Star Maa Serial: భార్యాభర్తలుగా హీరోయన్ ఆమని, బుల్లితెర మెగాస్టార్- స్టార్ మాలో సరికొత్త సీరియల్- ప్రతి ఒక్క ఇంటి కథగా!
Star Maa Serial Illu Illalu Pillalu Telecast: స్టార్ మాలో సరికొత్త సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు ప్రారంభం కానుంది. ఈ ధారావాహికలో సీనియర్ హీరోయిన్ ఆమని, బుల్లితెర మెగాస్టార్‌గా పిలవపడే ప్రభాకర్ జంటగా భార్యాభర్తలుగా నటిస్తున్నారు. ఎన్నో అంచనాలతో వస్తున్న ఇల్లు ఇల్లాలు సీరియల్ లాంచ్ డేట్ చూస్తే..
Amani Prabhakar Serial Telecast: తెలుగువారు ఎంతో అభిమానించి, ఆశీర్వదిస్తున్న నెంబర్ వన్ ఛానల్ “స్టార్ మా” సీరియల్ కథల ఎంపికలో ఎప్పుడూ ఒక విలక్షణమైన పంథా అనుసరిస్తూ వస్తోంది. ఇదే "స్టార్ మా" విజయ సూత్రం కూడా అని మేకర్స్ చెబుతున్నారు.
అందమైన కుటుంబ కథ
అదే వరసలో ఈసారి విభిన్నమైన అనుబంధాల వెలుగునీడలతో వినూత్నమైన కథని అందిస్తోందని తమ నుంచి వస్తోన్న కొత్త సీరియల్ పేరును అనౌన్స్ చేశారు. ఆ సీరియల్ పేరు "ఇల్లు ఇల్లాలు పిల్లలు". ఒకరినొకరు అర్ధం చేసుకునే భార్యాభర్తలు, బంగారం లాంటి పిల్లలు ఉంటే ఆ ఇంట్లో ఆనందాలకు కొదవే ఉండదు. ఇలాంటి ఆప్యాయతలు అల్లుకున్న ఓ అందమైన కుటుంబం కథ ఇది అని స్టార్ మా తెలిపింది.
బద్ధ శత్రువులుగా మారి
ఈ సంతోషాల వెనుక వెల కట్టలేని ప్రేమ ఉంది. అంతే కాదు - మనసుని మెలిపెట్టే ద్వేషం కూడా ఉంది. ఇద్దర్ని కలిపిన ప్రేమ.. రెండు కుటుంబాల్ని దూరం చేస్తే.. ఎన్ని సంతోషాలున్నా ఏదో బాధ అందరినీ వెంటాడుతుంది. అసలు ఆ కుటుంబంలో ఏం జరిగింది? ఆ ప్రేమ, ద్వేషం తాలూకు కథ ఏమిటి? ఎదురు ఎదురుగా ఉన్న రెండు కుటుంబాలు బద్ధ శత్రువులుగా మారిపోయిన కథ ఏమిటో "స్టార్ మా" సరికొత్త సీరియల్ "ఇల్లు ఇల్లాలు పిల్లలు" చెప్పనుంది.
తెలిసిన పాత్రలుగా
ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కట్టిపడేసే స్టార్ మా కొత్త సీరియల్ ఇల్లు ఇల్లాలు పిల్లలు నవంబర్ 12 నుంచి రాత్రి 7.30 నిమిషాలకు ప్రారంభం కానుంది. ఇదే సమయంలో సోమవారం నుంతి శనివారం వరకు నాన్ స్టాప్‌గా ఈ సీరియల్‌ను ప్రసారం చేయనున్నారు. ఈ సీరియల్‌లోని పాత్రలు మనకెంతో పరిచయమైనట్టుగా మీ ముందుకు రానున్నాయి. నిస్సహాయంగా నిలిచిపోయిన అనుబంధాలు, మమకారాల్ని మసిచేసిన ఆనాటి ప్రేమ మంటల మధ్య సంఘర్షణే ఈ కథ అంటూ స్టార్ మా తెలిపింది.
భార్యాభర్తలుగా
తెలుగు టెలివిజన్ ఫిక్షన్, నాన్ ఫిక్షన్ విభాగాల్లో ఎన్నో విభిన్నమైన బాధ్యతల్ని విజయవంతంగా నిర్వహించిన సీనియర్ నటుడు, షో ప్రెజెంటర్, నిర్మాత, సంధానకర్త, బుల్లితెర మెగాస్టార్‌గా పిలవబడే ప్రభాకర్ ఈ సీరియల్‌లో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. అలాగే, ఎన్నో తెలుగు సినిమాల్లో విలక్షణమైన పాత్రల్లో కనిపించిన హీరోయిన్ ఆమని.. ప్రభాకర్ భార్యగా నటిస్తున్నారు.
ప్రేమ రగిల్చిన కక్ష
స్టార్ మాలో ప్రసారమైన ప్రోమోలు ఈ ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ గురించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించాయి. రెండు కుటుంబాల్లో ప్రేమ రగిల్చిన కక్షలు.. ప్రేమాభిమానాల్ని ఎలా సమాధి చేస్తాయో చూపించడమే కాదు.. ఆ జంట పోగొట్టుకున్న ప్రేమాభిమానాల్ని పొందడానికి ఎంత కష్టపడ్డారో చెబుతుంది.
కృష్ణ ముకుంద మురారి తర్వాత
"ఇల్లు ఇల్లాలు పిల్లలు" ఇది ప్రతి ఒక్క ఇంటి కథ. ఇది ప్రతి ఒక్కరి గుండెని తాకే కథ అంటూ వస్తోన్న ఈ సీరియల్ స్టార్ మా ప్రేక్షకులను బాగా అలరించనుందని దర్శకనిర్మాతలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, ఇదే స్టార్ మా ఛానెల్‌లో కృష్ణ ముకుంద మురారి సీరియల్‌లో ద్విపాత్రాభినయనం చేశారు ప్రభాకర్. ఆ సీరియల్ ముగిసిపోగానే ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్‌తో అలరించేందుకు ప్రభాకర్ సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.