Aham Reboot Review: అహం రీబూట్ రివ్యూ - సింగిల్ క్యారెక్టర్‌తో వచ్చిన తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ ఎలా ఉందంటే?
Aham Reboot Review: సుమంత్ హీరోగా సైకలాజికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన అహం రీబూట్ మూవీ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. సింగిల్ క్యారెక్టర్‌తో తెరకెక్కిన ఈ మూవీ ఎలా ఉందంటే?
Aham Reboot Review: సుమంత్ (Sumanth) హీరోగా సింగిల్ క్యారెక్టర్‌తో తెరకెక్కిన అహం రీబూట్ మూవీ థియేటర్లను స్కిప్ చేస్తూ నేరుగా ఆహా ఓటీటీలో (Aha OTT) రిలీజైంది. ఈ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీకి ప్రశాంత్ సాగర్ అట్లూరి దర్శకత్వం వహించారు. ప్రయోగాత్మకంగా రూపొందిన అహం రీబూట్ ఓటీటీ ఆడియెన్స్‌ను మెప్పించిందా? లేదా? అంటే?
ఆర్జే నిలయ్ కథ...
నిలయ్ (సుమంత్) ఓ రేడియో జాకీ. ఫుట్‌బాల్ ప్లేయర్‌గా గొప్ప పేరుతెచ్చుకోవాలని కలలు కన్న అతడి జీవితాన్ని ఓ యాక్సిడెంట్ మార్చేస్తుంది. ఆటకు అతడిని దూరం చేస్తుంది. అదే యాక్సిడెంట్ లో నిలయ్ కారణంగా ఓ అమ్మాయి కూడా చనిపోతుంది. ఆ గిల్టీ ఫీలింగ్ కారణంగా ఆత్మహత్య ఆలోచనలతో నిలయ్ సతమతమవుతుంటాడు. ఆ బాధ నుంచి దూరం అయ్యేందుకు రేడియో జాకీ జాబ్‌లో జాయిన్ అవుతాడు నిలయ్.
ఓ రోజు అతడి రేడియో స్టేషన్‌కు ఓ అమ్మాయి కాల్ చేస్తుంది. తనను ఎవరో కిడ్నాప్ చేసి చీకటి రూమ్‌లో బంధించారని చెబుతుంది. తొలుత ఫ్రాంక్ కాల్ అని భావించిన నిలయ్ ఆమె మాటలను నమ్మడు. ఆ అమ్మాయితో జరుగుతోన్న కన్వర్జేషన్‌ను లైవ్‌లో పెట్టేస్తాడు. నిలయ్‌తో ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు విన్న పోలీసులు ఆమె నిజంగానే కిడ్నాప్ అయ్యిందని ఫిక్సవుతారు.
ఆ యువతి నుంచి వివరాలు సేకరించే బాధ్యతను నిలయ్‌కు అప్పగిస్తారు. రేడియో స్టేషన్ నుంచి లైవ్‌లో ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఆమెను ఎవరు కిడ్నాప్ చేశారు? ఎక్కడ ఉంచారనే సమాచారాన్ని నిలయ్ ఎలా సేకరించాడు? నిజంగానే ఆ అమ్మాయి కిడ్నాప్ అయ్యిందా?
ఆమెను నిలయ్ సహాయంలో పోలీసులు సేవ్ చేశారా? నిలయ్ కారణంగా యాక్సిడెంట్‌లో చనిపోయిన అవంతిక ఎవరు? అసలు ఆమెను నిలయ్ చంపేశాడా? డ్రగ్స్ కేసులో నిలయ్ ఎలా చిక్కుకున్నాడు? ఐదేళ్లుగా తాను పడుతోన్న గిల్టీ ఫీలింగ్‌కు నిలయ్ ఏ విధంగా దూరమయ్యాడు అన్నదే అహం రీబూట్(Aham Reboot Review) కథ.
సింగిల్ క్యారెక్టర్ మూవీ...
అహం రీబూట్ సింగిల్ క్యారెక్టర్‌తో తెరకెక్కిన ప్రయోగాత్మక సినిమా. ఈ మూవీ కథ మొత్తం ఒకే క్యారెక్టర్ తో ఒకే రూమ్‌లో ఓ రేడియో షో బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంది. సైకలాజికల్ రివేంజ్ థ్రిల్లర్‌గా దర్శకుడు ప్రశాంత్ సాగర్ అట్లూరి అహం రీబూట్ మూవీని రూపొందించాడు.
తన స్నేహితురాలి మరణం వెనుక ఉన్న నిజాలను ఓ యువతి కిడ్నాప్ డ్రామా ద్వారా ఎలా బయటపెట్టింది? తప్పు చేశానని పశ్చాత్తాపంతో రగిలిపోతున్న ఓ ఆర్జేకు ఆ హత్యకు ఉన్న సంబంధం ఏమిటి? ఆ అపరాధ భావం నుంచి బయటపడి ఆ ఆర్జే ఎలా కొత్త జీవితాన్ని మొదలుపెట్టాడన్నది కంప్లీట్‌గా సింగిల్ క్యారెక్టర్‌తోనే వైవిధ్యంగా ఈ సినిమాలో(Aham Reboot Review) చూపించాడు డైరెక్టర్
వాయిస్‌లు మాత్రమే....
ఈ సినిమాలో సుమంత్ తప్ప ఇతర పాత్రలు ఏవి స్క్రీన్‌పై కనిపించవు. వారి వాయిస్‌లు మాత్రమే వినిపిస్తున్నాయి. ఫోన్‌లో వారితో సుమంత్ మాట్లాడినట్లుగా చూపిస్తూ సినిమాను క్లైమాక్స్ వరకు ఉత్కంఠభరితంగా నడిపించారు దర్శకుడు. కథగా పరంగా చూసుకుంటే అహం రీబూట్(Aham Reboot Review) రెగ్యులర్ రివేంజ్ థ్రిల్లర్ మూవీ. సింగిల్ క్యారెక్టర్‌తో ఈ రొటీన్ స్టోరీని కొత్తగా చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించాడు.
ఆత్మహత్యకు ప్రయత్నించే సీన్‌తోనే...
డ్రగ్స్ కేసులో నిలయ్ చిక్కుకోవడం... సమస్యలకు భయపడి ఆత్మహత్యకు ప్రయత్నించే సీన్‌తోనే ఈ సినిమా ఇంట్రెస్టింగ్‌గా మొదలవుతుంది. నిలయ్ రేడియో షోకు అమ్మాయి కాల్ చేసి తాను కిడ్నాప్‌కు గురయ్యానని చెప్పే సీన్ నుంచి అసలు కథలోకి డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు.
కిడ్నాప్‌కు గురైన అమ్మాయి నుంచి క్లూస్ ద్వారా ఇన్ఫర్మేషన్‌ను నిలయ్ సేకరించి పోలీసులకు అందించడం, ఆమెను సేవ్ చేసేందుకు పోలీస్ ఆఫీసర్ చేసే ప్రయత్నాలను ఫోన్ కాల్స్ ద్వారా డైలాగ్స్ రూపంలో వినిపించడం వినూత్నంగా అనిపిస్తుంది. చివరలో నిలయ్ లైఫ్‌కు ఆ కిడ్నాప్‌కు లింక్ పెడుతూ వచ్చే ట్విస్ట్ బాగుంది. ఆ లింక్ ద్వారా ఓ మర్డర్ కేసుకు సంబంధించిన సీక్రెట్‌ను రివీల్ చేయడం థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది.
ప్లస్‌తో పాటు మైనస్...
ఒకే క్యారెక్టర్ అహం రీబూట్ సినిమాకు ప్లస్‌తో పాటు మైనస్ అయ్యింది. సినిమా మొత్తం సుమంత్ కనిపించడం, కేవలం డైలాగ్స్ ద్వారానే కథను చెప్పడం వల్ల సినిమా బోర్ కొట్టిన ఫీలింగ్‌ను కలిగిస్తుంది. సింగిల్ క్యారెక్టర్ మూవీ కావడంతో కేవలం గంటన్నర నిడివితో అహం రీబూట్‌ను రూపొందించారు.
కత్తి మీద సాము....
సింగిల్ క్యారెక్టర్ మూవీ చేయడం అన్నది కత్తిమీద సాము లాంటిది. అందులోనూ ఒకే చోట ఉంటూ అనేక ఎమోషన్స్ పండిస్తూ కథను రక్తి కట్టించడం అంటే అంత ఈజీ కాదు. ఈ ప్రయత్నంలో సుమంత్ చాలా వరకు సక్సెస్ అయ్యాడు. మనసులో అంతులేని బాధను మోసే ఓ మోడ్రన్ యువకుడిగా, ఓ అమ్మాయి ప్రాణాలను కాపాడేందుకు ఆరాటపడే ఆర్జేగా అతడి యాక్టింగ్ బాగుంది. డైలాగ్స్‌తోనే ఎమోషన్స్ పడించాడు. లుక్ పరంగా గత సినిమాలకు భిన్నంగా కనిపించాడు.
సుమంత్ ప్రయోగం...
తెలుగులో సింగిల్ క్యారెక్టర్స్ మూవీస్ పెద్దగా రాలేదు. అహం రీబూట్‌తో సుమంత్ ఈ ప్రయోగం చేశాడు. ఓపికగా చూస్తే మంచి అహం రీబూట్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను పంచుతుంది.