Sundeep Kishan: సంక్రాంతి ఒప్పందాల గురించి మాకెవ‌రూ చెప్ప‌లేదు - ఈగ‌ల్‌తో పోటీపై సందీప్‌కిష‌న్ కామెంట్స్‌-sundeep kishan interesting comments on ooru peru bhairavakona boxoffice clash with ravi teja eagle ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sundeep Kishan: సంక్రాంతి ఒప్పందాల గురించి మాకెవ‌రూ చెప్ప‌లేదు - ఈగ‌ల్‌తో పోటీపై సందీప్‌కిష‌న్ కామెంట్స్‌

Sundeep Kishan: సంక్రాంతి ఒప్పందాల గురించి మాకెవ‌రూ చెప్ప‌లేదు - ఈగ‌ల్‌తో పోటీపై సందీప్‌కిష‌న్ కామెంట్స్‌

Nelki Naresh Kumar HT Telugu
Jan 19, 2024 08:43 AM IST

Sundeep Kishan: ర‌వితేజ ఈగ‌ల్‌కు పోటీగా ఊరి పేరు భైర‌వ‌కోన రిలీజ్ కానుండ‌టంపై సందీప్ కిష‌న్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈగ‌ల్ సోలో రిలీజ్ డేట్ ఒప్పందాల గురించి త‌మ‌ను ఎవ‌రూ కాంటాక్ట్ కాలేద‌ని చెప్పాడు.

సందీప్ కిష‌న్
సందీప్ కిష‌న్

Sundeep Kishan: సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న రిలీజ్ కావాల్సిన ర‌వితేజ ఈగ‌ల్ సినిమాల ఫిబ్ర‌వ‌రి 9కి వాయిదాప‌డింది. సంక్రాంతి బ‌రిలో గుంటూరు కారం, సైంధ‌వ్‌, నా సామిరంగ‌తో పాటు హ‌నుమాన్ ఉండ‌టంతో థియేట‌ర్ల స‌మ‌స్య రాకుండా పోటీని నివారించేందుకు ఈగ‌ల్‌ను వాయిదావేశారు. నిర్మాత‌తో ప్రొడ్యూస‌ర్ గిల్డ్‌, ఫిలింఛాంబ‌ర్ ప్ర‌తినిధులు స‌మావేశ‌మై ఈగ‌ల్‌కు సోలో రిలీజ్ డేట్ ఇస్తామ‌ని హామీ ఇచ్చి సంక్రాంతి రేసు నుంచి ర‌వితేజ సినిమాను త‌ప్పించారు.

సోలో కాదు పోటీ...

ఈగ‌ల్ సోలో డేట్ హామీ మాత్రం నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. ఫిబ్ర‌వ‌రి 9న ఈగ‌ల్‌తో పాటు సందీప్ కిష‌న్ ఊరు పేరు భైర‌వ‌కోన కూడా బాక్సాఫీస్ బ‌రిలో నిలిచింది. . ఈ రెండు సినిమాల‌తో పాటు ర‌జ‌నీకాంత్ లాల్‌స‌లాం కూడా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్‌లో...

ఈగ‌ల్‌తో పోటీపై ఊరు పేరు భైర‌వ‌కోన ట్రైల‌ర్ రిలీజ్ లాంఛ్ ఈవెంట్‌లో సందీప్ కిష‌న్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. సంక్రాంతికి జ‌రిగిన ఒప్పందాల గురించి త‌మ‌కు తెలియ‌ద‌ని, ఈ ఒప్పందాల విష‌య‌మై టాలీపెద్ద‌లెవ‌రూ త‌మ‌ను సంప్ర‌దించ‌లేద‌ని సందీప్ కిష‌న్ అన్నాడు. ఫిబ్ర‌వ‌రి 9న ఊరు పేరు భైర‌వకోన సినిమాను రిలీజ్ చేయాల‌ని ఎప్పుడో డిసైడ్ చేసుకున్నామ‌ని సందీప్ కిష‌న్ తెలిపాడు. తొలుత ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాల‌ని అనుకున్నామ‌ని సందీప్ కిష‌న్ చెప్పాడు.

అయితే సంక్రాంతి కి పోటీ ఎక్కువ‌గా ఉండ‌టంతో ఫిబ్ర‌వ‌రి 9న మా సినిమాను రిలీజ్ చేయాల‌ని నిర్ణ‌యించుకున్నామ‌ని తెలిపాడు. ఫిబ్ర‌వ‌రి 9న డీజే టిల్లు వ‌స్తుంద‌ని తెలిసింది...ఆ డేట్‌ను వారు వ‌స్తున్నారా లేదా, మ‌రో సినిమా రిలీజ్ అవుతుందా అన్న‌ది ఎంక్వైరీ చేసిన‌ త‌ర్వాతే మా సినిమా విడుద‌ల తేదీని ప్ర‌క‌టించామ‌ని సందీప్ కిష‌న్ పేర్కొన్నాడు. ఫిబ్ర‌వ‌రి 9 మాకు చాలా ఇంపార్టెంట్ డేట్ అని, ఆ రిలీజ్ డేట్‌ను మార్చే అవ‌కాశం కూడా త‌మ‌కు లేద‌ని సందీప్ కిష‌న్ అన్నాడు.

ఎవ‌రూ సంప్ర‌దించ‌లేదు...

ఫిబ్ర‌వ‌రి 9న మా ఊరిపేరు భైర‌వ‌కోన‌ సినిమా రిలీజ్ అవుతోన్న విష‌యం సంక్రాంతి సినిమాల నిర్మాత‌లు మ‌ర్చిపోయి ఉంటార‌ని నిర్మాత రాజేష్ దండా అన్నాడు. ఆ త‌ర్వాత కూడా ఎవ‌రూ మ‌మ్మ‌ల్ని కాంటాక్ట్ కాలేద‌ని నిర్మాత తెలిపాడు.

టైగ‌ర్ త‌ర్వాత‌...

ఊరి పేరు భైర‌వ‌కోన సినిమాకు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో వ‌ర్ష బొల్ల‌మ్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. గురువారం రిలీజైన ట్రైల‌ర్‌కు చ‌క్క‌టి స్పంద‌న ల‌భిస్తోంది. గరుడు పురాణంలో మాయమైన ఆ నాలుగు పేజీలే ఈ భైరవకోన' .'' భగవంతుడి ఆధీనంలో కూడా లేనిది క‌ర్మ సిద్ధాంతం.. లిఖించబడిందే జరుగుతుంది. రక్తపాతం జరగనీ''. ‘’చేతికి అంటిన ర‌క్తాన్ని క‌డిగినంత సులువు కాదు.. చేసిన పాపాన్ని క‌డ‌గ‌డం”అంటూ ట్రైల‌ర్‌లో వినిపిస్తోన్న డైలాగ్స్ ఆస‌క్తిని పంచుతోన్నాయి. టైగ‌ర్ త‌ర్వాత సందీప్‌కిష‌న్‌, వీఐ ఆనంద్ క‌లిసి చేస్తోన్న సినిమా ఇది. టైగ‌ర్‌తో పాటు ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా, డిస్కోరాజా, ఒక్క క్ష‌ణం లాంటి సినిమాల‌కు వీఐ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.