Suriya 44 Title Teaser: సూర్య నయా సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్.. ఆసక్తికరంగా టీజర్.. నేచురల్ లుక్‍లో పూజా హెగ్డే
Suriya 44 Title Teaser: సూర్య కొత్త సినిమాకు ట్రైలర్ ఫిక్స్ అయింది. ఈ యాక్షన్ లవ్ డ్రామా మూవీకి కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టైటిల్ టీజర్ నేడు రిలీజ్ అయింది.
తమిళ స్టార్ హీరో సూర్యకు ‘కంగువ’ మూవీతో ఈ ఏడాది నిరుత్సాహం ఎదురైంది. ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ భారీ బడ్జెట్ మూవీ డిజాస్టర్ అయింది. ఈ ఏడాది నవంబర్‌లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. తదుపరి స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్‍తో మూవీ చేస్తున్నారు సూర్య. పీరియాడిక్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సూర్య 44వ సినిమా అయిన దీనికి టైటిల్ నేడు ఖరారైంది. క్రిస్మస్ సందర్భంగా నేడు (డిసెంబర్ 25) టైటిల్ టీజర్ వచ్చేసింది.
టైటిల్ ఇదే
సూర్య హీరోగా నటించిన ఈ సినిమాకు ‘రెట్రో’ అనే టైటిల్ ఖరారైంది. 1980ల బ్యాక్‍డ్రాప్‍లో గ్యాంగ్‍స్టర్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రూపొందిస్తున్నారు. పీరియడ్ మూవీకి సూటయ్యేలా ‘రెట్రో’ అనే ఇంట్రెస్టిగ్ టైటిల్‍ను మూవీ టీమ్ ఖరారు చేసింది.
టైటిల్ టీజర్ ఇలా..
గుడిలో మెట్లపై సూర్య, పూజా హెగ్డే కూర్చున్న షాట్‍తో రెట్రో టైటిల్ టీజర్ మొదలవుతుంది. "నా కోపం కంట్రోల్ చేస్తావా. మా నాన్నతో కలిసి పని చేయడం ఆపేస్తా” అని పూజాతో సూర్య అంటాడు. రౌడీయిజం, గూండాయిజం అన్నీ మానేస్తానని మాటిస్తాడు. ఆ తర్వాత టీజర్‌లో యాక్షన్ సీన్స్ ఉన్నాయి. సూర్య ఇంటెన్స్ లుక్‍లో కనిపించాడు. ప్రేమ కోసమే ఉన్నానని, పెళ్లి చేసుకుందామా అని పూజా హెగ్డేను సూర్య అడుగుతాడు. సరే అని పూజా తల ఊపుతుంది. స్వాగ్‍తో కూర్చొని సూర్య సిగరెట్ తాగే షాట్‍తో టీజర్ ముగిసింది. ఈ టీజర్‌లో జయరాం, ప్రకాశ్ రాజ్, నాజర్, జోజూ జార్జ్ సహా మరికొందరు కనిపించారు.
లవ్, యాక్షన్‍తో రెట్రో మూవీ టీజర్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. ప్రేమలో పడిన గ్యాంగ్‍స్టర్ కథలా కనిపిస్తోంది. ఇంటెన్స్ యాక్షన్.. లవ్ స్టోరీతో ఈ సినిమా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. టీజర్ ఆసక్తికరంగా సాగి సినిమాపై అంచనాలను పెంచేసింది. కార్తీక్ సుబ్బరాజ్ యాక్షన్ మార్క్, టేకింగ్ కనిపిస్తున్నాయి. సంతోష్ నారాయణన్ బ్యాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెప్పించేలా ఉంది.
రెట్రో టీజర్‌లో పూజా హెగ్డే లుక్ ఆకట్టుకుంది. పెద్దగా మేకప్ లేకుండా నేచురల్ లుక్‍లో బుట్టబొమ్మ కనిపించింది. ఈ చిత్రంలో పూజాది ఎక్కువ ప్రాధాన్యం ఉన్న పాత్ర అని అర్థమవుతోంది. పెద్ద మీసాలతో సూర్య లుక్ కూడా డిఫరెంట్‍గా ఉంది.
రిలీజ్ ఎప్పుడు..
రెట్రో సినిమాను 2025 వేసవిలో రిలీజ్ చేయనున్నట్టు టీజర్లో మేకర్స్ పేర్కొన్నారు. డేట్ ఇంకా ఖరారు చేయలేదు. ఈ మూవీపై అంచనాలు భారీ స్థాయిలోనే ఉన్నాయి. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ అయింది. 2డీ ఎంటర్‌టైన్‍మెంట్, స్టోన్ బీచ్ పతాకాలపై సూర్య, జ్యోతిక, కార్తికేయన్, కల్యాణ్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.