Suriya Tweet: “ఆశ్చర్యపోతున్నా”: తెలుగు ప్రేక్షకుల గురించి హీరో సూర్య ట్వీట్
Surya S/O Krishnan - Suriya Tweet: తెలుగు ప్రేక్షకుల అభిమానంపై తమిళ స్టార్ హీరో సూర్య ట్వీట్ చేశాడు. సూర్య సన్నాఫ్ కృష్ణన్ రీ-రిలీజ్‍కు తెలుగు అభిమానుల నుంచి వస్తున్న స్పందన గురించి సంతోషం వ్యక్తం చేశాడు.

Surya S/O Krishnan - Suriya Tweet: తమిళ ప్రముఖ హీరో సూర్యకు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ అభిమానగణం భారీగా ఉంది. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. తమిళంలో రూపొంది తెలుగులో డబ్బింగ్ ద్వారా వచ్చిన ఆయన చిత్రాలు చాలా సూపర్ హిట్ అయ్యాయి. గజినీ నుంచి చాలా సూర్య సినిమాలు తెలుగులోనూ మంచి కలెక్షన్లను సాధించాయి. ‘24’ చిత్రం తమిళం కంటే తెలుగులోనూ ఎక్కువ ఆదరణ దక్కించుకుంది. కాగా, సూర్య హీరోగా నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో ఆగస్టు 4వ తేదీన రీ-రిలీజ్ అయింది. తెలుగు డబ్బింగ్ చిత్రమే అయినా.. రీ-రిలీజ్‍లోనూ ఊహలకు మించి ఆదరణ పొందుతోంది ఈ చిత్రం. తొలి రోజే సుమారు రూ.1.75కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.
తెలుగు రాష్ట్రాల్లో ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ రీ-రిలీజ్ అయిన థియేటర్లలో సూర్య అభిమానులు ఫుల్ హంగామా చేస్తున్నారు. పాటలకు డ్యాన్సులు చేస్తున్నారు. విజిళ్లతో మోత మోగిస్తున్నారు. థియేటర్లలోనే భారీగా సందడి చేస్తున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో, హీరో సూర్య స్పందించాడు. తెలుగు ప్రేక్షకుల అభిమానంపై ట్వీట్ చేశాడు. “ఇంత గొప్ప ప్రేమ నన్ను ఆశ్చర్యపరుస్తోంది. సూర్య సన్నాఫ్ కృష్ణన్ టీమ్‍కు థ్యాంక్స్. నేను ఆశ్చర్యపోతున్నా.. మీరు చాలా బెస్ట్ (తెలుగు ప్రేక్షకులు)” అని సూర్య ట్వీట్ చేశాడు.
సూర్య, సమీరా రెడ్డి హీరోహీరోయిన్లుగా నటించిన సూర్య సన్నాఫ్ కృష్ణన్ మూవీ 2008లో థియేటర్లలో రిలీజ్ అయింది. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో.. తండ్రీకొడుకుల్లా రెండు పాత్రల్లో నటించాడు సూర్య. ఈ చిత్రంలో తండ్రీకొడుకుల మధ్య అనుబంధం ఆకట్టుకుంటుంది. లవ్ స్టోరీని అద్భుతంగా చూపించాడు గౌతమ్ మీనన్. హారిస్ జయరాజ్ తన మ్యూజిక్‍తో ఈ చిత్రంలో మైమరిపించే మెలోడీలను ఇచ్చాడు. అప్పట్లో తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం బ్లాక్‍బాస్టర్ అయింది. ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత కూడా తెలుగు రాష్ట్రాల్లో అదే మ్యాజిక్ చేస్తోంది సూర్య సన్నాఫ్ కృష్ణన్. రీ-రిలీజ్‍లోనూ సత్తాచాటుతోంది.
సూర్య హీరోగా ప్రస్తుతం కంగువ చిత్రం రూపొందుతోంది. శివ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్‍లో భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవలే రిలీజైన గ్లింప్స్ అదిరిపోయింది. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కానుంది.