నేచురల్ స్టార్ నాని, యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‍లో రానున్న ‘ది ప్యారడైజ్’ చిత్రంపై మొదటి నుంచి విపరీతమైన ఆసక్తి ఉంది. ఫస్ట్ లుక్ నుంచి ఈ చిత్రం అంచనాలను పెంచేసింది. దసరాతో బ్లాక్‍బస్టర్ కొట్టిన నాని - శ్రీకాంత్ కాంబో మరోసారి ఈ చిత్రంతో రిపీట్ అవుతోంది. ఇంతటి హైప్ నెలకొన్న ది ప్యారడైజ్ మూవీ నుంచి నేడు (మార్చి 3) గ్లింప్స్ వీడియో వచ్చేసింది. పవర్‌ఫుల్‍గా ఈ గ్లింప్స్ ఉంది.
ది ప్యారడైజ్ గ్లింప్స్ పవర్‌ఫుల్ డైలాగ్‍లు, ఇంటెన్స్ విజువల్స్, నాని డిఫరెంట్ గెటప్‍తో అదిరిపోయింది. కాకుల రిఫరెన్సుతో అణచివేతకు గురైన ఓ వర్గం గురించి, వారి కోసం పోరాడేందుకు వచ్చిన నాయకుడి గురించి చెబుతూ ఈ గ్లింప్స్ సాగింది. “చరిత్రలో అందరూ చిలకలు, పావురాల గురించి రాసిండ్రు కానీ.. అదే జాతిలో పుట్టిన కాకుల గురించి రాయలే” అంటూ ఫీమేల్ వాయిస్ ఓవర్‌తో ఈ గ్లింప్స్ మొదలైంది. "గిది కడుపు మండిన కాకుల కథ. జమానా.. జమానా కెల్లి నడిచే శవాల కథ” అంటూ డైలాగ్స్ సాగాయి. శవాలు కుప్పలుగా పడి ఉంటే.. కాకులు, గద్దలు విహరిస్తున్న విజువల్ భయానకంగా ఉంది. “అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ. ఒక ధగడ్ వచ్చి మొత్తం జాతిలో జోష్ తెచ్చిండు. థూ.. అనిపించుకున్న కాకులు తర్వార్లు పట్టినయ్. ఇది ఆ కాకులను ఒక్కటి చేసిన లం…డుకు కథ. నా కొడుకు నాయకుడు అయిన కథ” అంటూ పవర్ డైలాగ్‍లతో గ్లింప్స్ వీడియో ఉంది.
ది ప్యారడైజ్ చిత్రంలో నాని చాలా డిఫరెంట్ గెటప్‍లో కనిపించనున్నారు. ఈ గ్లింప్స్‌లో లుక్ రిలీవ్ అయింది. పొడవాటి రెండు జడలు, మెలికలు తిరిగిన కండలు, కోర మీసం, ముక్కెరలు ఇలా ఓ వైల్డ్ లుక్‍లో ఉన్నారు. లం…డుకు అని చేతిపై టాటూ కూడా ఉంది. అణచివేతకు గురై తిరుగుబాటు చేసిన ఓ దళానికి నాయకుడి పాత్రను నాని ఈ చిత్రంలో పోషిస్తున్నారు గ్లింప్స్ ద్వారా అర్థమైంది.
ది ప్యారడైజ్ చిత్రం భారీ స్కేల్‍లో రూపొందనుందని గ్లింప్స్ చూస్తే అర్థమవుతోంది. శ్రీకాంత్ ఓదెల ఓ ఇంటెన్స్ స్టోరీ చెప్పనున్నారని తెలుస్తోంది. టేకింగ్ కూడా వావ్ అనేలా ఉంది. అనిరుధ్ రవిచందర్ ఇచ్చిన బ్లాక్‍గ్రౌండ్ మ్యూజిక్ కూడా ది ప్యారజైడ్ గ్లింప్స్‌లో అదిరిపోయింది. ఇంటెన్సిటీని పెంచింది. సినిమాటోగ్రఫీ కూడా ఆకట్టుకునేలా ఉంది.
ది ప్యారడైజ్ గ్లింప్స్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, ఇంగ్లిష్, స్పానిష్‍లో వచ్చింది. థియేటర్లలో ఈ మూవీని 8 భాషల్లో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. స్పానిష్‍లోనూ నానినే డబ్బింగ్ చెప్పనున్నారని తెలుస్తోంది.
2026 మార్చి 26వ తేదీన ది ప్యారడైజ్ చిత్రం విడుదల కానుంది. వచ్చే ఏడాది శ్రీరామనవమి ముందు రోజున ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర (ఎస్ఎల్‍వీ) మూవీస్ నిర్మిస్తోంది.
సంబంధిత కథనం