Lubber Pandhu OTT: ఓటీటీలో దుమ్ముదులిపేస్తున్న ‘లబ్బర్ పందు’ మూవీ.. క్లైమాక్స్‌లో ఊహించని ట్విస్ట్!
Lubber Pandhu OTT Released: మనం ఇప్పటికే ఎన్నో స్పోర్ట్స్ డ్రామాలు చూసి ఉంటాం. కానీ.. లబ్బర్ పందు మనకి చాలా కొత్తగా.. థ్రిల్‌గా అనిపిస్తుంది. ఈ సినిమాలో లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ మనకి నవ్వుతో పాటు కన్నీళ్లని కూడా తెప్పిస్తాయి.
తమిళ్‌లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న స్పోర్ట్స్ యాక్షన్ మూవీ ‘లబ్బర్ పందు’ ఓటీటీలో సందడి చేస్తోంది. తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఓటీటీలో అందుబాటులోకి వచ్చిన ఈ మూవీ క్రికెట్ లవర్స్‌ని మాత్రమే కాదు.. ఫ్యామిలీ ఆడియెన్స్ నుంచి కూడా ప్రశంసలు అందుకుంటోంది.
యంగ్ హీరో హరీశ్ కళ్యాణ్ పెద్దగా పరిచయం లేకపోయినా సోషల్ మీడియాలో ఈ సినిమా గురించి నెటిజన్లు పాజిటివ్‌గా స్పందిస్తుండటంతో ‘లబ్బర్ పందు’ మూవీకి వ్యూస్ రోజురోజుకీ రెట్టింపు అవుతున్నాయి. ఈ మూవీని తమిళరాసన్ తెరకెక్కించారు.
సినిమా కథ ఏంటంటే?
తమిళనాడులోని ఓ పల్లెటూరులో ఉండే అభి (హరీశ్ కళ్యాణ్)కి క్రికెట్ అంటే చాలా ఇష్టంగా ఉంటుంది. అదే ఊరిలో బాగా అప్పటికే పాపులరైన ‘జాలీ ఫ్రెండ్స్’ టీమ్‌లో ఆడాలని ఆశిస్తుంటాడు. కానీ.. అందులోని కొంత మంది ప్లేయర్లు అభిని టీమ్‌లో ఆడించడానికి ఒప్పుకోరు. ఒక మ్యాచ్‌లో ఆడే అవకాశం వచ్చినా కేవలం ఫీల్డింగ్‌కే పరిమితం చేస్తారు. అయితే.. అదే మ్యాచ్‌లో జాలీ ఫ్రెండ్స్ టీమ్‌పై శేషు (దినేశ్ రవి) విధ్వంసకర రీతిలో బ్యాటింగ్ చేస్తాడు. ఏ బంతి వేసినా సిక్సర్ అనేలా హిట్టింగ్ చేస్తాడు.
కానీ..శేషుకి బ్యాటింగ్‌లో ఓ బలహీనత ఉందని.. ఒకవేళ తనకి బౌలింగ్ ఛాన్స్ ఇస్తే ఒక్క ఓవర్‌లోనే శేషుని ఔట్ చేస్తానని అభి తన స్నేహితుడితో చెప్తుంటాడు. ఈ విషయంలో సడన్‌గా శేషుకి తెలుస్తుంది. కానీ లైట్ తీసుకుంటాడు. అయితే అభి ఆశించినట్లు ఒక మ్యాచ్‌లో అనూహ్యంగా శేషుకి బౌలింగ్ చేసే ఛాన్స్ వస్తుంది. ఆ మ్యాచ్‌కి ముందే ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా జరగడంతో.. గేమ్‌లో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తారు.
సినిమాని మలుపు తిప్పే ఓవర్
అభి చెప్పినట్లే ఒకే ఓవర్‌లో శేషుని ఔట్ చేస్తాడా? అనే ఉత్కంఠ ఆ ఓవర్ ఆరు బంతుల్నీ ఊపిరి బిగబెట్టి చూసేలా చేస్తుంది. ఇక ఆ మ్యాచ్ నుంచి కథ ఊహించని మలుపులు తిరుగుతుంది. శేషు కూతురు దుర్గ (సంజనా కృష్ణమూర్తి) అని తెలియక అభి ప్రేమిస్తాడు. తెలిశాక అభి ఏం చేస్తాడు? ఇగోకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న శేషుని ఎలా ఒప్పిస్తాడు? ఇద్దరూ కలిసి ఒకే మ్యాచ్‌లో ఆడాల్సి వచ్చినప్పుడు ఇగోకి వెళ్లడం.. క్యాచ్ చేజారడం నవ్వులు పూయిస్తుంది.
శపథం vs ఇగో
శేషుతో ఒకవైపు వార్ జరుగుతుండగా.. మరోవైపు అభి లోకల్ టోర్నీలో గెలుస్తానని శపథం చేస్తాడు. దాని కోసం కొత్తగా టీమ్‌ను రెడీ చేయడం.. అందులోకి సడన్‌గా శేషు రావడంతో ప్రేక్షకుల ఆసక్తి రెట్టింపు అవుతుంది.
శేషు భార్యకి క్రికెట్ అంటే ఇష్టలేకపోవడంతో.. అతడ్ని ఆట ఆడకుండా నిలువరించేందుకు ఆమె చేసే ప్రయత్నాలు.. కొన్నిసార్లు నవ్వులు పూయిస్తాయి. మరికొన్ని సార్లు కన్నీళ్లు తెప్పిస్తాయి. ఇద్దరి మధ్య ప్రేమ ఒకవైపు, బాధ్యత మరోవైపు.. మిడిల్ క్లాస్ ఆడియెన్స్‌ని కట్టిపడేస్తాయి.
ఊహించని క్లైమాక్స్
ప్రేమ, ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాతో పాటు కామెడీ కూడా సందర్భోచితంగా జోడించిన దర్శకుడు తమిళరాసన్.. క్లైమాక్స్‌లోనూ ఊహించని ట్విస్ట్ ఇస్తాడు. సాధారణంగా టాలీవుడ్ సినిమాల్లో ఇలాంటి క్లైమాక్స్ ఉండదు. సినిమా నిడివి 2.24 గంటలు ఉన్నా.. ఎక్కడా బోర్ కొట్టదు. మొత్తంగా ‘లబ్బర్ పందు’ ఓ మంచి సినిమాని చూసిన ఫీలింగ్ ఇస్తుంది.
లబ్బర్ పందు మూవీ ఓటీటీలో డిస్నీ+ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మీరూ సినిమాని చూసి ఎంజాయ్ చేయండి.