SSMB29 Shooting: రాజమౌళి - మహేశ్ బాబు మూవీ షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా?
SSMB29 Shooting: మహేశ్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ మూవీ షూటింగ్ ప్రారంభం గురించి అంచనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయి.
SSMB29 Shooting: ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ రేంజ్‍లో పాపులర్ అయ్యారు దర్శక ధీరుడు రాజమౌళి. ఆయన తెరకెక్కించిన ఆ సినిమా చాలా దేశాల్లో అదరగొట్టింది. గ్లోబల్ సినిమాగా పేరు తెచ్చుకుంది. రామ్‍చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన ఆ సినిమా బ్లాక్‍బాస్టర్ అయింది. ఆర్ఆర్ఆర్ సినిమా చూసిన కొందరు హాలీవుడ్ దిగ్గజ దర్శకులు, ప్రముఖులు కూడా రాజమౌళిని ప్రశంసించారు. ఆ రేంజ్‍లో గ్లోబల్ హిట్ తర్వాత తర్వాతి రాజమౌళి.. తదుపరి సినిమాను టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేయనున్నారు.
మహేశ్ బాబు హీరోగా హాలీవుడ్ రేంజ్‍లో అడ్వెంచర్ యాక్షన్ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించనున్నారు. మహేశ్ బాబుకు ఇది 29వ మూవీ కావడంతో ఎస్ఎస్ రాజమౌళి పేరు కూడా కలిసి వచ్చేలా ఈ ప్రాజెక్టును SSMB29గా ప్రస్తుతం పిలుస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వచ్చి సుమారు రెండేళ్లు అవుతుండగా.. మహేశ్ - రాజమౌళి మూవీ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందంటూ అందరూ ఎదురుచూస్తున్నారు.
మహేశ్ - రాజమౌళి కాంబినేషన్‍లో SSMB29 సినిమా షూటింగ్ ఈ ఏడాది ఉగాది సందర్భంగా మొదలవుతుందని తాజాగా సమాచారం బయటికి వచ్చింది. అంటే ఈ ఏడాది ఏప్రిల్ రెండో వారంలో ఈ మూవీ చిత్రీకరణ ప్రారంభం అవుతుందని బజ్ నడుస్తోంది. అయితే, ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 2026 మొదట్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
జర్మనీకి మహేశ్
మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమా జనవరి 12నే రిలీజ్ అయింది. మంచి వసూళ్లను రాట్టింది. కాగా.. SSMB29 కంటే ముందు ప్రస్తుతం జర్మనీకి వెళ్లారు మహేశ్ బాబు. ఫిజికల్ ట్రైనింగ్ కోసం ఆయన ఆ దేశానికి వెళ్లినట్టు తెలుస్తోంది. మరో మూడు రోజుల తర్వాత ఆయన తిరిగి స్వదేశానికి రానున్నారని సమాచారం.
SSMB29 చిత్రానికి స్క్రిప్ట్ పూర్తయిందని రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఇటీవల చెప్పారు. కథ రాయడం ముగిసిందని అప్‍డేట్ ఇచ్చారు. దీంతో ఈ మూవీ త్వరలో పట్టాలెక్కుతుందని తెలిసిపోయింది.
రాజమౌళి- మహేశ్ బాబు కాంబినేషన్‍లో ఈ చిత్రం అడ్వెంచర్ యాక్షన్ చిత్రంగా ఉండనుంది. ఇండియానా జోన్స్ స్ఫూర్తితో ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. భారతీయ మూలాలతో యాక్షన్ చిత్రంగా తెరకెక్కుతుందని టాక్. అలాగే, ఈ సినిమా నిర్మాణంలో ఓ హాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ కూడా భాగమవుతుందని రూమర్లు వస్తున్నాయి.
గుంటూరు కారం గురించి..
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ ఏడాది జనవరి 12వ తేదీన రిలీజ్ అయింది. ఈ మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చినా మంచి కలెక్షన్లను సాధించింది. పక్కా మాస్ కమర్షియల్ సినిమాగా అలరిస్తోంది. ఈ చిత్రంలో మహేశ్ బాబు ఫైట్స్, డ్యాన్స్, మాస్ లుక్ హైలైట్లుగా ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్ల కలెక్షన్లను దాటిందని మూవీ టీమ్ పేర్కొంది. గుంటూరు కారం సినిమాను హారికా హాసిని క్రియేషన్స్ నిర్మించగా.. థమన్ సంగీతం అందించారు. మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.