Sunflower 2 Web Series: ఒక హత్య.. రెండు సీజన్లు.. క్లైమ్యాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్.. సన్‌ఫ్లవర్ వెబ్ సిరీస్-sunflower season 2 web series review this zee 5 ott murder mystery turned more interesting with the unexpected climax ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sunflower 2 Web Series: ఒక హత్య.. రెండు సీజన్లు.. క్లైమ్యాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్.. సన్‌ఫ్లవర్ వెబ్ సిరీస్

Sunflower 2 Web Series: ఒక హత్య.. రెండు సీజన్లు.. క్లైమ్యాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్.. సన్‌ఫ్లవర్ వెబ్ సిరీస్

Hari Prasad S HT Telugu
Mar 12, 2024 11:32 AM IST

Sunflower 2 Web Series: ఒక హత్య చుట్టూ తిరిగే సన్‌ఫ్లవర్ వెబ్ సిరీస్ రెండో సీజన్ లో కూడా అసలు హంతకుడు ఎవరో తేల్చలేకపోయింది. పైగా రెండో సీజన్ క్లైమ్యాక్స్ లో ఓ అదిరిపోయే ట్విస్ట్ తో ముగించి మూడో సీజన్ పై ఆసక్తి రేపింది.

ఒక హత్య.. రెండు సీజన్లు.. క్లైమ్యాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్.. సన్‌ఫ్లవర్ వెబ్ సిరీస్
ఒక హత్య.. రెండు సీజన్లు.. క్లైమ్యాక్స్‌లో అదిరిపోయే ట్విస్ట్.. సన్‌ఫ్లవర్ వెబ్ సిరీస్

Sunflower 2 Web Series: సన్‌ఫ్లవర్ అనే ఓ అపార్ట్‌మెంట్లో జరిగే ఓ హత్య చుట్టూ తిరిగే వెబ్ సిరీసే సన్‌ఫ్లవర్. జీ5 ఓటీటీలో ఉన్న ఈ సిరీస్ రెండో సీజన్ మార్చి 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ క్రైమ్‌కు కామెడీని జోడించి తెరకెక్కించిన ఈ సిరీస్ తొలి సీజన్ కాస్త ఆసక్తికరంగానే అనిపించినా.. రెండో సీజన్ మాత్రం కావాలని సాగదీసినట్లుగా అనిపిస్తుంది.

సన్‌ఫ్లవర్.. హంతకుడు ఎవరు?

సన్‌ఫ్లవర్ వెబ్ సిరీస్ తొలి సీజన్ జూన్, 2021లో వచ్చింది. తొలి సీజన్ తొలి ఎపిసోడ్లోనే సన్‌ఫ్లవర్ అనే అపార్ట్‌మెంట్లో ఓ హత్య జరిగినట్లుగా చూపించారు. ఆ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే ఇన్వెస్టిగేషన్ చుట్టూ ఈ సిరీస్ సాగుతుంది. హత్యకు గురైన వ్యక్తి నివసించే ఫ్లాట్ కు ఎదురుగా ఉండే ఓ లెక్చరర్ తోపాటు అదే అపార్ట్‌మెంట్లో మరో ఫ్లోర్ లో ఉండే సోనూ సింగ్ (సునీల్ గ్రోవర్) ఈ హత్య కేసులో ప్రధాన అనుమానితులుగా ఉంటారు.

తొలి సీజన్ మొత్తం వీళ్ల చుట్టే తిరుగుతుంది. ముఖ్యంగా ఆ హంతకుడు ఆ లెక్చరరే అన్న ఫీలింగ్ చూసే ప్రేక్షకులకు కూడా కలుగుతుంది. అందరితో మంచిగా ఉంటున్నా.. సోనూ సింగ్ చేసే కొన్ని పనుల వల్ల పోలీసులు, అపార్ట్‌మెంట్ లో ఉండే ఇతరులకు మాత్రం అతడే ఈ హత్య చేశాడా అన్న సందేహంతో చూస్తూ ఉంటారు. ఈ క్రమంలో తన అపార్ట్‌మెంట్లోనే పంజాబ్ నుంచి పారిపోయి వచ్చిన ఓ అమ్మాయికి సాయం చేయబోయి చివరికి తనే కిడ్నాప్ కు గురవుతాడు సోనూ సింగ్. అక్కడితే తొలి సీజన్ ముగుస్తుంది.

రెండో సీజన్ గందరగోళం.. క్లైమ్యాక్స్ మాత్రం..

ఇక రెండో సీజన్ అక్కడి నుంచే మళ్లీ మొదలు పెట్టారు. ఈ సీజన్లో కొత్తగా రోజీ మెహతా (అదా శర్మ) అనే పాత్రను ప్రేవేశపెట్టారు. ఆ హత్యకు గురైన వ్యక్తి.. బార్ గర్ల్ గా ఉన్న రోజీ పేరిట విల్లు రాసి పెట్టడంతో ఆమె అతని ఫ్లాట్ లోకి వచ్చి ఉంటుంది. ఈ క్రమంలో సోనూ సింగ్ తోపాటు పోలీసుల అనుమానితుల జాబితాలో రోజీ కూడా చేరుతుంది. ఆమె రాకతో పోలీసులకు ఈ మర్డర్ ఇన్వెస్టిగేషన్ మరింత చికాకుగా మారుతుంది.

అయితే ఓ సింపుల్ మర్డర్ మిస్టరీ స్టోరీని రెండు సీజన్లుగా సాగదీసిన విధానం మాత్రం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. సిరీస్ లో కొన్ని ట్విస్టులు ఇంట్రెస్టింగా అనిపించినా.. కామెడీ పేరుతో సీన్లను సాగదీయడం, ఎపిసోడ్లకు ఎపిసోడ్లు అనవసర సీన్లతో నింపేయడంతో రెండో సీజన్ కాస్త బోరింగానే సాగుతుంది. అయితే క్లైమ్యాక్స్ మాత్రం ఆసక్తికరంగా ముగించారు.

ఆ హత్య చేసిన వ్యక్తి ఎవరో దాదాపుగా పోలీసులు గుర్తిస్తారు. ఇక హంతకులను పట్టుకోవడానికి వెళ్లిన పోలీసులకు మరో ట్విస్ట్ ఎదురవుతుంది. ఆ ట్విస్ట్ తోనే సన్ ఫ్లవర్ మూడో సీజన్ కూడా రాబోతోందని మేకర్స్ స్పష్టం చేశారు. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? అది ఈ హత్య కేసును ఎలా మలుపు తిప్పింది అనేది తెలుసుకోవాలంటే సన్ ఫ్లవర్ వెబ్ సిరీస్ చూడాల్సిందే.

సునీల్ గ్రోవర్ మెరిసినా..

హిందీ టీవీ షోలు, సినిమాల్లో కమెడియన్ గా తన ప్రతిభ చాటుకున్న సునీల్ గ్రోవర్.. ఈ సన్ ఫ్లవర్ వెబ్ సిరీస్ లో సోనూ సింగ్ గా అద్భుతంగా నటించాడు. రెండు సీజన్లలోనూ సిరీస్ కు అతడే ప్రధాన బలం.

కానీ మర్డర్ మిస్టరీ జానర్ ఎంచుకున్న మేకర్స్.. ఆ కథ చెప్పే విధానంలోని ఉన్న లోపాల కారణంగా సునీల్ గ్రోవర్ నటన కూడా ఈ వెబ్ సిరీస్ రెండో సీజన్ ను నిలబెట్టలేకపోయింది. ఒకే హత్య చుట్టూ రెండు సీజన్లు, 16 ఎపిసోడ్లను సాగదీస్తున్న విధానం ప్రేక్షకులకు చికాకు తెప్పిస్తుంది.

Whats_app_banner