Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ రివ్యూ-sudheer babu krithi shetty aa ammayi gurinchi meeku cheppali movie review ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ రివ్యూ

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review: ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మూవీ రివ్యూ

Nelki Naresh Kumar HT Telugu
Sep 16, 2022 12:50 PM IST

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review: సుధీర్‌బాబు,కృతిశెట్టి జంట‌గా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా శుక్రవారం (సెప్టంబర్ 16) ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది.

<p>&nbsp;కృతిశెట్టి, సుధీర్‌బాబు,</p>
కృతిశెట్టి, సుధీర్‌బాబు, (twitter)

Aa Ammayi Gurinchi Meeku Cheppali Movie Review: టాలీవుడ్ యంగ్ హీరోల్లో కొత్త‌ద‌నానికి ప్రాధాన్య‌మిస్తూ సినిమాలు చేస్తుంటాడు సుధీర్‌బాబు (Sudheerbabu). ఘ‌న‌మైన సినీ నేప‌థ్య‌మున్నా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశాలతో కూడిన చిన్న సినిమాల్ని ఎంచుకుంటూ హీరోగా నిల‌దొక్కుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు. సుధీర్ బాబు హీరోగా న‌టించిన తాజా చిత్రం ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి. టాలీవుడ్‌లో సెన్సిబుల్ డైరెక్ట‌ర్‌గా పేరుతెచ్చుకున్న మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కృతిశెట్టి(krithi shetty) హీరోయిన్‌గా న‌టించింది. స‌మ్మోహ‌నం త‌ర్వాత సుధీర్‌బాబు, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి క‌ల‌యికలో రూపొందిన సినిమా ఇది. సినిమా బ్యాక్‌డ్రాప్‌లో రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా ఎలా ఉందంటే...

సినిమా డైరెక్టర్ కథ

నవీన్ (సుధీర్ బాబు) ఓ సక్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్‌. మాస్ సినిమాల‌తో వ‌రుస‌గా ఐదు హిట్స్ అందుకుంటాడు. ఆరో సినిమాను కొత్త హీరోయిన్‌తో లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో చేయాల‌ని అనుకుంటాడు. క‌థ కోసం వెతుకుతున్న స‌మ‌యంలో అత‌డికి ఓ రీల్ దొరుకుతుంది. అందులో ఉన్న‌ అమ్మాయి చూసి ఇంప్రెస్ అవుతాడు. ఆ వీడియోలో ఉన్న అమ్మాయి పేరు డాక్ట‌ర్ అలేఖ్య‌ (కృతిశెట్టి) అని తెలుసుకుంటాడు న‌వీన్‌. ఆమెను త‌న సినిమాలో హీరోయిన్‌గా తీసుకోవాల‌ని అనుకుంటాడు. కానీ అలేఖ్య‌తో పాటు ఆమె ఫ్యామిలీ మొత్తానికి సినీ పరిశ్రమ అంటే ఇష్టం ఉండ‌దు. సినిమా అనే మాట వింటే ఫైర్ అవుతారు.

న‌వీన్ సినిమాలో న‌టించ‌డానికి అలేఖ్య ఇష్ట‌ప‌డ‌దు. అంతేకాకుండా అత‌డి వ‌ద్ద ఉన్న వీడియోలో క‌నిపించింది తాను కాద‌నే నిజాన్ని చెబుతుంది. అందులో త‌న అక్క అఖిల (కృతిశెట్టి) న‌టించింద‌ని, ఆమె చ‌నిపోయింద‌నే నిజాన్నిన‌వీన్‌కు చెబుతుంది అలేఖ్య‌. అఖిల చ‌నిపోవ‌డానికి కార‌ణ‌మేమిటి? అలేఖ్య ఫ్యామిలీ సినిమాల‌కు ఎందుకు ద్వేషిస్తుంటారు? సినిమా న‌టిగా మారాల‌నే అక్క అఖిల క‌ల‌ను న‌వీన్ స‌హాయంతో అలేఖ్య ఎలా నెర‌వేర్చింది? అలేఖ్య‌తో ప్రేమ‌లో ప‌డిన న‌వీన్ ఆమెకు త‌న మ‌న‌సులో ఉన్న మాట చెప్పాడా లేదా అన్న‌దే ఈ చిత్ర క‌థ‌.

సినీ పరిశ్రమలోని కష్టనష్టాలు...

సినిమా బ్యాక్‌డ్రాప్‌లో తెలుగు తెర‌పై చాలా త‌క్కువ సినిమాలు రూపొందాయి. సినిమా ఇండ‌స్ట్రీ ప‌ట్ల ప్ర‌జ‌ల్లో ఉండే అపోహ‌లు, అపార్థాల‌కు ఓ జంట ప్రేమ‌క‌థ‌ను జోడించి ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ఈ క‌థ‌ను రాసుకున్నారు. ఇండ‌స్ట్రీలో స‌క్సెస్ కోసం క‌థ‌ల‌ను అమ్ముకునే ద‌ర్శ‌కులే త‌ప్పితే క‌థ‌ల‌ను న‌మ్ముకొని తీసేవారు త‌క్కువ‌గా క‌నిపిస్తుంటార‌ని పాయింట్‌తో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమాను తెర‌కెక్కించారు. తాను న‌మ్మిన క‌థ‌ను వెండితెర‌పై ఆవిష్కృతం చేయాల‌నే ప్ర‌య‌త్నంలో ఓ ద‌ర్శ‌కుడికి ఎదుర‌య్యే అవ‌రోధాల‌ను సున్నిత‌మైన భావోద్వేగాల‌తో హృద్యంగా చూపించారు..

అపోహలు...అపార్థాలతో...

సినిమా ఇండ‌స్ట్రీలోకి అమ్మాయిల‌ను పంపించ‌డానికి కొంద‌రు ఎందుకు వెనుకాడుతారు? ఇండ‌స్ట్రీ ప‌ట్ల బ‌య‌టి స‌మాజంలో ఉన్న నెగెటివిటీని అర్థ‌వంతంగా ఇందులో చూపించారు. అంతేకాకుండా ఇండ‌స్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ లాంటి స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని ధైర్యంగా చెప్పారు ద‌ర్శ‌కుడు. సినిమా ప‌రిశ్ర‌మ‌లోని మంచి చెడు రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ చూపించిన విధానం బాగుంది. సినిమానే ప్రాణంగా ప్రేమిస్తూ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టిన వారిలో కొంద‌రు ఆ క‌ల తీర‌క ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతుంటార‌ని, మ‌రికొంద‌రు మాత్రం ఎన్ని క‌ష్టాలు ఎదురైన ధైర్యంగా పోరాడుతూ విజ‌యాల్ని అందుకుంటార‌ని అర్థ‌వంతంగా చెప్పారు.

ట్విస్ట్ హైలైట్...

స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా న‌వీన్‌గా సుధీర్ బాబును పాటతో ప‌రిచ‌యం చేస్తూ డిఫ‌రెంట్‌గా సినిమా మొద‌ల‌వుతుంది. అలేఖ్య అడ్రెస్ క‌నుక్కోవ‌డానికి త‌న అసిస్టెంట్ బోస్‌తో క‌లిసి సుధీర్‌బాబు చేసే ప్ర‌య‌త్నాల‌తో ఫ‌స్ట్ హాఫ్ స‌ర‌దాగా సాగుతుంది. ఇంట్రావెల్‌కు ముందు వ‌చ్చే ట్విస్ట్ బాగుంది. ఆ మ‌లుపుతో సెకాండాఫ్‌లో ప‌ట్ల ప్రేక్ష‌కుల్లో ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. త‌న త‌ల్లిదండ్రుల‌కు తెలియ‌కుండా న‌వీన్ సినిమాను అలేఖ్య ఎలా పూర్తిచేసింది? త‌న సినిమాతో ఆమె త‌ల్లిదండ్రుల‌లో నవీన్ ఎలా మార్పు తీసుకొచ్చాడో సెకండాఫ్ లో చూపించారు.

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్...

ఎలాంటి అశ్లీల‌త‌కు తావు లేకుండా క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా సినిమాను తెర‌కెక్కించాడు ద‌ర్శ‌కుడు మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి. ఎమోష‌న్స్‌, కామెడీ, ల‌వ్ మూడింటిని చ‌క్క‌గా బ్యాలెన్స్ చేశారు. ఇండ‌స్ట్రీపై సెటైర్స్ వేస్తూనే అందులో మంచి వెతుక్కోవ‌చ్చ‌ని చూపించారు.

ఉప్పెన తర్వాత బెస్ట్...

యంగ్ డైరెక్ట‌ర్ న‌వీన్‌గా సుధీర్ బాబు హుషారుగా క‌నిపించాడు. చాలా ఓపెన్ అయ్యి న‌టించిన‌ట్లుగా అనిపించింది. ఉప్పెన త‌ర్వాత ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి లో త‌న న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్న‌ది కృతిశెట్టి. ఆమె క్యారెక్ట‌ర్ చుట్టూనే సాగే క‌థ ఇది. త‌న యాక్టింగ్ టాలెంట్‌తో డిఫ‌రెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్ట‌ర్‌లో ఒదిగిపోయింది. న‌టిగా ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా కృతిశెట్టికి మంచి పేరు తెచ్చిపెడుతుంది. బోస్ అనే అసిస్టెంట్ డైరెక్ట‌ర్‌గా వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు. శ్రీకాంత్ అయ్యంగార్‌తో పాటు హీరోయిన్ త‌ల్లి క్యారెక్ట‌ర్ చేసిన న‌టి యాక్టింగ్ బాగుంది. వివేక్ సాగ‌ర్ నేప‌థ్య సంగీతం, పాట‌లు సినిమాకు ప్రాణంపోశాయి.

ఫీల్ గుడ్ లవ్ స్టోరీ...

ఫీల్‌గుడ్ ల‌వ్ స్టోరీగా ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి చ‌క్క‌టి అనుభూతిని పంచుతుంది. ప‌ర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా చెప్ప‌వ‌చ్చు. కానీ మ‌ల్టీప్లెక్స్ ప్రేక్ష‌కుల అభిరుచుల‌కు సినిమా ద‌గ్గ‌ర‌గా ఉంది. బీ, సీ ఆడియోన్స్‌ను ఏ మేర‌కు ఆక‌ట్టుకుంద‌న్న‌ది వేచిచూడాల్సిందే.

రేటింగ్: 3/ 5

Whats_app_banner