Telugu Crime Thriller Web Series: క్రైమ్ థ్రిల్లర్ జానర్లో జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి ఓ తెలుగు వెబ్ సిరీస్ రాబోతోంది. ఈ సిరీస్ పేరు టచ్ మి నాట్ (Touch me not). టాలీవుడ్ హీరో నవదీప్, కన్నడ స్టార్ దీక్షిత్ శెట్టి లీడ్ రోల్స్ లో నటించిన సిరీస్ ఇది. సైకోమెట్రీ ఆధారంగా మర్డర్ మిస్టరీని ఛేదించే సిరీస్ గా ట్రైలర్ చూస్తే తెలుస్తోంది.
టచ్ మి నాట్ వెబ్ సిరీస్ జియోహాట్‌స్టార్ ఓటీటీలోకి రానుంది. బుధవారం (మార్చి 19) ట్రైలర్ రిలీజ్ చేయగా.. ఏప్రిల్ 4 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఇది ఓ కొరియన్ డ్రామా ఆధారంగా తెరకెక్కింది. హి ఈజ్ సైకోమెట్రిక్ (He is Psychometric) అనే వెబ్ సిరీస్ ఆధారంగా ఈ టచ్ మి నాట్ ను రూపొందించారు. కొన్ని రోజుల కిందటే ఈ టచ్ మి నాట్ వెబ్ సిరీస్ ను అనౌన్స్ చేసిన జియోహాట్‌స్టార్.. ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ చేసింది.
ఈ ట్రైలర్ చాలా ఆసక్తికరంగా సాగింది. మొదట్లోనే ఓ భారీ భవనంలో ఓ పేలుడు జరుగుతుంది. అందులో నుంచి ఇద్దరు పిల్లలు తమను తాము రక్షించుకోవడానికి కిటికీలో నుంచి కిందికి దూకి చనిపోతారు. ఆ కేసును పరిష్కరించడానికి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ సైకోమెట్రీపై ఆధారపడతారు. మరణించిన వారిని టచ్ చేసిన వాళ్లను ఎవరు చంపారో చెప్పే వ్యక్తి అంటూ దీక్షిత్ శెట్టిని పరిచయం చేస్తారు.
ఇదే కేసులో మరో ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా నవదీప్ నటించాడు. అతనిలో అసలైన సైకోమెట్రీని బయటకు తీసేందుకు ఓ సరైన వ్యక్తి కావాలంటాడు. ఈ ఇద్దరూ కలిసి హంతకుడిని పట్టుకునేలోపే మరికొన్ని హత్యలు కూడా జరుగుతాయి. ఆ హంతకుడిని వీళ్లు పట్టుకుంటారా లేదా? ఈ క్రమంలో వచ్చే ట్విస్టులు ఏంటన్నది ఈ సిరీస్ లో చూడొచ్చు.
టచ్ మి నాట్ వెబ్ సిరీస్ లో నవదీప్, దీక్షిత్ శెట్టితోపాటు బబ్లూ పృథ్వీరాజ్, కోమలీ ప్రసాద్, సంచిత పూనచ, హర్షవర్ధన్, దేవి ప్రసాద్, ప్రమోదిని, రాజా రవీంద్రలాంటి వాళ్లు కూడా నటించారు. ఈ వెబ్ సిరీస్ ను రమణ తేజ డైరెక్ట్ చేశాడు. మహతి స్వర సాగర్ మ్యూజిక్ అందించాడు.
సైకోమెట్రీ ద్వారా హత్య కేసును పరిష్కరించడం అనే ఓ భిన్నమైన కాన్సెప్ట్ తో వస్తున్న ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఈ టచ్ మి నాట్ వెబ్ సిరీస్ ఏప్రిల్ 4 నుంచి జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
సంబంధిత కథనం