Michael Movie Review: మైఖేల్ మెప్పించాడా? సందీప్ కిషన్ హిట్ కొట్టాడా?-sundeep kishan starred michael movie review in telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Sundeep Kishan Starred Michael Movie Review In Telugu

Michael Movie Review: మైఖేల్ మెప్పించాడా? సందీప్ కిషన్ హిట్ కొట్టాడా?

మైఖేల్
మైఖేల్

Michael Movie Review: టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ నటించిన తాజా చిత్రం మైఖేల్. దివ్యాంశ కౌషిక్ హీరోయిన్‌గా చేసిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

Michael Movie Review: టాలీవుడ్ యంగ్ హీరోల్లో పర్ఫార్మెన్స్ విషయంలో సందీప్ కిషన్ శైలి ఎంతో ప్రత్యేకం. నటన పరంగా తనకంటూ ఓ మార్కును ఏర్పాటు చేసుకున్న ఈ యువ హీరోకు సరైన హిట్ పడే చాలా రోజులే అయింది. కెరీర్ ఆరంభంలో ప్రస్థానం, వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ లాంటి విజయాలను సొంతం చేసుకున్న ఇతడు.. ఓ మంచి మాస్ హిట్ కోసం చాలా రోజులుగా చూస్తున్నాడు. ప్రస్తుతం అతడు నటించిన మైఖేల్ చిత్రం మాస్ యాక్షన్ థ్రిల్లర్ జోన్‌లో తెరకెక్కింది. పాన్ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

ట్రెండింగ్ వార్తలు

నటీనటులు- సందీప్ కిషన్, దివ్యాంశ కౌషిక్, గౌతమ్ మీనన్, వరలక్ష్మీ శరత్ కుమార్, వరుణ్ సందేశ్, అనసూయ తదితరులు

నిర్మాతలు- భరత్ చౌదరి, పుస్కూర్ రామ్మోహన్ రావు

దర్శకత్వం- రంజిత్ జయకోడి

సంగీతం- శ్యామ్ సీఎస్

విడుదల తేదీ- 2023 ఫిబ్రవరి 3

కథ..

మైఖేల్(సందీప్ కిషన్) అనాథగా పెరుగుతాడు. తల్లిని మోసం చేసిన తండ్రిని చంపడమే లక్ష్యంగా ముంబయిలో అడుగుపెడతాడు. అప్పటికే అక్కడ పెద్ద డాన్‌గా ఎదిగిన గురునాథ్(గౌతమ్ మీనన్) అతడిని చేరదీస్తాడు. రెండు సార్లు గురు ప్రాణం కాపాడి అతడి అనుచరుడిగా మారతాడు. గురుకు మైఖేల్‌కు దగ్గర కావడం అతడి భార్య చారు(అనసూయ), కుమారుడు అమర్ నాథ్‌(వరుణ్ సందేశ్)కు నచ్చదు. ఇదిలా ఉండగా గురుపై దాడి చేసిన ఆరుగురును చంపేందుకు మైఖేల్‌ను రంగంలోకి దింపుతాడు. ఒక్కొక్కరిని చంపుకుంటూ చివరి వ్యక్తి కోసం మైఖేల్ దిల్లీకి చేరతాడు. అక్కడ తీర(దివ్యాంశ కౌషిక్) ప్రేమలో పడతాడు. మరి ఈ తీర ఎవరు? గురునాథ్‌ను చంపేందుకు ప్రయత్నించిన ఆరో వ్యక్తి ఎవరు? బాస్ అప్పగించిన పని మైఖేల్ పూర్తి చేశాడా? లాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉందంటే..

అనాథగా పెరిగిన ఓ కుర్రాడిని ఓ డాన్ కింద చేరి ఒకానొక దశలో అతడికే ఎదురు తిరిగి మధ్యలో ఓ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, చివర్లో ఓ ట్విస్ట్, ఫైట్. తెలుగు సినిమాల్లో ఇలాంటి తరహా కథలు కొత్తేమి కాదు. బాలు నుంచి పంజా వరకు చాలా సినిమాల్లో ఈ పోకడలు కనిపిస్తాయి. ఇదే కాన్సెప్టుకు తల్లి సెంటిమెంటుతో కేజీఎఫ్ రికార్డుల వర్షాన్ని కురిపించింది. మైఖేల్ కూడా కేజీఎఫ్ మాదిరిగానే అనిపిస్తుంది. చాలా చోట్ల కేజీఎఫ్‌ స్ఫూర్తి పొందిన సీన్లు కనిపిస్తాయి. ఆ సినిమాను దృష్టిలో పెట్టుకునే దర్శకుడు రంజిత్ మైఖేల్ కథను రాసుకున్నాడేమో అనిపిస్తుంది.

90ల నేపథ్యం, మాఫియా కథ, విజువల్స్, ఫైట్స్, ఎలివేషన్లు ఇలా మొత్తం కేజీఎఫ్ అనుకరణలు చాలానే కనిపిస్తాయి. ఇక ఎలివేషన్ల విషయానికొస్తే ఓ రేంజ్‌లో ఉన్నాయి. కొన్ని సార్లు మరీ శృతి మించాయని కూడా అనిపిస్తుంది. కథనంలో అవసరాన్ని బట్టి హీరో ఎలివేషన్ ఉంటే బాగా వర్కౌట్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రం మిస్ ఫైర్ అయిందనే చెప్పాలి. ప్రతి ప్రతి నిమిషాలకు ఓ సారి హీరో ఫైట్లు చేయడం, గన్ పట్టుకుని పేల్చడం లాంటి జిమ్మిక్కుల వల్ల ప్రేక్షకులకు విసుకు వస్తుంది. హీరోయిజాన్ని ఆడియెన్స్ ఫీలవ్వాలి కానీ.. బలవంతంగా చెప్పే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే మొదటికే మోసం వస్తుంది. మైఖేల్ విషయంలోనూ అదే జరిగింది. హీరో పాత్రను, సీన్లను స్టైలిష్‌గా ప్రెజెంట్ చేయాలనే దర్శకుడు చూశాడే తప్ప.. కథ, కథనంలో దృష్టిపెట్టలేదు.

గ్యాంగ్‌స్టర్ సినిమాల్లో దాదాపు ప్లాట్ ఒకేలా ఉంటుంది. కానీ కథ, కథనాల్లో వైవిధ్యం ఉంటే ఆ సినిమాలు ఎక్కడికో వెళ్తాయి. మైఖేల్ మాత్రం ఈ విషయంలో అంచనాలను అందుకోలేదనే చెప్పాలి. ఆరంభ సన్నివేశాలతో మైఖేల్ పాత్ర నుంచి ప్రేక్షకులు డిస్ కనెక్ట్ అయిపోతారు. సాగే కొద్ది ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. పోనీ విజయ్ సేతుపతి పాత్రతోనైనా ఆడియెన్స్ ఎగ్జయిట్ అవుతారా? అంటే అది లేదు. సేతుపతి కనిపించిన రెండు, మూడు సన్నివేశాలు ఫర్వాలేదనిపించినా.. అప్పటికే ఆలస్యమవుతుంది.

ఎవరెలా చేశారంటే..

మైఖేల్ పాత్ర కోసం సందీప్ కిషన్ పడిన కష్టం తెలుస్తుంది. చూసేందుకు చాలా స్టైలిష్‌గా ఉన్నాడు. తన లుక్‌పై బాగానే దృష్టిపెట్టాడు. నటన పరంగా కూడా ఫర్వాలేదనిపిస్తాడు. అయితే దీని వల్ల అతడికి పెద్దగా ఒరిగిందేమిలేదనే చెప్పాలి. హీరోయిన్ దివ్యాంశ కౌషిక్ పాత్ర నామమాత్రమే. అయితే ఈ ముద్దుగుమ్మ చాలా క్యూట్‌గా కనిపిచింది. విజయ్ సేతుపతి కనిపించిన కాసేపు తన స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇక డాన్‌గా కనిపించిన గౌతమ్ మీనన్ ఫర్వాలేదనిపించాడు. ఆయనతో మంచి ప్రతినాయకుడి పాత్ర చేయించవచ్చు. కానీ దర్శకుడు గౌతమ్‌ను పెద్దగా వాడుకోలేదనే అనిపిస్తుంది. వరలక్ష్మీ శరత్ కుమార్ చిన్నపాత్రలో కనిపించింది. అనసూయ పాత్ర సాధారణంగా ఉంటుంది.

సాంకేతిక వర్గం..

ఈ సినిమా నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. మంచి ఔట్ పుట్‌ కోసం మేకర్స్ బాగానే ఖర్చు పెట్టారు. బ్యాక్ గ్రౌండ్ సంగీతం పరంగా శ్యామ్ సీఎస్ అదరగొట్టాడు. హీరోయిజాన్ని ఎలివేట్ చేయడానికి బాగానే కష్టపడ్డాడు. కానీ ఆ బిల్డప్‌కు, సన్నివేశాల్లో ఉన్న కంటెంట్‌కు సంబంధం ఉండదు. ఫలితంగా పెద్దగా రుచించకపోవచ్చు. అతడి పాటలు బాగున్నాయి. కెమెరామెన్ కిరణ్ కౌషిక్ పనితనం కనిపిస్తుంది. విజువల్స్ ఉన్నతంగా ఉంది. ఇక దర్శకుడు రంజిత్ జయకోడి మాత్రం ఈ సినిమా పూర్తిగా విఫలమయ్యాడు. అతడి టేకింగ్ స్టైలిష్‌గా ఉంది తప్పా.. మిగిలిన ఏ విభాగాల్లోనూ మెప్పించలేకపోయాడు. కథలో బలం లేకపోవడం ఇందులో ప్రధాన లోపం. ఇంత పెద్ద తారాగణం ఉన్నప్పటికీ దర్శకుడు వారిని వినియోగించుకోలేదనే అనిపిస్తుంది.

చివరగా- మైఖేల్.. ఎలివేషన్ తప్పా.. ఎమోషన్ లేదు

రేటింగ్- 2.5/5.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.