టైటిల్: శ్రీ శ్రీ శ్రీ రాజావారు
నటీనటులు: నార్నే నితిన్, సంపద హులివాన, రావు రమేశ్, వీగే నరేష్, శుభలేఖ సుధాకర్, రఘు కుంచె, ప్రియ మాచిరాజు, రచ్చ రవి తదితరులు
సంగీతం: కైలాస్ మీనన్
నిర్మాత: రామారావు చింతపల్లి
దర్శకత్వం: సతీష్ వేగేశ్న
రిలీజ్ డేట్: జూన్ 6, 2025
టాలీవుడ్ హీరోల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నవాళ్లలో నార్నే నితిన్ ఒకరు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నార్నే నితిన్ మ్యాడ్, ఆయ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో వరుసగా హిట్స్ అందుకున్నాడు. అయితే, ఈ సినిమాల కంటే ముందుగా నార్నే నితిన్ నటించిన తొలి సినిమా శ్రీ శ్రీ శ్రీ రాజావారు.
శతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎట్టకేలకు ఇవాళ (జూన్ 6) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి శ్రీ శ్రీ శ్రీ రాజావారు రివ్యూలో తెలుసుకుందాం.
పుట్టగానే చలనం లేకుండా ఉన్న రాజా (నార్నే నితిన్) సిగరెట్ పొగతో ఊపిరి పోసుకుంటాడు. తనను కాపాడిన సిగరెట్‌కు రాజా పెద్దయ్యాకా బానిస అవుతాడు. విపరీతంగా సిగరెట్స్ తాగడవం వల్ల రాజాను శ్రీ శ్రీ శ్రీ రాజావారు అని వెటకారంగా పిలుస్తుంటారు. ఈ క్రమంలోనే రాజాకు చిన్నప్పటి నుంచి కృష్ణమూర్తి (రావు రమేశ్) కూతురు నిత్య (సంపద) అంటే ఇష్టం.
నిత్యకు కూడా రాజా అంటే ప్రేమ. పెద్దలు ఒప్పుకుంటే పెళ్లి చేసుకోవాలనుకుంటారు. ఇష్టం లేకపోయినా కుమార్తె ప్రేమ కాదనలేక చివరికి కృష్ణమూర్తి వారి పెళ్లికి ఒప్పుకుంటాడు. అయితే, ఎంగేజ్‌మెంట్ రోజున రాజా చేసిన తప్పుతో పెద్ద గొడవ జరిగి పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. ఈ క్రమంలోనే రాజా తండ్రి సుబ్బరాజు (వీకే నరేష్) కృష్ణమూర్తికి ఓ సవాల్ విసురుతాడు.
కృష్ణమూర్తికి సుబ్బరాజు విసిరిన సవాల్ ఏంటీ? దానివల్ల రాజాకు ఎదురైన ఇబ్బందులు ఏంటీ? తండ్రి ఛాలెంజ్, తన ప్రేమను గెలిపించుకునేందుకు రాజా ఏం చేశాడు? రాజా ఛాలెంజ్ ఓడిపోయేలా కృష్ణమూర్తి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? అసలు కృష్ణమూర్తి, సుబ్బరాజుకు మధ్య ఉన్న సంబంధం ఏంటీ? రాజా తన ప్రేమను గెలిచాడా? అనేది తెలియాలంటే శ్రీ శ్రీ శ్రీ రాజావారు మూవీ చూడాల్సిందే.
శ్రీ శ్రీ శ్రీ రాజావారు మూవీ నిజానికి మలయాళ సినిమా తీవండి (చైన్ స్మోకర్ అని అర్థం)కు అడాప్షన్ లాంటిది. 2018లో వచ్చిన ఈ సినిమాను తెలుగులో శ్రీ శ్రీ శ్రీ రాజావారు పేరుతో రీమేక్ చేశారు. అయితే, సినిమా కథ సింపుల్‌గా కొత్తగా ఉండి ఇంట్రెస్ట్ కలిగేలా చేస్తుంది.
ఏ సిగరెట్ పొగతో అయితే పుట్టినప్పుడు బతికాడో అదే సిగరెట్‌కు బానిస కావడం, అది తను ప్రేమించిన అమ్మాయికి దూరమయ్యే పరిస్థితి ఏర్పడం, ఒక గడువు వరకు సిగరెట్ తాగకుండా ఉంటే తన కూతురుని ఇచ్చి పెళ్లి చేస్తానని తండ్రి మాటివ్వడం, దానికోసం రాజా పాట్లు పడటం. ఇవే అంశాలతో సినిమా సాగుతుంది.
స్టోరీ చూస్తే చాలా సింపుల్‌గా అనిపించిన టేకింగ్ మాత్రం బాగా నవ్విస్తుంది. సిగరెట్‌తో బతకడం, ప్రేమ కోసం అదే సిగరెట్‌ను వదులుకోవడం బిగినింగ్, ఎండింగ్ పాయింట్స్ క్లియర్‌గా తెలిసినప్పటికీ చివరి వరకు కామెడీతో బాగా ఎంగేజ్ చేసేలా చేశారు. రాజా సిగరెట్ మానేందుకు చేసే ప్రయత్నాలు నవ్విస్తాయి. కమెడియన్లతో చేసిన కామెడీ ట్రాక్ మాత్రం అంతగా ఆకట్టుకోదు.
సినిమాలో కొన్ని డైలాగ్స్ బాగా పేలుతాయి. డైరెక్టర్ సతీష్ వెగేశ్న మార్క్ వాటిలో కనిపిస్తుంది. అయితే, 2020లో మొదలైన ఈ సినిమా 2025లో రిలీజ్ అయింది. అప్పటి రైటింగ్‌కు ఇప్పటి ట్రెండ్‌కు కాస్తా డిఫరెన్స్ కనిపిస్తుంది. క్లైమాక్స్ ఊహించినట్లుగానే ఉన్న ఒక ట్విస్ట్ ఆకట్టుకుంటుంది. ఇక సంగీతం, పాటలు పర్వాలేదు.
సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. నార్నే నితిన్ మొదటి సినిమా అయినప్పటికీ బాగా చేశాడు. తనదైన స్టైల్‌తో అలరించాడు. హీరోయిన్ సంపద పర్వాలేదు. వీకే నరేష్, రావు రమేష్ తమ యాక్టింగ్‌తో మెప్పించారు. మిగతా పాత్రలు సన్నివేశాలకు తగినట్లు చేశారు. ఫైనల్‌గా చెప్పాలంటే సింపుల్ స్టోరీతో మెప్పించే కామెడీ సినిమా శ్రీ శ్రీ శ్రీ రాజావారు మూవీపై ఓ లుక్కేయొచ్చు.
సంబంధిత కథనం