Allu Arjun Trivikram Movie: అల్లు అర్జున్, త్రివిక్రమ్ భారీ బడ్జెట్ చిత్రంలో ప్రముఖ తమిళ నటుడు!
Allu Arjun Trivikram Movie: అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‍లో ఓ మూవీ రూపొందనుంది. ఈ ప్రాజెక్టుపై క్రేజ్ విపరీతంగా ఉంది. ఈ చిత్రంలో ఓ తమిళ నటుడు ఓ పాత్ర పోషించనున్నారంటూ తాజాగా సమాచారం బయటికి వచ్చింది.

పుష్ప 2: ది రూల్ చిత్రంతో బిగ్గెస్ట్ బ్లాక్‍బస్టర్ కొట్టేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. సుకుమార్ దర్శత్వంలో అల్లు అర్జున్ హీరోగా చేసిన ఆ మూవీ చాలా బాక్సాఫీస్ రికార్డును తిరగరాసింది. ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలోనూ హవా చూపిస్తోంది. అల్లు అర్జున్ తుదుపరి మాటల మాంత్రికుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‍తో కలిసి ఓ సినిమా చేయనున్నారు. భారీ బడ్జెట్‍తో రూపొందనున్న ఈ చిత్రంపై చాలా క్రేజ్ ఉంది. అప్‍డేట్లు ఎప్పుడు వస్తాయా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాలో ఓ తమిళ నటుడు ఓ కీలకపాత్ర పోషించనున్నారని తెలుస్తోంది.
కీలకపాత్రలో సముద్రఖని
తమిళ ప్రముఖ నటుడు, దర్శకుడు సముద్రఖని.. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్‍లో రానున్న మూవీలో ఓ కీలకపాత్ర పోషించనున్నారని సమాచారం బయటికి వచ్చింది. ఇప్పటికే ఈ విషయంపై చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబోలో సూపర్ హిట్ అయిన అల వైకుంఠపురములో చిత్రంలో సముద్రఖని మెయిన్ విలన్‍గా నటించారు. ఇప్పుడు మరోసారి ఆయనను తీసుకునేందుకు త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారు.
అలవైకుంఠపురములో, క్రాక్, భీమ్లానాయక్, ఆర్ఆర్ఆర్, హనుమాన్‍తో పాటు పలు చిత్రాల్లో నటించి తెలుగులోనూ చాలా పాపులర్ అయ్యారు సముద్రఖని. ఒకప్పుడు దర్శకుడిగా ఉన్న ఆయన ప్రస్తుతం యాక్టింగ్‍వైపే దృష్టి సారిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగు, మలయాళ చిత్రాల్లోనూ వరుసగా నటిస్తున్నారు.
రామం రాఘవం సినిమాలో సముద్రఖని లీడ్ రోల్ చేశారు. ఈ చిత్రానికి జబర్దస్త్ కామెడియన్ ధన్‍రాజ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీలో ఆ ఇద్దరూ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీపై మంచి ఇంట్రెస్ట్ ఉంది. ఈ చిత్రం ఫిబ్రవరి 21వ తేదీన రిలీజ్ కానుంది.
స్క్రిప్ట్ పనులు పూర్తి
అల్లు అర్జున్‍తో చేసే సినిమాకు ఇప్పటికే స్క్రిప్ట్ పనులను త్రివిక్రమ్ శ్రీనివాస్ పూర్తి చేశారని తెలుస్తోంది. షూటింగ్‍కు ముందు చేయాల్సిన పనుల్లో బిజీగా ఉన్నట్టు సమాచారం. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాకు మైథలాజికల్ బ్యాక్‍డ్రాప్ ఉంటుందని టాక్. ఈ చిత్రంలో కార్తికేయుడిగా అల్లు అర్జున్ కనిపిస్తారని రూమర్లు ఉన్నాయి. దీంతో క్రేజ్ మరింత ఎక్కువగా ఉంది.
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‍లో ఇది నాలుగో చిత్రం కానుంది. ఇప్పటికే వీరిద్దరూ కలిసి జులాయ్ (2012), సన్నాఫ్ సత్యమూర్తి (2015), అల వైకుంఠపురములో (2020) సినిమాలు చేశారు. నాలుగోసారి జతకట్టారు. ఈసారి భారీ బడ్జెట్ మూవీ చేయనున్నారు. ఈ చిత్రాన్ని కూడా హారిక, హాసిని క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూజ్ చేయనుంది.
మరోవైపు, తమిళ దర్శకుడు అట్లీతోనూ ఓ మూవీకి అల్లు అర్జున్ గ్రీన్‍సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది.
సంబంధిత కథనం