Tamannah Break Up: సినిమా ఇండస్ట్రీలో మరో జంట పెళ్లి పీటల వరకూ వెళ్లకుండానే విడిపోయింది. తమన్నా, విజయ్ వర్మ జంట బ్రేకప్ చెప్పుకున్నట్లు మనీకంట్రోల్ రిపోర్ట్ వెల్లడించింది. కొన్నేళ్లుగా రిలేషన్‌షిప్ లో ఉన్న ఈ ఇద్దరూ విడిపోయినట్లు ఆ జంట సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు ఆ రిపోర్టు తెలిపింది.
తమన్నా, విజయ్ వర్మ లవ్ స్టోరీ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది. కొన్నాళ్ల పాటు సీక్రెట్ గా డేటింగ్ చేసినా.. తర్వాత తాము ప్రేమలో ఉన్నట్లు పబ్లిగ్గా వెల్లడించి ఆశ్చర్యపరిచారు. వీళ్ల పెళ్లి కూడా త్వరలోనే జరగబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా ఈ ఇద్దరూ ఎవరి దారి వారు చూసుకున్నట్లు వార్తలు వస్తుండటం గమనార్హం.
ఇద్దరూ విడిపోయినా స్నేహితులుగా కొనసాగుతారని కూడా ఆ రిపోర్టు చెప్పింది. “కొన్ని వారాల కిందటే తమన్నా, విజయ్ వర్మ విడిపోయారు. కానీ వాళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరూ ప్రస్తుతం వాళ్ల షూటింగ్ లలో బిజీగా ఉన్నారు” అని ఆ జంట సన్నిహిత వర్గాలు వెల్లడించినట్లు మనీకంట్రోల్ రిపోర్టు తెలిపింది.
తమన్నా, విజయ్ డేటింగ్ వార్తలు తొలిసారి 2023లో లస్ట్ స్టోరీస్ 2 అనే ఆంథాలజీ సమయంలో బయటకు వచ్చాయి. ఈ ఇద్దరూ ఇందులో తొలిసారి కలిసి నటించారు. అంతేకాదు తమన్నా తన నో కిస్సింగ్ పాలసీని పక్కన పెట్టి ఇందులో విజయ్ తో ఘాటు రొమాన్స్ సీన్లోనూ నటించింది.
కొన్నాళ్ల పాటు వీళ్లు తమ బంధం గురించి చెప్పకపోయినా.. ఓ ఇంటర్వ్యూలో విజయ్ ఓపెన్ అయిపోయాడు. తమ రిలేషన్షిప్ ను సీక్రెట్ గా ఉంచడం లేదని, అయితే దీనిని ప్రైవేట్ గా ఉంచాలని అనుకుంటున్నట్లు అతడు చెప్పాడు. ఆ తర్వాత తమన్నా కూడా డేటింగ్ ను కన్ఫమ్ చేసింది. ఇద్దరూ కలిసి ఎన్నో ఈవెంట్లకు వెళ్లారు. ఫొటోలకు పోజులిచ్చారు.
త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇంతలోనే ఈ జంట బ్రేకప్ వార్తలు తెరపైకి రావడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. తమన్నా తన సోషల్ మీడియా అకౌంట్ల నుంచి విజయ్ ఫొటోలను కూడా డిలీట్ చేయడం విశేషం. తమన్నా ప్రస్తుతం ఓదెల 2 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే ఈ మూవీ టీజర్ ను మహా కుంభమేళాలో రిలీజ్ చేశారు.
సంబంధిత కథనం