Suriya Birthday: కంగువ మూవీ ఫస్ట్ సాంగ్ రిలీజ్‍కు టైమ్ ఫిక్స్ - అర్ధరాత్రి రానున్న సూర్య మరో సినిమా లుక్
Suriya Birthday Updates: తమిళ స్టార్ హీరో సూర్య పుట్టిన రోజున కంగువ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ రానుంది. టైమ్ తాజాగా ఖరారైంది. డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజుతో చేసే మూవీ నుంచి కొత్త లుక్ వచ్చేయనుంది.

తమిళ స్టార్ హీరో సూర్య రేపు (జూలై 23) తన 49వ పుట్టిన రోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన సినిమాల నుంచి అప్‍డేట్స్ రానున్నాయి. సూర్య హీరోగా నటిస్తున్న కంగువ చిత్రంపై అంచనాలు అత్యంత భారీగా ఉన్నాయి. ఈ ఫ్యాంటసీ యాక్షన్ చిత్రానికి శివ దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. సూర్య పుట్టిన రోజు సందర్భంగా రేపు ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేస్తోంది. రిలీజ్ టైమ్‍ను మూవీ టీమ్ నేడు ప్రకటించింది. కార్తీక్ సుబ్బరాజుతో సూర్య చేస్తున్న నయా మూవీ నుంచి లుక్ రిలీజ్ కానుంది. ఈ అప్‍డేట్స్ వివరాలు ఇవే.
కంగువ ‘ఫైర్ సాంగ్’ టైమ్ ఇదే
సూర్య బర్త్‌డే సందర్భంగా రేపు కంగువ చిత్రం నుంచి ఫైర్ సాంగ్ అంటూ తొలి పాటను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. అయితే, రిలీజ్ టైమ్‍ను తాజాగా ఖరారు చేశారు. కంగువ నుంచి ఫైర్ సాంగ్ రేపు (జూలై 23) ఉదయం 11 గంటలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (జూలై 22) వెల్లడించింది.
కంగువ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. భారీ ఆసక్తి ఉన్న ఈ మూవీ నుంచి రానున్న ఫస్ట్ సాంగ్ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ క్యూరియాసిటీతో ఉన్నారు. ఫైర్ సాంగ్ అనడంతో ఈ పాట పవర్‌ఫుల్‍గా ఉండే ఛాన్స్ ఉంది. ఈ సాంగ్ రేపు ఉదయం 11 గంటలకు వస్తుందనే అప్‍డేట్‍తో పాటు కొత్త పోస్టర్ కూడా మూవీ టీమ్ రివీల్ చేసింది. ఈ పోస్టర్లోనూ డిఫరెంట్ గెటప్‍తో సూర్య గర్జిస్తున్నట్టు ఉండగా.. చుట్టూ అగ్ని రగులుతోంది.
కంగువ చిత్రంలో సూర్యతో పాటు బాబీ డియోల్, దిశా పటానీ, నటరాజన్ సుబ్రమణియం, జగపతి బాబు, యోగిబాబు, రెడిన్ కింగ్‍స్లే కీలకపాత్రలు పోషించారు. దసరా సందర్భంగా అక్టోబర్ 10న తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. 2డీతో పాటు 3డీలోనూ రానుంది. గ్రీన్ స్టూడియోస్, యూవీ క్రియేషన్ బ్యానర్లు ఈ మూవీని నిర్మించాయి.
సూర్య44 నుంచి లుక్
సూర్య ప్రస్తుతం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో ఓ పీరియడ్ యాక్షన్ చిత్రం (సూర్య44) చేస్తున్నారు. సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ నుంచి కొత్త లుక్ రానుంది. ఈ అర్ధరాత్రి (జూలై 23) 12 గంటల 12 నిమిషాలకు ఈ లుక్ రిలీజ్ కానుంది.
ఈ మూవీలో సూర్య వింటేజ్ లుక్‍లో కనిపించనున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే ఫస్ట్ షాట్ అంటూ ఓ వీడియో వచ్చింది. గుబురు మీసాలు, లాంగ్ హెయిర్‌తో సూర్య లుక్ డిఫరెంట్‍గా కనిపించింది. ఈ అర్ధరాత్రి వచ్చే పోస్టర్లో సూర్య లుక్ ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్ ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు.
సూర్య44 చిత్రంలో పుజా హెగ్డే హీరోయిన్‍గా నటిస్తున్నారు. జయరాం, కరుణాకరణ్, జిజూ జార్జ్ కీరోల్స్ చేస్తున్నారు. సంతోష్ నారాయణ్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెకర్‌గా ఉన్నారు.
టాపిక్