kiccha sudeep | భాషా వివాదంపై స్పందించిన మోదీ...ప్రధాని వ్యాఖ్యలపై హర్షం వ్యక్తం చేసిన సుదీప్
బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గణ్, కన్నడ హీరో కిచ్చా సుదీప్ మధ్య మొదలైన భాషావివాదం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ వివాదంపై శుక్రవారం ప్రధాన మంత్రి మోదీ స్పందించారు. అన్ని ప్రాంతీయ భాషల్ని బీజేపీ ఆదరిస్తుందని మోదీ చేసిన కామెంట్స్ పై సుదీప్ హర్షం వ్యక్తం చేశారు.
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గణ్, కన్నడ నటుడు కిచ్చా సుదీప్ మధ్య మొదలైన భాషా వివాదం అన్ని ఇండస్ట్రీలలో హాట్ టాపిక్ గా మారింది. హిందీ జాతీయ భాష అంటూ అజయ్ దేవ్ గణ్ చేసిన ట్వీట్ పై సుదీప్ గట్టిగానే కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఈ వివాదంపై పలు భాషలకు చెందిన నటీనటులు, రాజకీయ నాయకులు సుదీప్ కు మద్దతుగా నిలిచారు.
ఈ భాష వివాదంపై జైపూర్ లో జరిగిన బీజేపీ పార్టీ సమావేశంలో శుక్రవారం ప్రధానమంత్రి మోదీ సైతం స్పందించారు. బీజేపీ అన్ని భాషలను గౌరవిస్తుందని, భిన్న సంస్కృతులను ఆదరిస్తుందని వ్యాఖ్యానించారు. మోదీ వ్యాఖ్యలను సుదీప్ స్వాగతించారు. అన్ని భాషలు సమానమేనని మోదీ చెప్పడం ఆనందదాయకమని అన్నాడు.
పొలిటీషియన్ గా కాకుండా దేశాన్ని నడిపించే నాయకుడిగా ప్రధాని నోటి వెంట ఈ మాట రావడం అభినందనీయమని అన్నాడు.
అజయ్ దేవ్ గణ్ తో తాను ఎలాంటి డిబేట్ పెట్టుకోవాలని అనుకోలేదని సుదీప్ చెప్పాడు. అతడి వ్యాఖ్యలపై నా అభిప్రాయాన్ని వ్యక్తం చేయాలని అనుకున్నానని పేర్కొన్నారు. వాయిస్ ను వినిపించే హక్కు తనకు ఉందని అందుకే అతడి వ్యాఖ్యలపై ఆ విధంగా స్పందించానని సుదీప్ చెప్పాడు. కాకతాళీయంగా తమ మధ్య ట్విట్టర్ సంభాషణ జరిగిందని అన్నారు. దీని వెనుకు ఎలాంటి దురుద్దేశాలు లేవని సుదీప్ చెప్పాడు.
సుదీప్ హీరోగా నటిస్తున్న విక్రాంత్ రోణ చిత్రం జూలై 28న విడుదలకానుంది. దక్షిణాదితో పాటు హిందీ భాషలోనూ విడుదలకానుంది.
సంబంధిత కథనం