SSMB29: రాజమౌళి సినిమాలో డ్యుయల్ రోల్‍లో మహేశ్ బాబు?
Mahesh Babu - SS Rajamouli: మహేశ్ బాబు - రాజమౌళి కాంబినేషన్‍లో రూపొందనున్న చిత్రం(SSBM 29)పై విపరీతమైన ఆసక్తి ఉంది. షూటింగ్ మొదలుకాక ముందే ఈ మూవీ గురించి రూమర్లు వస్తున్నాయి.
SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‍లో భారీ బడ్జెట్ సినిమా (SSMB29)రూపొందనుంది. గ్రాండ్ స్కేల్‍లో అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ సినిమాగా ఈ మూవీ తెరకెక్కనుంది. ఆర్ఆర్ఆర్ చిత్రంతో దర్శకుడు రాజమౌళి.. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యారు. హాలీవుడ్‍లోనూ క్రేజ్ సంపాదించారు. దీంతో మహేశ్‍తో చిత్రాన్ని గ్లోబల్ రేంజ్‍లో రూపొందించనున్నారు రాజమౌళి.
డ్యుయల్ రోల్!
ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరూ ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఈ చిత్రంలో మహేశ్ బాబు పాత్ర గురించి ఓ సమాచారం బయటికి వచ్చింది. ఈ సినిమాలో మహేశ్ బాబు డ్యుయల్ రోల్ చేయనున్నారని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.
రాజమౌళి చిత్రంలో మహేశ్ బాబు ద్విపాత్రాభినయం చేయనున్నారని ఇండస్ట్రీ సర్కిల్‍లో బజ్ నడుస్తోంది. దీంతో తమ అభిమాన హీరో రెండు పాత్రల్లో కనిపిస్తారని మహేశ్ ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అయితే, ఈ విషయంపై ఇంకా అధికారిక సమాచారం రావాల్సి ఉంది.
రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలి చిత్రంలో ప్రభాస్ డ్యుయల్ రోల్ చేశారు. తండ్రి, కొడుకు పాత్రలు పోషించారు. విక్రమార్కుడు చిత్రంలో రవితేజ కూడా రెండు పాత్రల్లో కనిపించారు. అయితే, ఇప్పుడు పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కించనున్న సినిమాలో మహేశ్ బాబును కూడా డ్యుయల్ రోల్‍లో జక్కన్న చూపించనున్నారనే టాక్ ఫిల్మ్ సర్కిల్‍లో వైరల్‍గా మారింది. అయితే, SSMB29 మూవీ వర్గాల నుంచి మాత్రం ఈ డ్యుయల్ రోల్‍పై ఇప్పటి వరకు సమాచారం వెల్లడి కాలేదు.
మహేశ్ బాబుకు ఇది 29వ చిత్రం కావడంతో ప్రస్తుతం ఈ మూవీని ఎస్ఎస్ఎంబీ 29 వర్కింగ్ టైటిల్‍తో పిలుస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు మార్చి చివరి వారంలో లేకపోతే ఏప్రిల్‍లో జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది.
మహేశ్ న్యూ లుక్
ఎస్ఎస్ఎంబీ29లో మహేశ్ బాబు కొత్త లుక్‍లో కనిపించనున్నారని సమాచారం. లుక్ టెస్టులు ఇంకా జరుగుతున్నాయని తెలుస్తోంది. దేశంలోనే టాప్ స్టైలిస్టులను ఈ చిత్రం కోసం రాజమౌళి తీసుకొచ్చారని సమాచారం.
ఈ మూవీ షూటింగ్ కోసం హైదరాబాద్‍లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్లను వేస్తున్నారు. హాలీవుడ్ టెక్నిషియన్లు కొందరు ఈ చిత్రానికి పని చేయనున్నారు. విదేశీ నటులు కూడా ఉంటారని టాక్. ఇండోనేషియా నటి చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్ ఈ చిత్రంలో కీలకపాత్ర పోషించనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి.
మరోవైపు, మహేశ్ బాబు ఇటీవల కొత్త లుక్‍తో కనిపిస్తున్నారు. ఈ మూవీ మొదలయ్యే గ్యాప్‍లో కొన్ని యాడ్ షూటింగ్‍ల్లోనూ పాల్గొంటున్నారు. ఇటీవల మౌంటెడ్ డ్యూ యాడ్ చేశారు సూపర్ స్టార్. ఆ యాడ్‍లో మహేశ్ లుక్‍కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
రాజమౌళితో సినిమా కోసం మహేశ్ చాలా కష్టపడుతున్నారు. జిమ్‍లో తీవ్రంగా వర్కౌట్స్ చేస్తున్నారు. ఫిజికల్ ట్రైనింగ్ కోసం కొన్నాళ్లు ఇటలీకి కూడా ఆయన వెళ్లివచ్చారు.
మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం ఈ ఏడాది జనవరి 12వ తేదీన రిలీజైంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అంచనాలకు తగ్గట్టు హిట్ కాలేకపోయింది. ప్రస్తుతం గుంటూరు కారం సినిమా నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అందుబాటులో ఉంది.