Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే
Flop Movies With super hit songs: కొన్ని తెలుగు సినిమాల్లో పాటలు మూవీ రిలీజ్ కు ముందే హిట్ అయ్యాయి. తీరా చూస్తే సినిమా మాత్రం అట్లర్ ఫ్లాప్. మరి అలాంటి సినిమాలు, పాటలు ఏవో చూడండి.
Flop Movies With super hit songs: ఏ సినిమా రిలీజ్ అవుతున్నా.. దానికి కొన్ని రోజులు, వారాల ముందే సాంగ్స్ రిలీజ్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సాంగ్స్ హిట్ అయితే సినిమాకు ఓపెనింగ్స్ బాగుంటాయన్నది నమ్మకం. అయితే తెలుగులో అలా సాంగ్స్ సూపర్ హిట్ అయినా.. సినిమాలు మాత్రం బోల్తా పడ్డాయి. మరి అలాంటి పాటలు, సినిమాలు ఏంటో ఇక్కడ చూడండి.
పాట్ హిట్.. బొమ్మ ఫట్..
తెలుగులో కొన్ని సినిమాల్లో ఒక్క సాంగ్ తో ఊపేసినవీ ఉన్నాయి. మరికొన్ని అన్ని పాటలూ హిట్ అయినవీ ఉన్నాయి. అలాంటి సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. ఇది ఆ మూవీ మేకర్స్ కు ఒక రకంగా మింగుడు పడనివే అని చెప్పాలి. మ్యూజికల్ హిట్ అయిన సినిమాలు బాగుంటాయన్న గ్యారెంటీ లేదని చెప్పడానికి ఈ సినిమాలే నిదర్శనం.
ఆరెంజ్ - అన్నీ సూపర్ హిట్
రామ్ చరణ్ నటించిన ఆరెంజ్ మూవీలో అన్ని పాటలూ హిట్టే. హ్యారిస్ జైరాజ్ ఈ మూవీకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ప్రతి పాటా పదే పదే వినాలనిపించేలా ఉన్నా.. సినిమా మాత్రం దారుణంగా ఫ్లాపయింది. ఈ మూవీ తీసిన నాగబాబు అప్పుల పాలయ్యాడు. అయితే ఇదే మూవీ రీరిలీజ్ లో మాత్రం హిట్ కావడం విశేషం.
వన్ నేనొక్కడినే
మహేష్ బాబు, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన వన్ నేనొక్కడినే సినిమాలో పాటలన్నీ చాలా బాగున్నాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఈ మూవీ పెద్దగా ఆడలేదు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన మ్యూజిక్ ఇప్పటికీ ఓ సెన్సేషనే.
గుడుంబా శంకర్
పవన్ కల్యాణ్ నటించిన గుడుంబా శంకర్ మూవీ సాంగ్స్ ఈ రోజు విన్నా కూడా చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి. మణిశర్మ చేసిన మ్యాజిక్ అలాంటిది. కానీ ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక పవన్ మూవీయే అజ్ఞాతవాసిలో బయటికి వచ్చి చూస్తే సాంగ్ కూడా బాగా హిట్ అయింది. కానీ మూవీ మాత్రం పవన్ కెరీర్లోనే అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది.
చక్రం, ఆదిపురుష్
ప్రభాస్ నటించిన చక్రం, ఆదిపురుష్ సినిమాల పరిస్థితీ అదే. చక్రం మూవీలో జగమంత కుటుంబం పాట ఎవర్ గ్రీన్ హిట్. కానీ సినిమా దారుణంగా బోల్తా పడింది. ఇక ఆదిపురుష్ లోనూ రామ్ సీతారామ్, జై శ్రీరామ్ పాటలు బాగా హిట్టయ్యాయి. కానీ సినిమా మాత్రం దారుణంగా బోల్తా పడి భారీ నష్టాలను మిగిల్చింది. రాధేశ్యామ్ లోని ఈ రాతలే సాంగ్ కూడా బాగా హిట్టయినా ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
కృష్ణార్జున యుద్దం
నాని నటించిన కృష్ణార్జున యుద్ధం మూవీలోని దారి చూడు పాట అప్పట్లో ఓ సెన్సేషన్. తీరా సినిమా చూస్తే మాత్రం నిరాశ పరిచింది. నాని కెరీర్లోనే అతిపెద్ద ఫ్లాపుల్లో ఇదీ ఒకటి.
సైనికుడు
మహేష్ బాబు నటించిన సైనికుడు మూవీలోని ఓరుగల్లుకే పిల్లా సాంగ్ ఓ ఊపు ఊపేసింది. కానీ ఈ సినిమా మహేష్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్. ఈ పాటను కూడా మణిశర్మే కంపోజ్ చేశాడు.
30 రోజుల్లో ప్రేమించడం ఎలా
యాంకర్ ప్రదీప్ నటించిన ఈ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీలోని నీలి నీలి ఆకాశం సాంగ్ ప్రతి ఒక్కరి మనసు దోచింది. కానీ సినిమా మాత్రం ఫ్లాపయింది.