Star Review: కెవిన్, లాల్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మూవీ స్టార్ ఇటీవల థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమాకు ఎలాన్ దర్శకత్వం వహించాడు. ప్రీతీ ముకుందన్, అదితి పొన్నకర్ హీరోయిన్లుగా నటించారు. హీరోగా మారాలనే ఓ యువకుడి తపనను ఆవిష్కరిస్తూ తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల్ని మెప్పించిందా? లేదా? అంటే?
పాండియన్ (లాల్) ఓ ఫొటోగ్రాఫర్. కొడుకు కలై(కెవిన్)ని సినిమా యాక్టర్ చేయాలని కలలు కంటాడు. తండ్రి ఎంకరేజ్‌మెంట్‌తో చిన్నప్పటి నుంచి సినిమా పిచ్చితోనే పెరుగుతాడు కలై. ఇంటర్ బోర్డర్ మార్కులతో పాసైన కలై తల్లి పోరుపడలేక ఇంజినీరింగ్ చేరుతాడు. అక్కడే కలైకి మీరా (పీతీ ముకుందన్) పరిచయం అవుతుంది. ఆమె ప్రేమలో పడతాడు.
తల్లికి చెప్పకుండా తండ్రి ప్రోద్భలంతో యాక్టింగ్ కోర్సులో జాయిన్ కావడానికి ముంబై వెళతాడు కలై. యాక్టింగ్ స్కిల్స్ లేవని కలైకి సీటు ఇవ్వడానికి ట్రైనర్ (సంజయ్ స్వరూప్) నిరాకరిస్తాడు. యాక్టింగ్ కోర్సు పూర్తిచేసుకున్న తర్వాతే తిరిగి ఇంటికి వెళ్లాలని ఫిక్సవుతాడు కలై. ఎన్నో కష్టాలు పడి ట్రైనర్ మెప్పును పొంది కోర్సు కంప్లీట్ చేస్తాడు. హీరోగా అవకాశం వస్తుంది.
షూటింగ్ కోసం వెళుతోండగా కలైకి యాక్సిడెంట్ అవుతుంది. తృటిలో ప్రాణాలతో కలై బయటపడతాడు. కానీ ముఖానికి బాగా దెబ్బలు తగలడంతో అందవికారంగా మారిపోతాడు. తన ముఖాన్ని ఎవరికి చూపించలేక తనలో తానే కుమిలిపోతాడు. అతడి ముఖాన్ని చూసి బ్యాక్‌గ్రౌండ్ ఆర్టిస్ట్‌గా కూడా ఎవరూ సినిమాల్లో అవకాశాలు ఇవ్వరు.
అదే టైమ్‌లో ప్రియురాలు మీరా కూడా అతడికి దూరమవుతుంది. కలై జీవితాన్ని కష్టాలు చుట్టుముట్టిన తరుణంలోనే అతడి జీవితంలోకి సురభి (అదితి పొన్నకర్) వస్తుంది? సురభి ఎవరు? ఆమెను పెళ్లిచేసుకొని యాక్టింగ్‌పై ఇష్టాన్ని చంపుకొని ఇన్సూరెన్స్ కంపెనీలో ఉద్యోగిగా కొత్త జీవితాన్ని మొదలుపెట్టాలని కలై ఎందుకు అనుకున్నాడు? కలైని ప్రాణంగా ప్రేమించిన సురభి అతడికి ఎందుకు దూరమైంది? మళ్లీ యాక్టింగ్‌పై కలై మనసు ఎలా మళ్లింది? నటుడవ్వాలనే కలై కల నె రవేరిందా? లఏదా అన్నదే స్టార్ మూవీ కథ...
సినిమా ఇండస్ట్రీ ఓ రంగుల ప్రపంచం. సినీ రంగంలో నటులుగా, సాంకేతిక నిపుణులుగా నిలదొక్కుకోవడం వెనుక ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, కన్నీళ్లు దాగి ఉంటాయి. నటులవ్వాలనే కలతో ఎంతో మంది ఇండస్ట్రీలోకి వస్తారు. కానీ ఈ ప్రయత్నంలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. మిగిలిన వారు సినిమాలపై మక్కువతో అటు ఇండస్ట్రీని వదిలిపెట్టలేక.. అవకాశాలు రాక నలిగిపోతుంటారు.అలాంటి ఓ యువకుడి కథతోనే స్టార్ మూవీ తెరకెక్కింది
సినిమాలే ప్రపంచంగా బతికే ఓ యువకుడు తన కలను నెరవేర్చుకొనే క్రమంలో ఎలాంటి సంఘర్షణను ఎదుర్కొన్నాడు? విధి అతడి జీవితంతో ఎలా ఆడుకుంది? సినిమాలకు పనికిరావని ప్రపంచం మొత్తం తనను గేలి చేసిన చివరకు తన గమ్యాన్ని ఎలా చేరుకున్నాడు? అతడికి తండ్రి ఎలా అండగా నిలబడ్డాడు? అనే పాయింట్‌తో ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ఈ సినిమాను రూపొందించాడు. సినిమా కష్టాలకు తండ్రీకొడుకుల అనుబంధంతో పాటు లవ్, కామెడీ రొమాన్స్ లాంటి కమర్షియల్ హంగులతో కథను రాసుకున్నాడు.
జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైన తమ కలల కోసం పోరాడిన వారు ఎప్పటికైనా విజయాన్ని సాధిస్తారని దర్శకుడు స్టార్ మూవీ ద్వారా చెప్పాలని దర్శకుడు అనుకున్నాడు. అందుకే ఇంటర్వెల్ ఎపిసోడ్‌లో ఎవరైతే చాలా మొండిగా ఉంటారో వారికే విశ్వం దాసోహం అంటుంది అంటూ పాలో కొయెల్హో కొటేషన్‌ను చూపించారు.
ఫస్ట్ హాఫ్ కాలేజీ గొడవలు, లవ్‌స్టోరీతో హీరో లైఫ్‌ను సరదాగా ఈ సినిమాలో చూపించారు డైరెక్టర్. సెకండాఫ్ యాక్సిడెంట్ అతడి జీవితం తలక్రిందులు కావడం...యాక్టింగ్‌కు దూరమై హీరో పడే మనోవ్యథతో ఉద్వేగభరితంగా సాగుతుంది. సినిమాలో తండ్రీకొడుకుల బాండింగ్ దర్శకుడు మనసుల్ని కదిలించేలా చూపించారు. ఆ స్థాయిలో లవ్‌స్టోరీస్ రాసుకోలేకపోయాడు.
కలైతో మీరా లవ్‌స్టోరీని యూత్ ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్‌చేసలా రాసుకున్నారు. ఆ సీన్స్ మొత్తం రొటీన్‌గా అనిపిస్తాయి. కలై జీవితంలోకి సురభి రావడం, ఆమెతో పెళ్లి ఎపిసోడ్ నుంచి ఆశించిన స్థాయిలో భావోద్వేగాలు పండలేదనిపిస్తుంది. క్లైమాక్స్‌ను మాత్రం డైరెక్టర్ డిఫరెంట్‌గా ఎండ్‌చేశాడు. ఆ సీన్ మాత్రం మెప్పిస్తుంది. ముంబై యాక్టింగ్ ట్రైనింగ్ ఎపిసోడ్, కలై కష్టాలు సుధీర్ఘంగా సాగడంతో కొన్ని చోట్ల బోర్ అనిపిస్తుంది.
కలై పాత్రలో కెవిన్ తన యాక్టింగ్‌తో అదరగొట్టాడు. ఇంజినీరింగ్ చదివే అల్లరి కుర్రాడిగా, సినిమా కలకు దూరమై మనోవేదనకు గురయ్యే యువకుడిగా చక్కటి వేరియేషన్స్ చూపించాడు. ఎమోషనల్ సీన్స్‌లో కెవిన్ నటన మెప్పిస్తుంది. కెవిన్ తండ్రిగా లాల్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్లస్‌పాయింట్‌గా నిలిచాడు. కెవిన్, లాల్ బాండింగ్‌ను దర్శకుడు చాలా నాచురల్‌గా స్క్రీన్‌పై చూపించాడు. వారిద్దరు కనిపించే ప్రతి సీన్ మెప్పిస్తుంది.
హీరో తల్లిగా గీతా కైలాసం నటన బాగుంది. ఇంట్లో శవం ఉండగానే... కొడుకుకు సినిమా అవకాశం వచ్చిందని తెలియడంతో లోలోన సంతోషం ఉన్నా..పైకి దుఃఖాన్ని నటించే సీన్‌లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. హీరోయిన్లలో అదితి పొన్నకర్‌కు ఎక్కువ మార్కులు పడతాయి. సెకండాఫ్‌లోనే ఎంట్రీ ఇచ్చిన తన స్క్రీన్‌ప్రజెన్స్, యాక్టింగ్‌తో మెప్పించింది. ప్రీతీ ముకుందన్ పర్వాలేదనిపించింది.
యువన్ శంకర్ రాజా బీజీఎమ్ ఈసినిమా పెద్ద అస్సెట్‌గా నిలిచింది. మ్యూజిక్ కథలోని ఫీల్‌ను హైలైట్ చేయడానికి ఉపయోగపడింది.
స్టార్ సినిమాలో తెలుగు పాటను కాపీ చేశారు. మిస్టర్ నూకయ్య సినిమాలోని ఓ పాటను ఉపయోగించుకున్నారు. ఈ సినిమాను తమిళంలో టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు
స్టార్ కెవిన్...లాల్ యాక్టింగ్ కోసం ఈ సినిమా చూడొచ్చు. సినిమా రంగుల ప్రపంచం వలలో పడి నలిగిపోయే యువత జీవితాల్ని చక్కగా చూపించిన సినిమా ఇది.
టాపిక్