Biggest Hit Movie: ఇండియాలో బిగ్గెస్ట్ హిట్ మూవీ ఇదే.. అన్ని రికార్డులు బ్రేక్ చేసిన హారర్ కామెడీ మూవీ
Biggest Hit Movie: ఓ హారర్ కామెడీ మూవీ ఇప్పుడు ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా నిలిచి చరిత్ర సృష్టించింది. పెద్దగా స్టార్లు లేకుండానే కేవలం కథనే నమ్ముకొని ఈ మూవీ సాధించిన ఈ రికార్డు నిజంగా ఎవరూ ఊహించనిదే.
Biggest Hit Movie: హారర్ కామెడీ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా నిలిచింది. మనం మాట్లాడుకుంటున్న ఆ సినిమా పేరు స్త్రీ 2. గత నెల 15న ఇండిపెండెన్స్ డే సందర్భంగా రిలీజైన ఈ సినిమా.. ఐదు వారాలు దాటినా వసూళ్లలో రికార్డులను తిరగరాస్తూనే ఉంది.
అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ మూవీ
స్త్రీ 2 ఇప్పుడు ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ మూవీ కావడం విశేషం. ఈ క్రమంలో ఆ సినిమా జవాన్, పఠాన్, యానిమల్ లాంటి మూవీస్ ని వెనక్కి నెట్టింది. ఇన్నాళ్లూ షారుక్ ఖాన్ నటించిన జవాన్ మూవీ పేరిట ఈ రికార్డు ఉండగా.. ఇప్పుడా రికార్డును హారర్ కామెడీ మూవీ స్త్రీ 2 బ్రేక్ చేసింది.
ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ విషయాన్ని కన్ఫమ్ చేశాడు. మంగళవారం (సెప్టెంబర్ 17) వరకు చూసుకుంటే స్త్రీ 2 కలెక్షన్లు ఇండియాలోనే రూ.586 కోట్లకు చేరాయి. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావ్ లాంటి వాళ్లు నటించిన ఈ సినిమాకు అసలు తిరుగే లేకుండా పోయింది.
అన్ని రికార్డులూ బ్రేక్
స్త్రీ 2 మూవీ హిందీ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డును సొంతం చేసుకుంది. రూ.100 కోట్లలోపు బడ్జెట్ తోనే తెరకెక్కిన ఈ చిన్న సినిమా.. పెద్ద పెద్ద హిందీ సినిమాలను వెనక్కి నెట్టడం విశేషం. షారుక్ ఖాన్ గతేడాది నటించిన జవాన్ మూవీ రూ.582 కోట్లతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన హిందీ సినిమాగా నిలిచింది.
ఇప్పుడా రికార్డును స్త్రీ 2 రూ.586 కోట్లతో బ్రేక్ చేసింది. గదర్ 2 (రూ.526 కోట్లు), పఠాన్ (రూ.524 కోట్లు), యానిమల్ (రూ.503 కోట్లు), దంగల్ (రూ.387) ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వీకెండ్స్ లోనే కాదు.. వీక్ డేస్ లోనూ ఐదో వారం కూడా స్త్రీ2 మూవీ వసూళ్ల వర్షం కురిపిస్తోంది.
నాలుగో వీకెండ్ అయిన శుక్రవారం రూ.3.6 కోట్లు, శనివారం రూ.5.55 కోట్లు, ఆదివారం రూ.6.85 కోట్లు, సోమవారం రూ.3.17 కోట్లు, మంగళవారం రూ.2.65 కోట్లు వసూలు చేసింది. అమర్ కౌశిక్ డైరెక్ట్ చేసిన స్త్రీ 2 మూవీ ప్రేక్షకులకు ఎంతగా కనెక్ట్ అయిందో ఈ వసూళ్లే నిరూపిస్తున్నాయి.
2018లో వచ్చిన స్త్రీ మూవీకి సీక్వెల్ గా వచ్చిన ఈ స్త్రీ 2లో అక్షయ్ కుమార్, వరుణ్ ధావన్ లాంటి వాళ్లు అతిథి పాత్రలు పోషించినా.. పూర్తి స్థాయిలో ఏ పెద్ద స్టార్ హీరో లేడు. అయినా హిందీ సినిమా చరిత్రలోనే ఈ రికార్డును సొంతం చేసుకోవడం మామూలు విషయం కాదు. ఇప్పుడీ మూవీ ఇండియాలోనేరూ.600 కోట్ల నెట్ కలెక్షన్ల మార్క్ అందుకునే దిశగా అడుగులు వేస్తోంది.