Suriya: 15ఏళ్ల తర్వాత స్ట్రైట్ తెలుగు సినిమా చేయనున్న తమిళ హీరో సూర్య.. డైరెక్టర్ ఎవరంటే..
Suriya: తమిళ హీరో సూర్య ఎట్టకేలకు ఓ స్ట్రైట్ తెలుగు చిత్రానికి ఓకే చెప్పారని తెలుస్తోంది. దీంతో సుమారు 15ఏళ్ల తర్వాత డైరెక్ట్ తెలుగు మూవీని ఆయన చేయనున్నారు. ఆ వివరాలు ఇవే..

తమిళ స్టార్ హీరో సూర్యకు తెలుగు రాష్ట్రాల్లోనూ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన హీరోగా నటించిన చాలా తమిళ చిత్రాలు.. తెలుగు డబ్బింగ్‍లో ఇక్కడ మంచి కలెక్షన్లు దక్కించుకున్నాయి. అంతలా తెలుగు ప్రేక్షకుల్లో సూర్యకు క్రేజ్ ఉంది. అయితే, సూర్య ఇప్పటి వరకు డైరెక్ట్ తెలుగు మూవీ ఒక్కటే చేశారు. రామ్‍గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన రక్తచరిత్ర-2 (2010)తో తెలుగులోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మళ్లీ డైరెక్ట్ తెలుగు చిత్రం చేయలేదు. ఆ నిరీక్షణకు ఇక తెరదించారు. ఇప్పుడు మళ్లీ ఓ స్ట్రైట్ తెలుగు చిత్రానికి సూర్య ఓకే చెప్పారని సమాచారం.
వెంకీ అట్లూరితో సినిమా
తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో సినిమా చేసేందుకు సూర్య అంగీకరించారని తెలుస్తోంది. లక్కీ భాస్కర్ సినిమాతో గతేడాది బ్లాక్‍బస్టర్ సాధించారు వెంకీ అట్లూరి. అంతకు ముందు కోలీవుడ్ స్టార్ ధనుష్‍తో సార్ మూవీ చేసి హిట్ కొట్టారు. ఇలా రెండు వరుస బ్లాక్‍బస్టర్స్ సాధించిన వెంకీతో సినిమాకు సూర్య సైన్ చేశారని తెలుస్తోంది. దీంతో 15ఏళ్ల తర్వాత స్ట్రైట్ తెలుగు చిత్రం చేయనున్నారు సూర్య.
షూటింగ్ ఈ ఏడాదిలోనే షురూ
సూర్య - వెంకీ అట్లూరి కాంబినేషన్‍లో రూపొందనున్న ఈ మూవీని సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై నాగవంశీ ప్రొడ్యూజ్ చేయనున్నారు. సూర్య హీరోగా నటించిన రెట్రో చిత్రం ఈ ఏడాది వేసవికి విడుదల కానుంది. వెట్రిమారన్ దర్శకత్వంలో వడివాసల్ చిత్రం చేయనున్నారు సూర్య. ఆర్జే బాలాజీతోనూ ఓ మూవీకి సైన్ చేశారు. అయితే, వెంకీతో సూర్య సినిమా షూటింగ్ ఈ ఏడాది మే నెలలోనూ మొదలవుతుందనే అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది రిలీజ్ చేసేలా ప్లాన్ ఉంటుందని తెలుస్తోంది.
దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన లక్కీ భాస్కర్ చిత్రాన్ని కూడా సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ ప్రొడ్యూజ్ చేసింది. ఈ మూవీ కమర్షియల్‍గా హిట్ అవడంతో పాటు భారీగా ప్రశంసలను అందుకుంది. వెంకీకి మరింత ఫేమ్ తీసుకొచ్చింది. ఈ క్రమంలో సూర్య కూడా అతడికి ఒకే చెప్పేశారు.
మరో తెలుగు చిత్రంపై చర్చలు!
సూర్య మరో తెలుగు చిత్రం చేసే ఆలోచనలోనూ ఉన్నారని రూమర్లు వస్తున్నాయి. తండేల్ మూవీతో రీసెంట్‍గా హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి.. సూర్యకు కథ కూడా చెప్పారని టాక్ ఉంది. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ ఈ మూవీని నిర్మించనున్నారు. మరి ఈ చర్చలు సఫలమై.. చందూతో మూవీకి కూడా సూర్య అంగీకరిస్తారేమో చూడాలి.
కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సూర్య హీరోగా నటించిన రెట్రో చిత్రం ఈ ఏడాది వేసవిలో విడుదల కానుంది. ఈ తమిళ చిత్రం తెలుగులోనూ విడుదల కానుంది. యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కింది.
సంబంధిత కథనం