Taxi Movie Review: టాక్సీ మూవీ రివ్యూ - కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ ఎలా ఉందంటే...-taxi telugu movie review vasanth sameer hareesh sajja movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Taxi Movie Review: టాక్సీ మూవీ రివ్యూ - కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ ఎలా ఉందంటే...

Taxi Movie Review: టాక్సీ మూవీ రివ్యూ - కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీ ఎలా ఉందంటే...

Nelki Naresh Kumar HT Telugu
Mar 11, 2023 12:12 PM IST

Taxi Movie Review: కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్ క‌థాంశంతో రూపొందిన చిన్న సినిమా టాక్సీ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లో రిలీజైంది. ఈ సినిమా ఎలా ఉందంటే...

టాక్సీ మూవీ
టాక్సీ మూవీ

Taxi Movie Review: వసంత్ సమీర్ పిన్నమ రాజు, అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్, సౌమ్య మీనన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించిన సినిమా టాక్సీ. స‌జ్జా హ‌రీష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా శుక్ర‌వారం థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ చిన్న సినిమా ప్రేక్ష‌కుల్ని మెప్పించిందా? లేదా? తెలియాలంటే క‌థ‌లోని వెళ్లాల్సిందే...

ఎథిక‌ల్ హ్యాకింగ్‌...

యంగ్ సైంటిస్ట్ ఈశ్వర్ (వసంత్ సమీర్ పిన్నమ రాజు) బంగార నిల్వ‌లు క‌నిపెట్టే కాలిఫోర్నియం 252 పై ప్రయోగాలు చేసి సక్సెస్ అవుతాడు. త‌న ప్ర‌యోగం దేశానికి ఉప‌యోగ‌ప‌డాల‌ని అనుకుంటాడు. అత‌డి ప్ర‌యోగాన్ని సొంతం చేసుకోవాల‌ని మాఫియా లీడ‌ర్స్ ప్ర‌య‌త్నిస్తుంటారు. ప్ర‌యోగాన్ని వారికి ఇవ్వ‌డానికి ఒప్పుకోక‌పోవ‌డంతో ఈశ్వ‌ర్‌పై త‌ప్పుడు కేసులు బ‌నాయిస్తారు. అతని భార్య (అల్మాస్ మోటివాలా) క‌నిపించ‌కుండా పోతుంది.

ఎథికల్ హ్యాకర్ ఉజ్వల్ (సూర్య శ్రీనివాస్) అప్పులు చేసి ఓ సంస్థ‌ను స్థాపిస్తాడు. కానీ అనుకున్నంత‌గా స‌క్సెస్ కాదు. త‌మ‌కు ఎదురైన స‌మ‌స్య‌ల నుంచి పారిపోయే క్ర‌మంలో అనుకోని ప‌రిస్థితుల్లో ఈశ్వర్, ఉజ్వల్ ఒకే క్యాబ్ ఎక్కుతారు. ఆ క్యాబ్ పై కొందరు ఎటాక్ చేస్తారు.

తమపై ఎటాక్ కు ప్లాన్ చేసింది విద్యుత్ (నవీన్ పండిత్‌) అని తెలుసుకుంటారు. అత‌డు ఎవ‌రు? ఈశ్వ‌ర్‌, ఉజ్వ‌ల్‌ల‌ను అత‌డు ఎందుకు టార్గెట్ చేశాడు? స‌మ‌స్య‌ల వ‌ల‌యం నుంచి వారు ఎలా బ‌య‌ట‌ప‌డ్డారు? ఈ కథలో టాక్సీ డ్రైవర్ ( సద్దాం హుస్సేన్) పాత్ర ఏమిట‌న్న‌దే ఈ సినిమా క‌థ‌.

సంబంధం లేని వ్య‌క్తుల క‌థ‌...

ఏ మాత్రం సంబంధం లేని ఇద్ద‌రు వ్య‌క్తులు ఒకే కారులోకి ఎలా ఎక్కారు? వారిద్ద‌రి గ‌తం ఏమిటి? త‌మ‌కు ఎద‌రైన స‌వాళ్ల‌ను ఒక్క‌టిగా ఎలా ప‌రిష్క‌రించుకున్నార‌నే పాయింట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ద‌ర్శ‌కుడు స‌జ్జా హీర‌ష్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ఫ‌స్ట్ హాఫ్‌లో హీరోల ఫ్లాష్‌బ్యాక్ తో క‌థ‌ను న‌డిపించారు.

యాక్ష‌న్ సీన్స్ బలం…

సెకండాఫ్‌లో స‌మ‌స్య‌ల బారి నుంచి హీరోలు ఏ విధంగా బ‌య‌ట‌ప‌డ్డార‌న్న‌ది చూపించారు. చిన్న సినిమానే అయినా యాక్ష‌న్ ఎపిసోడ్స్ బాగున్నాయి. భారీ బ‌డ్జెట్ సినిమాల త‌ర‌హాలో వాటిని డిజైన్ చేసుకున్నారు. కాలిఫోర్నియం 252, ఎథిక‌ల్ హ్యాకింగ్ అనే పాయింట్స్‌తో ఇదివ‌ర‌కు తెలుగులో పెద్ద‌గా సినిమాలు రాలేదు. కొత్త పాయింట్ కావ‌డం సినిమాకు కొంత వ‌ర‌కు హెల్ప‌యింది.

ల‌వ్ ట్రాక్…

పాత్ర‌ల ప‌రిచ‌యంతో సినిమాను మొద‌లుపెట్టిన ద‌ర్శ‌కుడు అస‌లు క‌థ‌లోని వెళ్ల‌డానికి టైమ్ తీసుకున్నాడు. క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్ కోసం రాసుకున్న ల‌వ్ ట్రాక్ క‌థ‌కు ఏ మాత్రం సంబంధం లేన‌ట్లుగా అనిపిస్తుంది. హీరోల‌కు ఎదుర‌య్యే స‌వాళ్ల‌లో కొన్ని చోట్ల థ్రిల్లింగ్ మిస్ప‌యిన ఫీలింగ్ క‌లుగుతుంది. క‌థ బాగున్నా బ‌డ్జెట్ ప‌రిమితులు కార‌ణంగా ద‌ర్శ‌కుడు రాజీప‌డిన‌ట్లుగా క‌నిపించింది.

రియ‌లిస్టిక్ యాక్టింగ్‌

హీరో వసంత్ సమీర్ పిన్నమ రాజ స‌హ‌జ న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నాడు. క‌థ‌కు త‌గ్గ‌ట్లుగా హ‌ద్దుల‌కు లోబ‌డి చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచాడు. గ్లామ‌ర్ ప‌రంగా హీరోయిన్ సౌమ్య మీనన్ సినిమాకు అట్రాక్ష‌న్‌గా నిలిచింది. సద్దాం కామెడీ కొన్ని చోట్ల వ‌ర్క‌వుట్ అయ్యింది. అల్మాస్ మోటివాలా, సూర్య శ్రీనివాస్ , సౌమ్య మీనన్ , నవీన్ పండిత కూడా ప‌ర్వాలేద‌నిపించారు.

ప్లస్ పాయింట్స్:

హీరో న‌ట‌న‌

యాక్ష‌న్ సీక్వెన్స్‌

స్టోరీలైన్‌

మైనస్ పాయింట్స్:

మిగిలిన న‌టుల యాక్టింగ్‌

మ్యూజిక్‌

ప్రొడ‌క్ష‌న్ వాల్యూస్‌

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్