SSMB 29 Heroine: మహేష్ బాబు, రాజమౌళి సినిమాలో హీరోయిన్‌గా గ్లోబల్ సెన్సేషన్.. ఈ వార్తల్లో నిజమెంత?
SSMB 29 Heroine: మహేష్ బాబు, ఎస్ఎస్ రాజమౌళి క్రేజీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో ఫిమేల్ లీడ్ గా గ్లోబల్ సెన్సేషన్ ప్రియాంకా చోప్రా అంటూ వార్తలు వస్తున్నాయి. పాన్ ఇండియాలోనే కాదు పాన్ వరల్డ్ లెవెల్లో ఆసక్తి రేపుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఈ కొత్త అప్డేట్ అభిమానులను ఆకర్షిస్తోంది.
SSMB 29 Heroine: సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో సినిమా ఇంకా అధికారికంగా అనౌన్స్ కూడా కాలేదు. కానీ అప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాపై ఎక్కడ లేని ఆసక్తి నెలకొంది. మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా.. అభిమానులు ఎగబడి చూస్తున్నారు. తాజాగా ఈ సినిమాలో ఫిమేల్ లీడ్ కు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ వస్తోంది. మూవీలో ప్రియాంకా చోప్రాకు అవకాశం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.
మహేష్ సరసన గ్లోబల్ సెన్సేషన్
బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వెళ్లిన గ్లోబల్ సెన్సేషన్ ప్రియాంకా చోప్రా. అలాంటి నటిని ఈ ఎస్ఎస్ఎంబీ29లాంటి పాన్ వరల్డ్ మూవీ కోసం తీసుకుంటున్నారంటే నిజంగా ఆసక్తికర విషయమే. అయితే దీనిపై ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక సమాచారం లేదు. పింక్‌విల్లాలో వచ్చిన రిపోర్టు ప్రకారం.. రాజమౌళి, మహేష్ మూవీతోనే ప్రియాంకా చోప్రా మరోసారి ఇండియన్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతోందట.
ఎస్ఎస్ఎంబీ29 ఓ యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందన్నదానిపై ఇప్పటి వరకూ సమాచారం లేదు. "ఎస్ఎస్ రాజమౌళి తన మూవీలో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఫిమేల్ లీడ్ కోసం చూస్తున్నాడు. అందుకు ప్రియాంకా చోప్రా కంటే మెరుగైన వాళ్లు ఎవరుంటారు" అని సినిమా వర్గాలు వెల్లడించినట్లు ఆ రిపోర్టు తెలిపింది. ఆరు నెలలుగా ప్రియాంకా చోప్రాను డైరెక్టర్ రాజమౌళి పలుమార్లు కలిసినట్లు కూడా వెల్లడించింది.
రాజమౌళిలాంటి డైరెక్టర్, మహేష్ బాబులాంటి స్టార్ తో నటించడానికి ఆమె కూడా ఆసక్తిగా ఉన్నట్లు ఆ రిపోర్టు స్పష్టం చేసింది. ఈ సినిమాలో ప్రియాంక పాత్రకు చాలా ప్రాధాన్యత ఉన్నట్లు కూడా తెలిసింది. ప్రియాంకా చోప్రా చివరిసారి 2019లో ఫర్హాన్ అక్తర్ తో కలిసి ది స్కై ఈజ్ పింక్ అనే ఇండియన్ మూవీలో నటించింది. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే మాత్రం ఆరేళ్ల తర్వాత ఆమె మళ్లీ ఆమె ఇండియన్ ప్రాజెక్టులో పని చేయనుంది.
ఎస్ఎస్ఎంబీ 29 వచ్చేదెప్పుడు?
సాధారణంగానే రాజమౌళి ఒక్కో సినిమా కొన్నేళ్ల సమయం తీసుకుంటాడు. ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చి మరో మూడు నెలలైతే మూడేళ్లవుతుంది. ఇప్పటి వరకూ అతడు మరో సినిమా మొదలు పెట్టలేదు. మహేష్ బాబుతో తన నెక్ట్స్ మూవీ అని మాత్రం చెప్పాడు. ప్రీప్రొడక్షన్ పనులు జరుగుతున్నా.. ఇప్పటి వరకూ సెట్స్ పైకి వెళ్లలేదు. షూటింగే ఏళ్లకేళ్లు తీస్తాడనే పేరు రాజమౌళికి ఉంది.
ఆ లెక్కన వచ్చే ఏడాది షూటింగ్ మొదలైనా.. 2027లోగానీ ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా వచ్చే అవకాశం కనిపించడం లేదు. అందులోనూ ఈసారి గ్లోబల్ లెవెల్లో యాక్షన్ అడ్వెంచర్ మూవీ అని చెబుతుండటంతో షూటింగ్ కు మరింత ఎక్కువ సమయం పట్టొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ సినిమా కోసం మహేష్ బాబు సిద్ధమవుతున్నాడు. ఫిజికల్ గా తన లుక్ పూర్తిగా మార్చబోతున్నాడు. ఇప్పటికే గడ్డం లుక్ లో కనిపించి ఆశ్చర్యపరిచాడు.
టాపిక్