Most Industry hits telugu hero: కెరీర్లో ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న తెలుగు హీరోలు వీళ్లే.. టాప్‌లో మెగాస్టార్
Most Industry hits telugu hero: టాలీవుడ్ లో ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న హీరో ఎవరో తెలుసా? అందరూ ఊహించినట్లే ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవే టాప్ లో ఉన్నాడు.
Most Industry hits telugu hero: 90 ఏళ్ల తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి దేశం గర్వించదగిన ఎందరో నటులు వచ్చారు. వీళ్లలో కొందరు సూపర్ స్టార్లు, మెగాస్టార్లు అయ్యారు. మరి వీళ్లలో తన కెరీర్లో ఎక్కువ ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న నటుడు ఎవరో తెలుసా? నిజానికి ఈ 9 దశాబ్దాలలో 40 సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచినట్లు అంచనా వేశారు. వీటిలో ఎక్కువ సినిమాలు మెగాస్టార్ చిరంజీవివే కావడం విశేషం.
ఇండస్ట్రీ హిట్స్.. చిరంజీవే కింగ్
90 ఏళ్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో సుమారు 45 ఏళ్లుగా కొనసాగుతున్న హీరో మెగాస్టార్ చిరంజీవి. అసలు తెలుగు సినిమా దశ, దిశనే మార్చేసిన సుప్రీం హీరో. తర్వాత మెగాస్టార్ గా ఎదిగి దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీని శాసించాడు. సహజంగానే అలాంటి హీరోవే అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ ఉంటాయనడంలో సందేహం లేదు.
మొత్తం 40 ఇండస్ట్రీ హిట్స్ లో 8 సినిమాలు చిరంజీవి నటించినవే కావడం గమనార్హం. 1983లో తొలి ఇండస్ట్రీ హిట్ అందుకున్న చిరు.. 2002 వరకూ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించాడు. ఈ 20 ఏళ్ల కాలంలోనే చిరంజీవి కెరీర్లో అత్యధిక హిట్స్, ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి.
చిరంజీవి ఇండస్ట్రీ హిట్స్
చిరంజీవి నటించిన ఖైదీ మూవీ అతని కెరీర్లో తొలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 1983లో వచ్చిన ఈ సినిమా అప్పటి వరకూ ఉన్న అన్ని ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. ఆ తర్వాత 1987లో వచ్చిన పసివాడి ప్రాణం, 1988లో వచ్చిన యముడికి మొగుడు, 1989లో వచ్చిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, 1990లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, 1991లో వచ్చిన గ్యాంగ్ లీడర్, 1992లో వచ్చిన ఘరానా మొగుడు, 2002లో వచ్చిన ఇంద్ర సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి.
చిరంజీవి తర్వాత ఆరు ఇండస్ట్రీ హిట్స్ తో అక్కినేని నాగేశ్వరరావు ఉన్నాడు. అతడు నటించిన బాలరాజు, దేవదాసు, రోజులు మారాయి, మాయాబజార్, దసరా బుల్లోడు, ప్రేమాభిషేకం సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ గా నిలిచాయి. ఇక ఎన్టీఆర్ ఖాతాలో పాతాల భైరవి, మాయాబజార్, లవ కుశ, అడవి రాముడులాంటి మూవీస్ ఉన్నాయి.
బాలకృష్ణ సినిమాలు ముద్దుల మావయ్య, సమర సింహా రెడ్డి, నరసింహ నాయుడు.. పవన్ కల్యాణ్ సినిమాలు ఖుషీ, అత్తారింటికి దారేది.. మహేష్ బాబు పోకిరి.. రామ్ చరణ్ మగధీర.. ప్రభాస్ బాహుబలి 2, కృష్ణ అల్లూరి సీతారామరాజులాంటి సినిమాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఇండియన్ సినిమాలో రజనీ టాప్
మొత్తం ఇండియన్ సినిమాలో అత్యధిక ఇండస్ట్రీ హిట్స్ సొంతం చేసుకున్న హీరోగా రజనీకాంత్ కు పేరుంది. అతని కెరీర్లో మొత్తం 15 ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. ఇక కన్నడ స్టార్ రాజ్ కుమార్ (14), కమల్ హాసన్ (13), మమ్ముట్టి (12), మోహన్ లాల్ (10)లాంటి వాళ్లు ఈ లిస్టులో ఉన్నారు. వీళ్ల తర్వాత 8 హిట్స్ తో చిరంజీవి ఆరో స్థానంలో ఉన్నాడు.
టాపిక్