Nuvvu Nenu Prema Serial: 777 ఎపిసోడ్ల తర్వాత ఈరోజుతో ముగిసిన స్టార్ మా సీరియల్.. చివరి ఎపిసోడ్ చూశారా?
Nuvvu Nenu Prema Serial: స్టార్ మా టాప్ సీరియల్స్ లో ఒకటైన నువ్వు నేను ప్రేమ ఇవాళ్టి (నవంబర్ 11)తో ముగిసింది. ఏకంగా 777 ఎపిసోడ్ల పాటు సాగిన ఈ మెగా సీరియల్ ఆ ఛానెల్లోని టాప్ సీరియల్స్ లో ఒకటిగా కొనసాగింది.
Nuvvu Nenu Prema Serial: నువ్వు నేను ప్రేమ సీరియల్ కు శుభం కార్డు పడింది. 2022లో మొదలైన ఈ సీరియల్ రెండున్నరేళ్లు, 777 ఎపిసోడ్ల పాటు సాగడం విశేషం. ఈ మెగా సీరియల్ త్వరలోనే ముగుస్తున్నట్లు కొన్ని రోజుల కిందటే స్టార్ మా వెల్లడించింది. క్లైమ్యాక్స్ ఎపిసోడ్ సోమవారం (నవంబర్ 11) స్టార్ మాలో టెలికాస్ట్ అయింది.
నువ్వు నేను ప్రేమ సీరియల్
నువ్వు నేను ప్రేమ సీరియల్ స్టార్ మాలోని టాప్ 10 సీరియల్స్ లో ఒకటిగా నిలిచింది. మంచి టీఆర్పీలతో ఈ సీరియల్ ను ప్రేక్షకుల ఆదరిస్తూ వచ్చారు. ఒక దశలో టీఆర్పీల్లో నంబర్ వన్ గానూ నిలిచిన ఘనత ఈ సీరియల్ సొంతం. మొత్తానికి ఇప్పుడు 777 ఎపిసోడ్ల తర్వాత సీరియల్ కు ముగింపు పలికారు. ప్రతి రోజూ మధ్యాహ్నం ఒంటి గంటకు స్టార్ మాలో ఈ సీరియల్ ప్రసారమయ్యేది.
టీఆర్‌పీ బాగానే ఉన్నా నువ్వు నేను ప్రేమ సీరియల్‌కు అర్ధాంతరంగా శుభం కార్డు వేయడం ఆసక్తికరంగా మారింది. నువ్వు నేను ప్రేమ సీరియల్‌ను చూసేది విక్రమాదిత్య, పద్మావతి కోసమని.. వారికోసమైనా మరికొన్నాళ్లు ఈ సీరియల్‌ను కొనసాగిస్తే బాగుంటుందని ఫ్యాన్స్ కామెంట్స్ డిమాండ్ చేశారు. విక్కీ, పద్దు జోడీని మిస్సవుతామంటూ చెబుతోన్నారు.
రెండున్నరేళ్ల కిందట మొదలై..
నువ్వు నేను ప్రేమ సీరియల్ 2022లో ప్రారంభమైంది. ఈ సీరియల్‌లో విక్రమాదిత్యగా స్వామినాథన్ అనంతరామన్ నటించగా.. పద్మావతి పాత్రను పవిత్రా బీ నాయక్ పోషిస్తోంది. మధుబాల విజయ్‌కుమార్, మనీష్ రెడ్డి, చిన్నా, నవ్య, వాహిని కీలక పాత్రలు పోషిస్తోన్నారు. మొదట్లో స్టార్ మాలో సాయంత్రం 7 గంటలకు ప్రసారమైన ఈ సీరియల్.. తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు మారింది.
విక్రమాదిత్య అలియాస్ విక్కీ డబ్బుకు మాత్రమే విలువనిచ్చే ఓ బిజినెస్‌మెన్. డబ్బు కంటే అనుబంధాలు, అప్యాయతలే ముఖ్యమని నమ్ముతుంటుంది మిడిల్ క్లాస్ అమ్మాయి పద్మావతి. అనుకోకుండా విక్కీ జీవితంలోకి భార్యగా వస్తుంది పద్మావతి.
భిన్న మనస్తత్వాలు కలిసిన ఈ జంట కాపురం ఎలా సాగింది? భర్త కోసం పద్మావతి ఎలాంటి త్యాగాలు చేసింది? విక్కీ నుంచి పద్మావతిని దూరం చేయాలని మురళీ కృష్ణ ఎలాంటి కుట్రలు పన్నాడు? పద్మావతి ప్రేమ, మంచితనాన్ని విక్కీ అర్థం చేసుకున్నాడా? లేదా? అనే కథాంశంతో నువ్వు నేను ప్రేమ సీరియల్ సాగింది.
కొత్త సీరియల్ ఇదే
నువ్వు నేను ప్రేమ సీరియల్ సోమవారం (నవంబర్ 11)తో ముగియడంతో ఈ సీరియల్ స్థానంలో మధ్యాహ్నం 1 గంటకు టాప్ రేటింగ్ సీరియల్ బ్రహ్మముడి రానుంది. మంగళవారం (నవంబర్ 12) నుంచి ఈ సీరియల్ రాత్రి 7.30 బదులు మధ్యాహ్నం ఒంటి గంటకు వస్తుంది. ఇక రాత్రి 7.30 గంటలకు ఇల్లు ఇల్లాలు పిల్లలు పేరుతో స్టార్ మా సరికొత్త సీరియల్ అనౌన్స్ చేసింది. ప్రభాకర్, ఆమని నటిస్తున్న సీరియల్ ఇది.