సెర్చ్: ది నైనా మర్డర్ కేస్ రివ్యూ
నటీనటులు: కొంకణా సేన్ శర్మ, సూర్య శర్మ, శివ్ పండిట్, శ్రద్ధా దాస్, ఇరావతి హర్షే, సాగర్ దేశ్‌ముఖ్
దర్శకుడు: రోహన్ సిప్పీ
రేటింగ్: ★★★
రోహన్ సిప్పీ డైరెక్ట్ చేసిన 'సెర్చ్: ది నైనా మర్డర్ కేస్' సిరీస్ ప్రేక్షకులను ఒక విషయంలో కచ్చితంగా గెలుస్తుంది. అది మిమ్మల్ని ఫోన్ పక్కన పెట్టేలా చేస్తుంది. ఈ రోజుల్లో చాలావరకు స్ట్రీమింగ్ కంటెంట్‌ను మనం తింటూ, వండుకుంటూ లేదా పనిచేసుకుంటూ మామూలుగా చూస్తుంటాం. కానీ సెర్చ్ సిరీస్ మాత్రం మీ పూర్తి ఏకాగ్రతను కోరుతుంది. దీనికి కారణం, రోహన్ సిప్పీ సృష్టించిన ఉత్కంఠభరితమైన కథనం ఒకటి అయితే, కొంకణా సేన్ శర్మ తెరపై చేసే మ్యాజిక్ మరొకటి.
'సెర్చ్: ది నైనా మర్డర్ కేస్' సిరీస్ సస్పెన్స్ థ్రిల్లర్. ఇది అక్టోబర్ 10న ఓటీటీలోకి వచ్చింది. జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఏడు ఎపిసోడ్లతో ఓటీటీలో రిలీజైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ జియోహాట్‌స్టార్ స్పెషల్ సిరీస్ ఇప్పుడీ ఓటీటీలో టాప్-5లో ట్రెండింగ్ అవుతోంది.
ఏసీపీ సంయుక్త దాస్ (కొంకణా సేన్ శర్మ) క్రైమ్ సెల్ నుండి సైబర్‌క్రైమ్‌లో కాస్త 'రిలాక్స్‌డ్' పోస్టింగ్‌కు వెళ్లేందుకు సిద్ధమవుతుంది. దీనివల్ల ఆమె తన చిన్నాభిన్నమవుతున్న కుటుంబం, దూరంగా ఉన్న భర్తపై ఎక్కువ దృష్టి పెట్టగలదు. కానీ ఆమె స్థానంలో పొగరుబోతు ఏసీపీ జై కన్వల్ (సూర్య శర్మ) రాగానే, ఒక టీనేజ్ అమ్మాయి దారుణ హత్య ఆమెను వెనక్కి లాగుతుంది.
ఇప్పుడు స్థానిక రాజకీయ నాయకుడితో (శివ్ పండిట్) సంబంధాలున్న ఈ హత్య మిస్టరీని ఛేదించడానికి కాలంతో పోటీ పడాలి. మరోవైపు, ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా సొంతంగా దర్యాప్తు ప్రారంభించడానికి ప్రయత్నిస్తుంటారు.
'సెర్చ్' సిరీస్ కథను సాగదీయకుండా, అనవసరమైన వివరణలతో సమయం వృథా చేయదు. ఇది నేరుగా హత్య, దర్యాప్తులోకి వెళ్ళిపోతుంది. అదే సమయంలో పాత్రల నేపథ్యాలను పరిచయం చేయడానికి కూడా కొంత అవకాశం ఇస్తుంది. ఇది మిస్టరీలోని పొరలను ఒక్కొక్కటిగా విప్పుతుంది. ప్రారంభం బాగుంది. కొంకణా సేన్ శర్మ, అరుదుగా లభించే ఒక దృఢమైన పాత్రలో బాగా నటించింది. పని, కుటుంబాన్ని సమన్వయం చేసుకోవడానికి కష్టపడే ఒక పోలీస్ అధికారిణిగా, టెక్నాలజీ తమను అధిగమించిన ప్రపంచంలో టీనేజర్లను పెంచడంలో జెన్ ఎక్స్ తల్లిదండ్రుల పోరాటానికి ఆమె ప్రతీకగా నిలుస్తుంది.
ఒక తల్లి భయాలను, ఒక పోలీస్ అధికారి ఆందోళనను ఆమె చక్కగా ప్రదర్శించింది. సూర్య శర్మ మరో స్టార్. జై పాత్రను వీలైనంత చిరాకు తెప్పించేలా చేస్తాడు, కానీ ఎప్పుడూ ఆ పాత్రను ఒక కార్టూన్‌లా మార్చడు. అతను మంచి మనసున్న పోలీస్, కాకపోతే కాస్త ఎక్కువ సినిమాలు చూసినట్టు అనిపిస్తాడు. చనిపోయిన అమ్మాయి తల్లిగా ఇరావతి హర్షే అద్భుతంగా నటించింది. ఆమె కథకు అవసరమైన భావోద్వేగ బంధాన్ని, సున్నితత్వాన్ని తీసుకువచ్చింది. ఈ షోలో నేరాన్ని ప్రత్యక్షంగా లేదా గ్రాఫిక్‌గా ఎక్కడా చూపించలేదు. అందువల్ల, ఆ నష్టాన్ని అర్థం చేసుకోవాలంటే, తల్లిదండ్రుల బాధ బయటకు రావాలి.
శ్రద్ధా దాస్ కేవలం గ్లామరస్‌గా కాకుండా, అవకాశం దొరికినప్పుడు నటించగలనని మరోసారి నిరూపించుకుంది. ఇన్ని మంచి లక్షణాలు ఉన్నప్పటికీ 'సెర్చ్' సిరీస్ చివర్లో తడబడింది. ఎందుకంటే, ఇది భారతీయ స్ట్రీమింగ్ షోలు సంవత్సరాలుగా అలవాటు చేసుకున్న మూస ధోరణులకు లొంగిపోయింది. ముగింపు సమీపిస్తున్న కొద్దీ కథనం నెమ్మదిస్తుంది. షో ముగిసినప్పుడు నిజంగా ముగిసిందా? అనే ఒక సందేహం మిగిలిపోతుంది. సరైన ముగింపు లేకపోవడమే ‘సెర్చ్’ అతిపెద్ద లోపం. ఇది అంతకు ముందు ఆరు ఎపిసోడ్లలో చేసిన మంచి పనిని నీరుగార్చేసింది.
సంబంధిత కథనం