితాలను తారుమారు చేస్తుందో లేదో వేచి చూడాలి.