Movie Releasing in TV: థియేటర్లు, ఓటీటీలను కాదని నేరుగా టీవీలో రిలీజవుతున్న మూవీ.. షాక్‌లో నటీనటులు
Movie Releasing in TV: ఓ కొత్త సినిమా అంటే థియేటర్లలో రిలీజ్ అవుతుందని అనుకుంటాం. ఈ మధ్య ఓటీటీల్లోనూ అవుతున్నాయి. కానీ ఇవి రెండూ కాదని ఓ తమిళ సినిమా నేరుగా టీవీలోకే వచ్చేస్తోంది.
Movie Releasing in TV: థియేటర్లలో రిలీజ్ కావాల్సిన సినిమా నేరుగా టీవీలోకి వస్తే ఎలా ఉంటుంది? ఈ విషయం కనీసం ఆ మూవీలో నటించిన నటీనటులకు కూడా తెలియకపోతే ఇంకెలా ఉంటుంది? ప్రస్తుతం తమిళ సినిమా పొన్ ఒండ్రు కండెన్ విషయంలో ఇదే జరుగుతోంది. కలర్స్ తమిళ్ ఛానెల్ మూవీ ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేయడంతో మొత్తం ఇండస్ట్రీ షాక్ కు గురైంది.
టీవీలో పొన్ ఒండ్రు కండెన్ రిలీజ్
సినిమాలంటే థియేటర్లలోనే రిలీజ్ అవుతాయన్నది ఒకప్పటి మాట. ఓటీటీలు, తర్వాత కరోనా కారణంగా కొన్ని సినిమాలు నేరుగా డిజిటల్ ప్లాట్‌ఫామ్ లోనూ రిలీజ్ అయ్యాయి. అయితే థియేటర్లు, ఓటీటీలను కాదని నేరుగా టీవీలోకి మూవీ రావడం మాత్రం కచ్చితంగా ఆశ్చర్యం కలిగించేదే. తమిళ సినిమా పొన్ ఒండ్రు కండెన్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అంటూ కలర్స్ తమిళ్ ఛానెల్ అనౌన్స్ చేయడం ఆ మూవీ నటీనటులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది.
కనీసం తమకు కూడా చెప్పకుండా జియో సినిమాలాంటి మేకర్స్ మూవీని నేరుగా టీవీలో రిలీజ్ చేయడం ఏంటని ఇందులో నటించిన వసంత్ రవి ట్వీట్ చేశాడు. గురువారం (మార్చి 14) ఈ మూవీ ప్రీమియర్ విషయాన్ని సదరు ఛానెల్ ఓ వీడియో ద్వారా ట్వీట్ చేసింది. ఇది చూసి షాక్ తిన్న వసంత్ రవి కూడా ఇదేంటని ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు.
ఇది నిజంగా షాకింగ్..
వసంత్ రవి ఆ ట్వీట్ లో ఏమన్నాడంటే.. "షాకింగ్.. అసలు ఇది నిజమేనా? జియో స్టూడియోస్ లాంటి పేరున్న, టాప్ ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఇలాంటిది ఊహించలేదు. పొన్ ఒండ్రు కండెన్ మూవీ ప్రోమో, వరల్డ్ శాటిలైట్ ప్రీమియర్ తేదీని కనీసం అశోక్ సెల్వన్, ఐశ్వర్యలక్ష్మి, డైరెక్టర్ ప్రియ మేడమ్, సినిమాతో సంబంధం ఉన్న ఎవరికీ చెప్పకుండా అనౌన్స్ చేయడం చూస్తుంటే చాలా బాధగా ఉంది.
ఈ సినిమా కోసం మేము చాలా కష్టపడ్డాం. పొన్ ఒండ్రు కండెన్ టీమ్ మొత్తానికి ఈ విషయం గురించి తెలియదు. ఎవరూ చెప్పలేదు. సోషల్ మీడియా ఎక్స్ ద్వారానే ఈ విషయం చెప్పినందుకు జియో స్టూడియోస్ కు కృతజ్ఙతలు. సినిమాను క్రియేట్ చేసినవాళ్లకు లేదంటే నటీనటులకు మీ కమర్షియల్ నిర్ణయంపై ఎలాంటి అధికారం ఉండదని తెలుసు. కానీ దీనికి సంబంధించిన సమాచారాన్ని మీ నుంచి నేరుగా వినే హక్కు వాళ్లకు ఉంది" అని వసంత్ రవి చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యాడు.
ఈ పొన్ ఒండ్రు కండెన్ మూవీలో వసంత్ రవితోపాటు ఐశ్వర్య లక్ష్మి నటించింది. మూవీని ప్రియా కామాక్షి డైరెక్ట్ చేయగా.. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు. అయితే ఈ సినిమా చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటూనే ఉంది. ఎన్నో అడ్డంకులు రావడంతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే చివరికి ఈ సినిమాను ఇలా నేరుగా టీవీలో రిలీజ్ చేస్తారని మాత్రం మూవీలోని యాక్టర్స్ కూడా ఊహించలేదు.