Happy Days Re Release: మళ్లీ థియేటర్లలో హ్యాపీ డేస్ మూవీ.. 17 ఏళ్లకు రీ రిలీజ్.. ఏ రోజున రిలీజ్ అంటే?
Happy Days Movie Re Release: తెలుగు యూత్‌ను ఉర్రూతలూగించిన సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయనుంది. యూత్‌ఫుల్ లవ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన హ్యాపీ డేస్ మూవీ మరోసారి తమ కాలేజీ డేస్ గుర్తు చేసేందుకు ఆ రోజున థియేటర్లలో మళ్లీ రిలీజ్ కానుంది.
Happy Days Movie Re Release: నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో 2007లో విడుదలైన 'హ్యాపీ డేస్' యూత్ ఫుల్ కల్ట్ క్లాసిక్ గా ప్రేక్షకులని అలరించింది. ప్రేక్షకులు, విమర్శకుల ప్రసంశలతో పాటు అద్భుతమైన కలెక్షన్స్‌తో బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించింది. యూత్ ఫుల్ చిత్రాలలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన 'హ్యాపీ డేస్' మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 12న హ్యాపీ డేస్ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. అంటే సుమారు 17 ఏళ్లకు మళ్లీ విడుదల అవుతోంది. గ్లోబల్ సినిమాస్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో చాలా గ్రాండ్‌గా హ్యాపీ డేస్ మూవీ రీ రిలీజ్ కానుంది. అప్పుడు వరుణ్ సందేశ్, మిల్కీ బ్యూటి తమన్నా భాటియా, హీరో నిఖిల్ సిద్ధార్థ్ లాంటి న్యూ కమ్మర్స్‌తో డైరెక్టర్ శేఖర్ కమ్ముల వెండితెరపై అద్భుతమైన మ్యాజిక్ చేశారు. శేఖర్ కమ్ముల ఎక్స్‌ట్రార్డినరీ డైరెక్షన్, నటీనటులు పర్ఫార్మెన్స్, మిక్కీ జేమేయర్ చార్ట్ బస్టర్ మ్యూజిక్ ప్రేక్షకుల మనుసులో ఎవర్ గ్రీన్‌గా నిలిచాయి.
శేఖర్ కమ్ముల తన అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై హ్యాపీ డేస్ సినిమాను చాలా రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్‌తో నిర్మించారు. విజయ్ సి. కుమార్ డీవోపీగా పని చేసిన ఈ మూవీకి మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటర్‌గా వర్క్ చేశారు. యూత్ ఫుల్ కల్ట్ క్లాసిక్‌గా అలరించిన ఈ సినిమా మరోసారి థియేటర్స్‌లో మెస్మరైజింగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది. రూ. 1 కోటి బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ హ్యాపీ డేస్ మూవీ మొత్తంగా రూ. 10 కోట్ల కలెక్షన్స్ సాధించి పెట్టింది.
2007 అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన హ్యాపీ డేస్ మూవీ అప్పట్లో ఎంలాంటి మ్యాజిక్ క్రియేట్ చేసిందో తెలిసిందే. అంతా కొత్త నటీనటులతో ఎవర్ గ్రీన్ మూవీగా విజయం సాధించింది. ఇక ఇప్పుడు అందులో పని చేసిన నటీనటులు తమ కెరీర్‌లో బాగా రాణిస్తున్నారు. అందులో మెయిన్ లీడ్ హీరోయిన్‌గా చేసిన తమన్నా ఇప్పటికీ ఇండస్ట్రీలో స్టార్‌గా కొనసాగుతోంది. తెలుగు సినిమాలతోపాటు హిందీలోనూ హవా చాటుతోంది.
సౌత్, నార్త్ మాత్రమే కాకుండా ఓటీటీలో డిఫరెంట్ కంటెంట్ సిరీస్, సినిమాలతో దూసుకుపోతోంది తమన్నా. జైలర్‌లో స్పెషల్ సాంగ్‌తో అదరగొట్టిన తమన్నా లస్ట్ స్టోరీస్ 2, జీ కర్దా, ఆఖరి సచ్ వంటి వెబ్ సిరీస్‌లతో హైలెట్ అయింది. తన హాట్ పర్ఫామెన్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది. ఇక నిఖిల్ హీరోగా తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సాలిడ్ హిట్ అందుకున్నాడు.
కార్తికేయ 2 తర్వాత వచ్చిన 18 పేజీస్ సినిమా కూడా పర్వాలేదనిపించుకుంది. కానీ, ఆ తర్వాత వచ్చిన స్పై మూవీ మాత్రం బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. ఇక హ్యాపీ డేస్ వంటి సూపర్ మూవీ అందించిన డైరెక్టర్ శేఖర్ కమ్ముల కుబేర వంటి ప్రతిష్టాత్మక మూవీ చేస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున అక్కినేనితో కలిసి మల్టీ స్టారర్ సినిమా రూపొందిస్తున్నారు. ఈ మూవీకి కుబేర అని టైటిల్ పెట్టినట్లు ఇటీవలే ప్రకటించారు.
శ్రీ నారాయణ్ దాస్ కె నారంగ్ ఆశీస్సులతో, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP (ఆసియన్ గ్రూప్ యూనిట్), అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ కుబేరా సినిమాను నిర్మిస్తున్నారు. సోనాలి నారంగ్ సమర్పిస్తున్నారు. ఇందులో హీరోయిన్‌గా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా చేస్తోంది.