Srimanthudu Movie Controversy: శ్రీమంతుడు vs చచ్చేంత ప్రేమ.. వివాదంపై స్పందించిన మూవీ టీమ్
Srimanthudu Movie Controversy: మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు మూవీపై ఈ మధ్యే సుప్రీంకోర్టు విచారణ, రైటర్ శరత్ చంద్ర ఆరోపణల నేపథ్యంలో ఆ మూవీ టీమ్ అధికారిక ప్రకటన జారీ చేసింది.
Srimanthudu Movie Controversy: శ్రీమంతుడు మూవీ తన చచ్చేంత ప్రేమ నవలకు కాపీ అని రైటర్ శరత్ చంద్ర అలియాస్ ఆర్డీ విల్సన్ డైరెక్టర్ కొరటాల శివపై వేసిన కేసు.. ఈ మధ్యే దీనిపై సుప్రీంకోర్టులో జరిగిన విచారణ నేపథ్యంలో మూవీ టీమ్ స్పందించింది. కోర్టులో కేసు నడుస్తున్నందున ఎవరూ ఓ ముందస్తు అంచనాకు రాకూడదని ఆ టీమ్ కోరింది.

శ్రీమంతుడు vs చచ్చేంత ప్రేమ
2017లో శ్రీమంతుడు మూవీ రిలీజైంది. అదే ఏడాది ఈ మూవీ డైరెక్టర్ కొరటాల శివపై రైటర్ శరత్ చంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను 2012లో స్వాతి బుక్ లో రాసిన చచ్చేంత ప్రేమ కథను కాపీ కొట్టి ఈ మూవీ తీశారని, అందులోని పాత్రలు, వాతావరణం అన్నీ అచ్చుగుద్దినట్లు సినిమాగా తెరకెక్కించారని అతడు ఆరోపించాడు.
కొరటాల శివతోపాటు హీరో మహేష్ బాబు, నిర్మాతపైనా కేసు వేశాడు. అయితే గత మంగళవారం (జనవరి 30) సుప్రీంకోర్టులో దీనిపై విచారణ జరగగా.. మహేష్, నిర్మాతలపై కేసు కొట్టేసిన ధర్మాసనం.. కొరటాల శివపై మాత్రం విచారణ కొనసాగిస్తోంది. కోర్టు విచారణ నేపథ్యంలో ఈ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కొరటాల శివను అసలు ఇంకా ఎలా సినిమాలు తీయనిస్తున్నారని మరోసారి శరత్ చంద్ర విరుచుకుపడ్డాడు. ఈ నేపథ్యంలో శ్రీమంతుడు టీమ్ స్పందించింది.
శ్రీమంతుడు టీమ్ ఏమన్నదంటే..
శ్రీమంతుడు మూవీ క్రియేటివ్ చిత్తశుద్ధిపై తాము ఇస్తున్న అధికారిక ప్రకటన ఇదీ అని శ్రీమంతుడు టీమ్ చెప్పింది. అంతేకాదు కేసు కోర్టులో ఉన్నందున ఎవరూ ఓ ముందస్తు అంచనాకు రాకూడదని కోరింది.
"కొరటాల శివ మూవీ శ్రీమంతుడు.. చచ్చేంత ప్రేమ అనే నవలలాగే ఉందన్న ఆరోపణలపై స్పందించాలని అనుకున్నాం. ఈ రెండూ ప్రజల మధ్య ఉన్నాయి. రెండింటి మధ్య స్పష్టమైన తేడా ఉంది. అది ఆ బుక్, సినిమా చూసిన వారికి సులువుగా తెలుస్తుంది. ఇక ఈ విషయం ప్రస్తుతం కోర్టులో ఉంది. ఇప్పటి వరకూ ఎలాంటి తీర్పు రాలేదు.
అందువల్ల మీడియా, ఇతర వ్యక్తులు ఓ ముందస్తు అంచనాకు రాకూడదని కోరుతున్నాం. దీనిపై కోర్టు తీర్పు వచ్చే వరకూ వేచి చూడటం చాలా ముఖ్యం. శ్రీమంతుడు కాపీ కాదని మేము బలంగా నమ్ముతున్నాం. ఆ బుక్, సినిమాను అంచనా వేసే ఆసక్తి ఎవరికి ఉన్నా మేము వారిని స్వాగతిస్తాం. న్యాయ ప్రక్రియపై నమ్మకం ఉంచి సహనంతో వ్యవహరించాలని మేము కోరుతున్నాం" అని శ్రీమంతుడు టీమ్ ఆ ప్రకటనలో చెప్పింది.
2017లో రిలీజైన శ్రీమంతుడు మూవీ మహేష్ కెరీర్లో అతిపెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచింది. దీనిపై తాజాగా మరోసారి శరత్ చంద్ర స్పందిస్తూ.. తనకు కనీసం క్రెడిట్ ఇవ్వలేదని, తనకు డబ్బు అవసరం లేదని, కాకపోతే ఇంత కాపీ కొట్టిన కొరటాల, మహేష్ లతో ఇంకా సినిమాలు ఎలా తీస్తున్నారని ప్రశ్నించడం గమనార్హం.