Lal Salaam Online Leak: రజనీకాంత్ లాల్ సలామ్.. తొలి రోజే మొత్తం సినిమా ఆన్‌లైన్‌లో..
Lal Salaam Online Leak: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా మొదటి రోజే ఆన్‌లైన్లో లీక్ కావడం ఆందోళనకు గురి చేస్తోంది.
Lal Salaam Online Leak: సూపర్ స్టార్ రజనీకాంత్ మూవీని కూడా పైరసీ భూతం వదల్లేదు. అతడు నటించిన లాల్ సలామ్ మూవీ మొత్తం తొలి రోజే ఆన్‌లైన్లో లీకైంది. ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రజనీకాంత్ అతిథిపాత్రలో కనిపించగా.. విష్ణు విశాల్, విక్రాంత్ లీడ్ రోల్స్ చేశారు. ఈ మూవీ శుక్రవారం (ఫిబ్రవరి 9) ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

లాల్ సలామ్ లీక్
ఐశ్వర్య రజనీకాంత్ ఐదేళ్ల తర్వాత తిరిగి మెగాఫోన్ పట్టుకోవడం, అది కూడా తన తండ్రి రజనీకాంత్ నే డైరెక్ట్ చేయడం, సూపర్ డూపర్ హిట్ జైలర్ తర్వాత సూపర్ స్టార్ నటిస్తున్న మూవీ కావడంతో లాల్ సలామ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తమిళనాడులో రజనీ ఫ్యాన్స్ హడావిడి మధ్య రిలీజైన ఈ సినిమా తొలి రోజే ఆన్‌లైన్లో లీక్ కావడంతో మేకర్స్ షాక్ తిన్నారు.
లాల్ సలామ్ ఒక్కటే కాదు.. శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చిన షాహిద్ కపూర్, కృతి సనన్ మూవీ తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా, నెట్‌ఫ్లిక్స్ లో రిలీజైన భూమి పడ్నేకర్ భక్షక్ మూవీస్ కూడా తొలి రోజే ఆన్‌లైన్లో లీకయ్యాయి. ఈ వారం ఎంతో ఆసక్తి రేపిన ఈ మూడు సినిమాలు ఇలా పైరసీ బారిన పడటం మొత్తం సినిమా ఇండస్ట్రీనే షాక్ కు గురి చేస్తోంది.
లాల్ సలామ్ షోలు రద్దు
మరోవైపు రజనీకాంత్ లాల్ సలామ్ మూవీ తెలుగులోనూ శుక్రవారం (ఫిబ్రవరి 9) రిలీజ్ కాగా.. ప్రేక్షకుల నుంచి అంతగా స్పందన లేకపోవడంతో మార్నింగ్ షోలు రద్దయినట్లు వార్తలు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల ఉదయం నడవాల్సిన షోలను రద్దు చేశారు. కొన్ని చోట్ల అప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బులు వాపస్ చేశారు.
అయితే లాల్ సలామ్ షోలు రద్దు కావడానికి ప్రేక్షకుల నుంచి స్పందన లేకపోవడం కారణం కాదని, లోడింగ్ ఆలస్యం కావడం వల్లే ఇలా జరిగిందని తెలుగులో సినిమా రిలీజ్ హక్కులు తీసుకున్న టీమ్ చెబుతోంది. దీనికి సంబంధించిన ఓ ఆడియో కూడా వైరల్ అయినా.. అది ఎంత వరకూ నిజం అన్నది తెలియలేదు.
లాల్ సలామ్ సినిమాకు తొలి రోజు మిశ్రమ స్పందన వచ్చింది. ఈ మూవీలో మొయిద్దీన్ భాయ్ అనే గ్యాంగ్‌స్టర్ పాత్రలో రజనీకాంత్ నటించాడు. క్రికెట్ ద్వారా మత ఘర్షణలకు ఎలా చెక్ పెట్టాడన్నది ఈ మూవీ కథాంశంగా కనిపిస్తోంది. లాల్ సలామ్ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించాడు.
ఈ సినిమాలో టీమిండియా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్ కూడా కొన్ని సీన్లలో కనిపించాడు. లాల్ సలామ్ సినిమాలో రజనీకాంత్ 20 నిమిషాలు మాత్రమే కనిపిస్తారని నెటిజన్స్ చెబుతున్నారు. అయితే, ఆయన ముస్లిం గెటప్‌లో మాత్రం లుక్ అదిరిపోయిందని, అలాగే రజనీకాంత్ యాక్టింగ్ నెక్ట్స్ లెవెల్ ఉందని అంటున్నారు. తమిళ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ స్టైల్‌ను ఐశ్వర్య రజనీకాంత్ అనుసరించిందని పలువురు చెబుతున్నారు. విష్ణు విశాల్, విక్రాంత్ నటన కూడా సినిమాకు చాలా ప్లస్ అయిందని అంటున్నారు.
టాపిక్