Star Maa Serials TRP Ratings: స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్.. బ్రహ్మముడే టాప్.. ఇదే చివరిసారంటూ కామెంట్స్
Star Maa Serials TRP Ratings: స్టార్ మా, జీ తెలుగు సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ రిలీజ్ అయ్యాయి. బ్రహ్మముడే టాప్ లో ఉన్నా.. ఇదే చివరి వారం కావచ్చని కొందరు కామెంట్స్ చేయడం విశేషం. ఈ సీరియల్ టైమ్ మారిపోయిన విషయం తెలిసిందే.
Star Maa Serials TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ 45వ వారానికి సంబంధించిన టీఆర్పీ రేటింగ్స్ వచ్చేశాయి. జీ తెలుగు కంటే స్టార్ మా సీరియల్స్ తమ హవా కొనసాగించాయి. బ్రహ్మముడి సీరియల్ మరోసారి బెస్ట్ టీఆర్పీ రేటింగ్ తో టాప్ లో నిలిచినా.. ఆ సీరియల్ టైమ్ మధ్యాహ్నానికి మారిపోవడంతో రానున్న వారాల్లో నంబర్ వన్ నుంచి పడిపోవచ్చని భావిస్తున్నారు.
బ్రహ్మముడి టాప్‌లోనే.. కానీ..
స్టార్ మాలో వచ్చే బ్రహ్మముడి సీరియల్ తాజా టీఆర్పీ రేటింగ్స్ లో టాప్ లో నిలిచింది. ఈసారి ఏకంగా 13.32 రేటింగ్ సాధించడం విశేషం. ఇన్నాళ్లూ రాత్రి 7.30 గంటలకు టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ కు ప్రేక్షకుల నుంచి తిరుగులేని ఆదరణ లభించింది. అయితే స్టార్ మాలోకి ఇల్లు ఇల్లాలు పిల్లలు అనే సరికొత్త సీరియల్ రావడంతో ఆ సమయాన్ని దానికి కేటాయించారు.
నవంబర్ 12 నుంచి బ్రహ్మముడి సీరియల్ మధ్యాహ్నం 1 గంటకు టెలికాస్ట్ అవుతోంది. దీంతో సహజంగానే ఈ సీరియల్ టీఆర్పీ రేటింగ్ పడిపోతుందని అభిమానులు భావిస్తున్నారు. ఈ తాజా టీఆర్పీ రేటింగ్స్ చూడగానే బ్రహ్మముడి టాప్ లో ఉండటం ఇదే చివరి వారం కావచ్చని కొందరు కామెంట్ చేయడం విశేషం. మరికొందరు సీరియల్ టైమ్ మార్చిన స్టార్ మాపై మండిపడుతూనే ఉన్నారు.
స్టార్ మా సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
ఇక 45వ వారానికి సంబంధించి రిలీజైన టీఆర్పీ రేటింగ్స్ లో స్టార్ మాకు చెందిన సీరియల్సే టాప్ 6లో ఉన్నాయి. బ్రహ్మముడి తర్వాత 12.4 టీఆర్పీ రేటింగ్ తో కార్తీకదీపం రెండో స్థానంలో ఉంది.
ఆ తర్వాత చిన్ని (10.88), ఇంటింటి రామాయణం (10.18), గుండెనిండా గుడిగంటలు (9.88), మగువ ఓ మగువ (9.32) సీరియల్స్ నిలిచాయి. చిన్ని సీరియల్ క్రమంగా దూసుకెళ్తుండగా.. గుండెనిండా గుడిగంటలుకు గట్టి పోటీ ఎదురవుతోంది. చాలా రోజులుగా మూడో స్థానంలో కొనసాగిన ఈ సీరియల్.. ఇప్పుడు ఐదో స్థానానికి పడిపోయింది.
జీ తెలుగు సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్
జీ తెలుగు సీరియల్స్ విషయానికి వస్తే.. ఆ ఛానెల్ కు చెందిన రెండు సీరియల్స్ పోటాపోటీగా ఒకే రేటింగ్ సాధించాయి. ఇందులో వచ్చే పడమటి సంధ్యారాగం, మేఘ సందేశం 7.09 రేటింగ్ తోనే ఉండటం విశేషం.
అయితే అర్బన్ రేటింగ్ విషయంలో మేఘ సందేశం కాస్త ముందుంది. ఇక నిండు నూరేళ్ల సావాసం 6.77 రేటింగ్ సాధించింది. జగద్ధాత్రి 6.5, త్రినయని 5.97, అమ్మాయిగారు 5.82 రేటింగ్స్ తో ఉన్నాయి.
ఈటీవీ, జెమిని టీవీ సీరియల్స్ రేటింగ్స్
ఈటీవీ సీరియల్స్ లో ఎప్పటిలాగే రంగులరాట్నం 3.5 రేటింగ్ తో టాప్ లో ఉంది. ఆ తర్వాత మనసంతా నువ్వే (3.33), బొమ్మరిల్లు (2.9), రావోయి చందమామ (2.66), శతమానంభవతి (2.15) సీరియల్స్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
జెమిని టీవీ సీరియల్స్ అట్టడుగున కొనసాగుతున్నాయి. ఈ ఛానెల్లో శ్రీమద్ రామాయణం సీరియల్ కు 1.39 రేటింగ్ వచ్చింది. ఆ తర్వాత 1.17 రేటింగ్ తో కొత్తగా రెక్కలొచ్చెనా, భైరవీ (1.01), సివంగి (0.98), నువ్వే కావాలి (0.95) నిలిచాయి.