Brahmavaram Ps Paridhilo Review: బ్రహ్మవరం పీఎస్ పరిధిలో రివ్యూ - తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Brahmavaram Ps Paridhilo Review: మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన తెలుగు మూవీ బ్రహ్మవరం పీఎస్ పరిధిలో ఇటీవల థియేటర్లలో రిలీజైంది. స్రవంతి బెల్లంకొండ, గురుచరణ్, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీకి ఇమ్రాన్ శాస్త్రి దర్శకత్వం వహించాడు.
Brahmavaram Ps Paridhilo Review: స్రవంతి బెల్లంకొండ, గురు చరణ్, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన బ్రహ్మవరం పీఎస్ పరిధిలో మూవీ ఇటీవల థియేటర్లలో విడుదలైంది. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ఇమ్రాన్ శాస్త్రి దర్శకత్వం వహించాడు. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ చిన్న సినిమా ఎలా ఉందంటే?
రెండు కథలతో...
చైత్ర (స్రవంతి బెల్లంకొండ) అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా జాబ్ చేస్తుంటుంది. తాను ఇష్టపడటం కంటే తనను ఇష్టపడే అబ్బాయి ప్రేమికుడిగా తన జీవితంలోకి రావాలని కోరుకుంటాడు. సూర్యలో (సూర్య శ్రీనివాస్) అలాంటి క్వాలిటీస్ ఉండటంతో అతడితో ప్రేమలో పడుతుంది. గౌతమ్ (గురుచరణ్) తండ్రి పట్టాభి ఓ పోలీస్ కానిస్టేబుల్. ఇరవై ఐదు ఏళ్లొచ్చిన ఎలాంటి బరువు బాధ్యతలు లేకుండా జులాయిగా తిరుగుతూ అందరితో మాటలు పడుతుంటాడు గౌతమ్.
తన కళ్ల ఎదుట తప్పు జరిగితే గౌతమ్ సహించలేడు.ఓ సమస్య విషయంలో బ్రహ్మవరం ఎస్ఐని ఎదురించి అతడికి శత్రువుగా మారుతాడు. అనుకోకుండా ఓ రోజు బ్రహ్మవరం పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఓ డెడ్‌బాడీ దొరుకుతుంది. ఆ కేసు సంచలనంగా మారడటంతో హంతకుడి కోసం పోలీసులు వేట మొదలుపెడతారు. అదే టైమ్‌లో గౌతమ్‌ను కలవడం కోసం చైత్ర అమెరికా నుంచి ఇండియా వస్తుంది. ఈ మర్డర్‌కు చైత్ర, గౌతమ్‌లతో ఏమైనా సంబంధం ఉందా? అసలు ఆ శవం ఎవరిది? హంతకుడిని పోలీసులు పట్టుకున్నారా? లేదా అన్నదే ఈ మూవీ కథ.
మర్డర్ మిస్టరీ కథతో...
సాధారణంగా మర్డర్ మిస్టరీ కథలు చాలా వరకు ఒకే ఫార్మెట్‌లో ఉంటాయి. ఎలాంటి క్లూస్‌లేకుండా విలన్ మర్డర్ చేయడం, హీరో తన తెలివితేటలతో అసలైన హంతకుడిని పట్టుకున్నట్లుగా చూపిస్తుంటారు. ఎవరూ గెస్ చేయని క్యారెక్టర్ విలన్ అంటూ రివీల్ చేసి ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తూ సినిమాలను ఎండ్ చేయడం కామన్‌గా కనిపిస్తుంది.
రొటీన్ ఫార్ములాకు భిన్నంగా దర్శకుడు ఇమ్రాన్ శాస్త్రి బ్రహ్మవరం పీఎస్ పరిధిలో కథను రాసుకున్నాడు. ఒకదానికొకటి ఏ మాత్రం సంబంధం లేని భిన్నమైన కథలతో సినిమాను మొదలుపెట్టి రెండింటిని ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో లింక్ చేయడంలో దర్శకుడు కొంత వరకు సక్సెస్ అయ్యాడు.
లవ్‌స్టోరీ విత్ ఫ్యామిలీ ఎమోషన్స్...
మర్డర్ మిస్టరీ సినిమాలో అంతర్లీనంగా లవ్ స్టోరీతో పాటు తండ్రీకొడుకుల ఎమోషన్‌కు దర్శకుడు చోటిచ్చాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చైత్ర, సూర్య లవ్ స్టోరీతో పాటు జీవితంలో సెటిల్ కాక అందరితో మాటలు పడుతూ గౌతమ్ ఎదుర్కొనే సంఘర్షణ చుట్టూ నడిపించాడు దర్శకుడు. పాత్రల పరిచయానికే డైరెక్టర్ ఎక్కువగా టైమ్ తీసుకున్న ఫీలింగ్ కలుగుతుంది. ఈ సాగతీత కాస్త బోర్ కొట్టిస్తుంది.
తప్పు కూడా న్యాయమే…
పోలీస్ స్టేషన్ దొరికిన శవం ఎవరిది, హంతకుడి కోసం పోలీసులు సాగించే ఇన్వేస్టిగేషన్ చుట్టూ సెకండాఫ్ సాగుతుంది. శవం, ఎవరిది, హంతకుడు ఎవరన్నది రివీలయ్యే సీన్స్‌ను దర్శకుడు గ్రిప్పింగ్‌గా రాసుకున్నాడు. కొన్నిసార్లు తెలియకుండా చేసిన తప్పుల్లో న్యాయం ఉంటుందంటూ చెబుతూ సినిమాను ముగించిన తీరు పర్వాలేదనిపిస్తుంది.
దర్శకుడు రాసుకున్న మలుపుల్లో కొన్ని మాత్రమే ఆకట్టుకుంటాయి. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో చాలా చోట్ల రాజీ పడ్డట్టుగా అనిపిస్తుంది. తన కన్వీనెన్స్ కోసం కొన్ని లాజిక్‌లను వదిలేశాడు.
నవతరం కుర్రాడిగా...
గౌతమ్ పాత్రలో గురు చరణ్ మెప్పించాడు. బరువు బాధ్యతలు పట్టించుకోకుండా తిరిగే నవతరం చక్కటి నటనను కనబరిచాడు. స్రవంతి బెల్లంకొండ ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకుంది. సూర్య, జీవా, బలగం రూపలక్ష్మి పలువరు సీనియర్ నటీనటులు తమ పరిధుల మేర నటించారు. సాకేత్ శ్రీరామ్ మ్యూజిక్ ఈ చిన్న సినిమాకు కొంత వరకు ప్లస్ పాయింట్‌గా నిలిచింది.
థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్‌కు
బ్రహ్మవరం పీఎస్ పరిధిలో డిఫరెంట్ టైటిల్‌తో వచ్చిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. కొత్త నటీనటులతో తెరకెక్కిన ఈ చిన్న సినిమా థ్రిల్లర్ మూవీస్‌ను ఇష్టపడే ఆడియెన్స్‌ను కొంత వరకు మెప్పిస్తుంది.