Sukumar Remuneration for Pushpa 2: రెమ్యునరేషన్‌ లేకుండానే పుష్ప 2 చేస్తున్న సుకుమార్‌!-sukumar not charging any remuneration for pushpa 2 says a report ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Sukumar Not Charging Any Remuneration For Pushpa 2 Says A Report

Sukumar Remuneration for Pushpa 2: రెమ్యునరేషన్‌ లేకుండానే పుష్ప 2 చేస్తున్న సుకుమార్‌!

HT Telugu Desk HT Telugu
Oct 05, 2022 12:07 PM IST

Sukumar Remuneration for Pushpa 2: రెమ్యునరేషన్‌ లేకుండానే సుకుమార్‌ పుష్ప 2 చేస్తున్నాడన్న వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. నిజానికి ఈ సినిమాకు అతడు తన రెమ్యునరేషన్‌ భారీగా పెంచినట్లు గతంలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

పుష్ప 2 పూజా కార్యక్రమాల సందర్భంగా సుకుమార్
పుష్ప 2 పూజా కార్యక్రమాల సందర్భంగా సుకుమార్

Sukumar Remuneration for Pushpa 2: ఒకే ఒక్క సినిమాతో పాన్‌ ఇండియాలో స్టార్ డైరెక్టర్‌గా మారిపోయాడు సుకుమార్‌. ఎంతో టాలెంటెడ్‌ డైరెక్టర్‌ అయినా అతడు తీసిన సినిమాలు టాలీవుడ్‌కే పరిమితమయ్యాయి. అయితే పుష్ప మూవీతో సంచలనం రేపాడు. ముఖ్యంగా హిందీ బెల్ట్‌లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనంతో హీరో అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ సుకుమార్‌ల రేంజ్‌ ఎక్కడికో వెళ్లిపోయింది.

రాజమౌళి, ప్రశాంత్ నీల్‌ తర్వాత సుకుమారే అనేంతలా పుష్ప మూవీతో పేరు సంపాదించాడు. ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర కూడా వందల కోట్లు వసూలు చేసింది. ఇదొక్క సినిమాతోనే రూ.15 కోట్ల రేంజ్‌ డైరెక్టర్‌ కాస్తా.. రూ.60 కోట్ల వరకూ వెళ్లిపోయాడని, పుష్ప 2 మూవీ కోసం అతడు ఇంత భారీ మొత్తం వసూలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అటు అల్లు అర్జున్ అయితే ఈ సీక్వెల్‌ కోసం రూ.125 కోట్లు తీసుకుంటాడనీ తేలింది.

కానీ తాజా రిపోర్ట్‌ ప్రకారం.. పుష్ప 2 సినిమా కోసం సుకుమార్‌ అసలు రెమ్యునరేషనే తీసుకోవడం లేదట. దీనికి బదులు తన కొత్త సంస్థ సుకుమార్‌ రైటింగ్స్‌ ఈ సినిమాకు కోప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోంది. దీంతో సినిమాకు రెమ్యునరేషన్‌ తీసుకోకుండా లాభాల్లో వాటాకు సుకుమార్‌ మొగ్గు చూపినట్లు సమాచారం. అయితే ఇదేమీ తక్కువ మొత్తం కాదు.

అలా చూసినా కనీసం రూ.70 కోట్ల వరకూ ఉండనుంది. పుష్ప సూపర్‌డూపర్‌ హిట్‌తో పుష్ప 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా కోసం దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. బాహుబలి 2, కేజీఎఫ్‌ 2 కోసం ఎంతలా ఎదురుచూశారో పుష్ప 2కు కూడా అదే రేంజ్‌ ఫాలోయింగ్‌ ఉంది. దీంతో ఈ సినిమా థియేట్రికల్‌ హక్కులకు భారీ మొత్తం రావడం ఖాయం.

ఇదే కాకుండా డిజిటల్‌, శాటిలైట్‌ హక్కులు కూడా భారీ మొత్తానికి అమ్ముడుపోనున్నాయి. ఆ లెక్కన పుష్పతో పోలిస్తే పుష్ప 2కి వచ్చే లాభాలు ఊహకందని విధంగా ఉండనున్నాయి. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా.. మరింత ఆలస్యమవుతోంది. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరిగి సుమారు రెండు నెలలు అయింది. అయితే దసరా తర్వాత షూటింగ్‌ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

IPL_Entry_Point