తమిళంతోపాటు తెలుగులోనూ బ్లాక్‌బస్టర్ అయిన రొమాంటిక్ కామెడీ మూవీ డ్రాగన్ (Dragon). ఈ ఏడాది ఫిబ్రవరి 21న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా.. మార్చిలో నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు వచ్చింది. ఇక సుమారు నాలుగు నెలల తర్వాత టీవీ ప్రీమియర్ కు సిద్ధమైంది. మరి ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ వివరాలు తెలుసుకోండి.
తమిళ నటుడు ప్రదీప్ రంగనాథన్ నటించిన మూవీ డ్రాగన్. ఈ సినిమా వచ్చే ఆదివారం (జూన్ 8) సాయంత్రం 6 గంటలకు స్టార్ మా ఛానెల్లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని ఆ ఛానెల్ శుక్రవారం (జూన్ 6) వెల్లడించింది. అదే రోజు విజయ్ టీవీలో తమిళ వరల్డ్ టీవీ ప్రీమియర్ కూడా కానుంది.
ఈ మూవీ టెలికాస్ట్ విషయాన్ని వెల్లడిస్తూ.. ఓ చిన్న వీడియోను కూడా పోస్ట్ చేసింది స్టార్ మా ఛానెల్. థియేటర్లు, ఓటీటీలో మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న ఈ డ్రాగన్ మూవీని టీవీల్లోనూ ప్రేక్షకులు ఆదరిస్తారని మేకర్స్ ఆశతో ఉన్నారు.
డ్రాగన్ మూవీకి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహించాడు. కామెడీతో మెప్పించాడు. ప్రదీప్ రంగనాథన్ మరోసారి తన కామెడీ టైమింగ్, యాక్టింగ్‍తో అదరగొట్టాడు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్, కాయదు లోహర్ హీరోయిన్లుగా నటించారు. కేఎస్ రవి కుమార్, గౌతమ్ మీనన్, స్నేహ, మిస్కిన్, హర్షంత్ ఖాన్, మరియం జార్జ్ కీలకపాత్రలు పోషించారు.
డ్రాగన్ సినిమా సుమారు రూ.37 కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర రూ.150 కోట్ల గ్రాస్ కలెక్షన్లను దాటేసింది. తమిళంతో పాటు తెలుగులోనూ మంచి వసూళ్లు వచ్చాయి. డ్రాగన్ మూవీకి ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. యూత్‍ను విపరీతంగా మెప్పించింది. దీంతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‍బస్టర్ కొట్టేసింది. లవ్ టుడే తర్వాత మరోసారి భారీ సక్సెస్ అందుకున్నాడు ప్రదీప్ రంగనాథన్.
డ్రాగన్ మూవీని ఎజీఎస్ ఎంటర్‌టైన్‍మెంట్ బ్యానర్‌పై కల్పాతి అఘోరం, కల్పాతి ఎస్ గణేశ్, కల్పాతి ఎస్ సురేశ్ ప్రొడ్యూజ్ చేశారు. ఈ మూవీ నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది. ఈ చిత్రానికి లియోన్ జేమ్స్ మ్యూజిక్ ఇచ్చారు.
డ్రాగన్ అలియాస్ రాఘవన్ (ప్రదీప్ రంగనాథన్)కు ఇంజినీరింగ్‍లో 48 బ్యాక్‍లాగ్స్ ఉంటాయి. ఈ క్రమంలోనే గర్ల్ ఫ్రెండ్ కీర్తి (అనుపమ పరమేశ్వరన్)తో అతడికి బ్రేకప్ అవుతుంది. తాను జీవితంలో ఉన్నతస్థాయికి వెళతానని కీర్తికి సవాల్ చేస్తాడు రాఘవన్. ఫేక్ సర్టిఫికేట్లు సృష్టించి మంచి ఉద్యోగం తెచ్చుకుంటాడు.
మరో అమ్మాయి పల్లవి (కాయదు లోహర్)ను ప్రేమించి పెళ్లికి రెడీ అవుతాడు. అంతలోనే కాలేజీ ప్రిన్సిపాల్ రాఘవన్‍కు ఎదురవుతాడు. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగం తెచ్చుకున్నాడని గుర్తిస్తాడు. కాలేజీలో బ్యాక్‍లాగ్స్ క్లియర్ చేసి పాస్ అవుతావా.. లేదా మోసాన్ని బయటపెట్టి ఉద్యోగం పోయేలా చేయాలా అని రాఘవన్‍ను హెచ్చరిస్తాడు.
దీంతో మళ్లీ కాలేజీలోకి రాఘవన్ ఎంటర్ అవుతాడు. మరి అన్ని సబ్జెక్టుల్లో రాఘవన్ పాసయ్యాడా.. పల్లవిని పెళ్లి చేసుకున్నాడా.. ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేది డ్రాగన్ చిత్రంలో ప్రధానమైన అంశాలుగా ఉంటాయి.
సంబంధిత కథనం