Kanguva: రిలీజ్ ముంగిట కంగువా సినిమాకి కొత్త కష్టం.. నిర్మాత కారణంగా ఇరుకునపడిన హీరో సూర్య-tamil hero suriya kanguva faces legal hurdle over unpaid loan ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Kanguva: రిలీజ్ ముంగిట కంగువా సినిమాకి కొత్త కష్టం.. నిర్మాత కారణంగా ఇరుకునపడిన హీరో సూర్య

Kanguva: రిలీజ్ ముంగిట కంగువా సినిమాకి కొత్త కష్టం.. నిర్మాత కారణంగా ఇరుకునపడిన హీరో సూర్య

Galeti Rajendra HT Telugu
Nov 02, 2024 07:53 PM IST

Suriya Release Date: కోలీవుడ్ బాహుబలి‌గా ప్రచారం పొందిన కంగువా సినిమా రిలీజ్‌పై సందిగ్ధత నెలకొంది. ఈ సినిమా రిలీజ్‌ను నిలిపివేయాలంటూ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ డిమాండ్ చేస్తోంది. దానికి కారణం ఏంటంటే?

కంగువాలో సూర్య
కంగువాలో సూర్య

తమిళ్ హీరో సూర్య నటించిన కంగువా సినిమాకి కొత్త కష్టం వచ్చిపడింది. భారీ అంచనాల నడుమ రిలీజ్‌కి సిద్ధమవుతున్న ఈ ఫాంటసీ యాక్షన్ మూవీ నవంబరు 14న రిలీజ్ కావాల్సి ఉంది. ఈ మేరకు చిత్ర యూనిట్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా.. నిర్మాత కేఈ జ్ఞానవేల్‌‌పై సడన్‌గా రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ కోర్టుకి‌ ఎక్కింది. దాంతో రిలీజ్ వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి.

నిర్మాతపై కోర్టులో దావా

కంగువా సినిమా నిర్మాత కేఈ జ్ఞానవేల్‌‌ తమ వద్ద రూ.99 కోట్లకి పైగా అప్పు తీసుకున్నాడని.. కానీ ఇందులో రూ.45 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉందని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ తాజాగా మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది. తమకి ఇవ్వాల్సిన డబ్బుని పూర్తిగా చెల్లించే వరకూ కంగువా సినిమా రిలీజ్‌ని నిలిపివేయాలని ఆ సంస్థ అభ్యర్థించింది. దాంతో సినిమా రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఈ కేసుని మద్రాస్ హైకోర్టు నవంబరు 7న విచారించనుండగా.. ఒకవేళ రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌‌ సంస్థకి అనుకూలంగా తీర్పు వస్తే నవంబరు 14న థియేటర్లలోకి కంగువా రావడం కష్టమే.

సౌత్‌లో ఆసక్తి

తెలుగులో బాహుబలి.. తమిళ్‌లోనూ కంగువా అంటూ ఇప్పటికే చిత్ర యూనిట్ జోరుగా ప్రచారం చేస్తోంది. దాంతో మూవీపై ఇప్పటికే అంచనాలు పతాక స్థాయికి చేరిపోయాయి. సౌత్‌లోనూ ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. అంతేకాక కంగువా -2 కూడా ఉండబోతోందని ఇప్పటికే ఆ చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ ప్రకటించేశారు. 2027లో కంగువా సీక్వెల్ రిలీజ్ చేస్తామని కూడా చెప్పేశారు. కానీ ఇప్పుడు కంగువా మొదటి భాగం విడుదలపైనే సస్పెన్స్ నెలకొంది.

ప్రమోషన్స్‌లో సూర్య బిజీ బిజీ

కంగువా సినిమా టీజర్స్, ట్రైలర్‌ విడుదల నుంచి హైప్ పెంచుకుంటూ వచ్చిన చిత్ర యూనిట్.. ఇటీవల హైదరాబాద్‌లో కూడా ప్రమోషన్స్ చేసింది. సౌత్‌లోనే కాదు.. హిందీలోనూ ఈ సినిమాని సూర్య భుజాలపై వేసుకుని ప్రమోషన్స్ చేస్తున్నాడు. ఒకవైపు సూర్య ఇంత కష్టపడుతుంటే. మరోవైపు కేఈ జ్ఞానవేల్‌ కారణంగా సినిమా వాయిదా పడే సూచనలు కనిపిస్తున్నాయి. కోలీవుడ్ నుంచి రూ.1000 కోట్లు వసూలు చేయగల చిత్రం కంగువా అని ఇప్పటికే అక్కడ మీడియా రాసుకొస్తోంది. మరి రిలీజ్ కష్టాలు తీరి నవంబరు 14న ఈ సినిమా థియేటర్లకి వస్తుందో లేదో చూడాలి .

Whats_app_banner