సినిమా : తందట్టి
నటీనటులు : రోహిణి, పశుపతి, దీపా శంకర్, అమ్ము అభిరామి, వివేక్ ప్రసన్న, మీనల్ తదితరులు..
సినిమాటోగ్రఫీ : మహేశ్ ముత్తుస్వామి
మ్యూజిక్ : సామ్ సీఎస్, కేఎస్ సుందరమూర్తి
దర్శకుడు : రామ్ సంగయ్య
నిర్మాత : కిరుబాకరన్ ఏకేఆర్, శ్రావంతి సాయినాథ్
ఓ పోలీస్ స్టేషన్ కు హెడ్ కానిస్టేబుల్ సుబ్రమణియన్(పశుపతి) కొత్తగా బదిలీ అవుతాడు. లేనిపోని విషయాల్లోకి వెళ్లి ట్రాన్స్ ఫర్స్ అవుతూ ఉంటాడు. కొత్తగా బదిలీ అయిన స్టేషన్లోనూ అతడి పరిస్థితి మారదు. దీంతో పై అధికారులు హెచ్చరిస్తారు. సుబ్రమణియన్ పని చేసే పోలీస్ స్టేషన్ పరిధిలో కిడారిపట్టి అనే గ్రామం కూడా ఉంటుంది. ఆ ఊరిలో తంగపొన్ను(రోహిణి) అనే వృద్ధురాలు ఉంది. ఆమెకు ఐదుగురు పిల్లలు ఉంటారు. ఓరోజు తను అదృశ్యం అవుతుంది. ఆ విషయాన్ని కంప్లైంట్ ఇచ్చేందుకు పోలీస్ స్టేషన్ వస్తారు ఇంట్లోవాళ్లు. మిగతా పోలీసులు ఎవరూ ఆ కేసును తీసుకోరు. కిడారిపట్టి గ్రామం గురించి వారికి తెలిసి.. సుబ్రమణియన్ ను కూడా వెళ్లొద్దని హెచ్చరిస్తారు. మరో పదిరోజుల్లో పదవి విరమణ చేసి వెళ్తావని ఇప్పుడు ఎందుకు ఇదంతా అంటారు.
తోటి పోలీసు మాటలు సుబ్రమణియన్ వినిపించుకోడు. కిడారిపట్టి వెళ్తూ ఉంటాడు. మార్గమధ్యంలో తంగపొన్ను మనవడు తన నానన్మ జీవితం గురించి, ఆమె ప్రేమ కథ గురించి చెబుతాడు. తంగపొన్ను వయసులో ఉన్నప్పుడు ఆమెను ప్రేమించిన వ్యక్తిని ఇంట్లోవాళ్లు చంపేసిన విధానం గురించి సుబ్రమణియన్ తో మనవడు వివరిస్తాడు. తర్వాత ఆమె కోసం వెతుకుతుండగా.. బస్ స్టాప్ లో కనిపిస్తుంది. కానీ కాసేపటికే మరణిస్తుంది. దీంతో కిడారిపట్టికి తంగపొన్ను మృతదేహాన్ని తీసుకెళ్తారు. అక్కడ ఆమె పిల్లలు ఆస్తులు, ఆమె చెవికి ఉన్న దుద్దులు ఎలా పంచుకోవాలా అనే ఆలోచిస్తారు. ఈ కేసు విషయమై సుబ్రమణియన్ కూడా ఊరిలోనే ఉండాల్సి వస్తుంది. అనుకోకుండా తంగపొన్ను డెడ్ బాడీకి ఉన్న చెవి దుద్దులు పోతాయి. ఆ దుద్దులు ఎవరు తీశారు? తంగపొన్ను పిల్లలు ఏం చేశారు? సుబ్రమణియన్ ను ఆ ఊరి వాళ్లు ఎందుకు ఇబ్బంది పెట్టారు? కానిస్టేబుల్ సబ్రమణియన్ చివరకు ఏం చేశాడు? తెలియాలంటే.. తందట్టి సినిమా చూడాల్సిందే..
మానవీయ బంధాలను ఆస్తులు ఎలా ప్రభావితం చేస్తాయో ఈ సినిమాలో చక్కగా చూపించారు. నవ్విస్తూనే.. సమాజానికి చురకలు పెట్టాడు దర్శకుడు రామ్ సంగయ్య. గ్రామంలోని సంబంధాలు, స్వార్థపూరిత మనసులు, ఆస్తి కోసం పిల్లలు చూపించే.. కపట ప్రేమను అర్థమయ్యేలా మలిచాడు. స్క్రీన్ ప్లేతో కథ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది. ఎమోషనల్ అవుతున్నామనుకునేలోపే.. కూతుళ్లు, కొడుకు చేసే పనులు కాస్త నవ్వు తెప్పిస్తాయి.
డబ్బు కోసం మనిషి ఎంతకైనా దిగజారుతాడనే విషయాన్ని దర్శకుడు చక్కగా చూపించాడు. ఓవైపు తల్లి చనిపోయినా.. ఏమాత్రం దిగులు లేకుండా కూర్చున్న పిల్లలు, చావు దగ్గరకు వచ్చిన అతిథులు కోరుకునే మర్యాదలను చూస్తే.. నిజజీవితంలోనూ జరిగే సంఘటనలలాగే అనిపిస్తాయి. నటీనటులు కూడా ఎవరి పాత్రలకు తగ్గట్టుగా వారి నటించారు. రోహిణి, పశుపతి తమ పాత్రల్లో జీవించేశారు. కూతురిగా దీపా శంకర్ కాస్త ఓవర్ ది టాప్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినా సెమ్మలర్ అన్నం, జానకి, పూవిత, తాగుబోతుగా వివేక్ ప్రసన్న డీసెంట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు.
మెుదట్లో ప్రేక్షకుడు కథలోకి వచ్చేందుకు కాస్త ఇబ్బంది పడతాడు. కానీ కథ ముందుకు వెళ్తుంటే.. ఆసక్తిగా సాగుతుంది. కాస్త స్లోగా సినిమా వెళ్తుంది. కానీ నవ్విస్తూ.. చురకలు అంటిస్తాడు దర్శకడు. అయితే శవాన్ని ఎత్తుకెళ్లడం చుట్టూనే కథ సాగి.. కాస్త నిరాశ అనిపిస్తుంది. కథను పొడిగించాడేమో అనే భావన కలుగుతుంది. మహేశ్ ముత్తుస్వామి సినిమాటోగ్రఫీ పల్లెటూరి అందాలను, మట్టి పరిమళాన్ని మన ముందు ఉంచే ప్రయత్నం చేశాడు. కెఎస్ సుందరముర్తి, సామ్ సీఎస్ సంగీతం కథకు బలం చేకూర్చింది. ఇక క్లైమాక్స్ అయితే ఎవరూ ఊహించరు. చెప్పకనే.. ఓ మంచి ప్రేమ కథను కూడా చెప్పాడు దర్శకడు. చిన్న చిన్న లోపాలు ఉన్నా.. తందట్టి చూడదగిన సినిమా.
చివరాఖరకు ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి ఎవరితో ఉన్నా.., వాళ్ల కట్టె కాలుతున్నా.. వారికి ఇష్టమైన పని చేయాలని చెప్పేది తందట్టి సినిమా.