Krishnam Raju Condolence Meet: దివంగత రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇటీవలే కాలం చేసిన సంగతి తెలిసిందే. ఆయనను స్మరించుకుంటూ హైదరాబాద్‌లో మూవీ ఆర్ట్స్ అసోసియోషన్, నిర్మాతల మండలి, ఫిల్మ్ చాంబర్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం కృష్ణంరాజు సంతాప సభ నిర్వహించారు. పలువురు సభ్యులు, నటులు, నిర్మాతలు పాల్గొని కృష్ణంరాజుకు సంతాపం ప్రకటించారు. మరోసారి ఆయన ఔన్నత్యాన్ని స్మరించుకుంటూ నివాళీ ఘటించారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపరు. కృష్ణంరాజుతో తమకున్న అనుబంధాన్ని ఈ కార్యక్రమంలో గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా నటులు మోహన్ బాబు మాట్లాడుతూ.. "నా ఆత్మీయులు ఎంతోమంది దూరమైన నేను సంతాప సభకు వెళ్లలేదు. సంతాప సభకు రావడం ఇదే మొదటిసారి. నన్ను నోరారా అరేయ్ అని పిలిచే నటుడు కృష్ణంరాజు మాత్రమే. నన్ను మొదటిగా బెంజికారు ఎక్కించింది ఆయనే. ఓ నటుడిగా ఎన్నో విషయాలను ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నా. గొప్ప నటుడు, నిర్మాతను మనం కోల్పోయాం. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి మనశ్శాంతి కలగాలని దైవాన్ని ప్రార్థిస్తున్నా." అంటూ మోహన్ బాబు తెలిపారు.
మా అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు మాట్లాడుతూ.. మా ఎన్నికల్లో పోటీ చేయమని కృష్ణంరాజు ఫోన్ చేసి చెప్పారని అన్నారు. "మా ప్రెసిడెంటుగా ఇలాంటి మీటింగ్ ఏర్పాటు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. నేను చెప్పక ముందే అంకుల్ నాకు ఫోన్ చేసి మా ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పారు. వాడు సినిమాలు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? అని నాన్న చెబితే ఆయన వినిపించుకోలేదు. దాసరి నారాయణరావు గారి తర్వత అంత పెద్దరికాన్ని చూసింది కృష్ణంరాజు అంకుల్ దగ్గరే. నెల రోజుల క్రితమే ఆయనను కలిశా. భౌతికంగా ఆయన మనమధ్య లేకపోయినా.. ఆయన జ్ఞాపకాలు, సినిమాలు చిరస్థాయిగా మనతోనే ఉంటాయి." అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, బాబు మోహన్ బాబు, జీవిత రాజశేఖర్, శివాజీరాజ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు సీ కల్యాణ్, కాశీ విశ్వనాథ్, మా వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, కరాటే కల్యాణి తదితరులు పాల్గొని తమ సంతాపాన్ని తెలియజేశారు.
సంబంధిత కథనం